

జాన్ బన్యన్ జీవిత చరిత్ర
పూర్తి పేరు:- జాన్ బన్యన్
జన్మస్థలం:- ఇంగ్లాండ్లోని బెడ్ ఫోర్డ్
తల్లిదండ్రులు:- మార్గరేట్ బెంట్లీ, థామస్ బన్యన్ భార్య పేరు:- మేరీ
జననం:- నవంబర్ 1628
మరణం:- 1628 ఆగస్టు 31
రక్షణానుభవం:- 25 సంవత్సరాల వయసులో
సేవాఫలితం:- బైబిల్ తర్వాత బహుగా ప్రసిద్ధినొందిన ‘యాత్రికుని ప్రయాణం’ అనే పుస్తకమును రచించెను.
వ్యక్తిగత సాక్ష్యం:- జాన్ బన్యన్ ఇంగ్లాండ్లోని బెడ్ ఫోర్డ్ లో జన్మించెను. వారిది పేద కుటుంబం. అతని తండ్రి పేరు థామస్ జాన్. అతను పాత్రలు పోత పోయు కుమ్మరి పని చేసేవారు. జాన్ బన్యన్ చిన్నప్పటినుండి చాలా అల్లరిచిల్లరిగా తిరుగుతూ అబద్ధాలకు దొంగతనాలకు అలవాటు పడెను. ఎక్కువ విద్యాభ్యాసం చేయలేదు కానీ చదవడం, రాయడం నేర్చుకున్నాడు. 1644 లో తల్లి మరణించింది, ఆ తర్వాత ఒక నెలలోనే తన సహోదరి కూడా చనిపోయింది. వారి మరణం తరువాత అతని తండ్రి తిరిగి వివాహం చేసుకున్నాడు. తన తల్లి, చెల్లి మరణ వేదన; తండ్రి వలన ఆధరణ లేకపోవుటయే కాక, సవతి తల్లి వలన శ్రమలు ఇవన్నీ జాన్ బన్యన్ ను దేవుని దూషించువానిగా చేశాయి. తన గృహంలోనూ, హృదయములను ఎలాంటి సమాధానము లేనందున సైన్యంలో చేరి రెండు సంవత్సరాలు సైనికునిగా పని చేశాడు. సైన్యంలో ఉండగా ఒకసారి అతనికి నియమింపబడిన డ్యూటీ మరియొకనికి నియమించి నందున జాన్ స్థలంలో ఉండిన వ్యక్తి యుద్ధంలో మరణించెను. దేవుడే ఏదో ఉద్దేశంతో మరణము నుండి తనను తప్పించాడు అని గ్రహించెను. సైన్యం నుండి బయటకు వచ్చిన తర్వాత అతడు తన తండ్రి వృత్తిని ప్రారంభించాడు. ఆ తర్వాత మేరీ అను భక్తి గల పేద స్త్రీని వివాహము చేసుకొని పేదరికంలో ఉండెను. అయితే తన భార్యతో మందిరానికి వెళ్తుండేవాడు అయినప్పటికీ ఆత్మీయ అభివృద్ధి లేక పాపము ద్వారా వచ్చే తీర్పును గురించి భయపడుతూ జీవించేవాడు. పుస్తకాలు ఎక్కువగా చదివి తర్కిస్తుండేవాడు. అయితే కొందరు స్త్రీలు ఆయనకు రక్షణ గురించి తెలియజేసి గిఫోర్డ్ అనే పాదిరి గారికి పరిచయం చేసిరి. ఆయన సువార్తను వివరముగా బోధించి రక్షణ గురించి తెలియజేయగా జాన్ బన్యన్ తాను క్షమించలేని పాపములు చేసితినని పశ్చాత్తాపపడి పాపములు ఒప్పుకొని మారుమనస్సు పొందెను. మారుమనస్సు పొందిన తర్వాత కూడా ఆయనకు కష్టాలు వచ్చాయి. అయితే దేవుని దూషించుకుండా దుఃఖంలో కూడా దేవుని పట్టుకొనెను.
ఆయనకు అంధురాలు అయిన కుమార్తె జన్మించినప్పటికీ, కొద్ది కాలమునకే భార్య మరణించినప్పటికీ దేవునిపై ఉన్న విశ్వాసం వీడక క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్ఛుచుండెను. ఆ దినములలో ఇంగ్లాండ్ దేశంలో అభిషేకించబడిన వారు తప్ప మరెవరూ ప్రయోగించకూడదు అనే చట్టం ఉండేది. అలా చేసిన యెడల శిక్షించబడతారు. అటువంటి చట్టం ఉన్నదని జాన్ ఎరిగినప్పటికీ ‘సువార్తను ప్రకటించకపోయినా ఎడల నాకు శ్రమ’ అని మనుషులకంటే దేవునికే విధేయులగుట మేలని ధైర్యంతో ప్రసంగించెను.. చాలా బలమైన ప్రసంగాలు చేస్తుండటం వల్ల జనం గుంపులు గుంపులుగా వచ్చి వాక్యము వినుచుండేవారు. జాన్ బన్యన్ దేవునిపై ఆధారపడుతూ, దేవుని నుండి వచ్చిన మాటలను ప్రజలకు బోధిస్తూ ఉండేవాడు. ఆయన గృహంలోనూ బహిరంగంగానూ ప్రసంగిస్తూ ఉండటం వలన అతనిని చెరసాలలో బంధించి ఉంచారు. మరెన్నడూ ప్రసంగించకూడదని ప్రమాణము చేసిన ఎడల విడిపించేదమనిరి. కానీ ఆ విధముగా చేయుటకు జాన్ నిరాకరించాడు. పైగా ఈ దినము విడుదల చేసిన యెడల రేపు ప్రసంగించెదను అనెను. మరియు దేవునికి అవిధేయుడగుటకంటే చెరసాలలోనే నా కండ్లపై నాచు పెరుగు వరకు చెరసాలలోనే ఉంటాను అనేవాడు. అందుకే అతనికి శిక్ష 12 సంవత్సరాలు పొడిగించబడింది. ఆ జైలు ఎంతో మురికిగా, చీకటిగా ఉన్నప్పటికీ జైల్లో ఉన్న వారికి సువార్తను బోధించుచు, వారితో ప్రార్ధించెను. ఆ పన్నెండు సంవత్సరములు తన సమయమును ఏమాత్రము వ్యర్థపరచక ప్రతి నిమిషము ప్రార్థనలను, ధ్యానంలోను గడిపెను. ప్రపంచంలో గొప్ప పేరు పొందిన ‘యాత్రికుని ప్రయాణం’ అను పుస్తకమును జైలులో వ్రాసెను. అనేక సంవత్సరములుగా ఉన్న ఆయన ఆశ నెరవేరింది. నాశనపురము నుండి పరలోకపురమునకు ఒక యాత్రికుని ప్రయాణంలో గల శోధనలను, శ్రమలను, విజయములను చక్కగా వివరించెను. ఆ పుస్తకము 100 కంటే ఎక్కువ భాషలలో తర్జుమా చేయబడింది. జాన్ తన 43 వ సంవత్సరంలో జైలు నుండి విడుదల పొందిన తరువాత ‘పరిశుద్ధ యుద్ధం’ అను మరొక గొప్ప పుస్తకమును వ్రాసెను. తరువాత బెడ్ ఫోర్డ్ లోని బాప్టిస్ట్ సంఘమునకు పాదిరిగా పనిచేసి అనేక ఆత్మలను సంపాదించెను. అతని మరణ సమయానికి మరో ఆరు పుస్తకములను రాసి ప్రింట్ చేసెను. మరో 16 పుస్తకములు ప్రింట్ చేయుట కొరకు సిద్ధపరచెను. 1688 వ సంవత్సరంలో ఆగస్టు 31వ తేదీన ప్రభువు నందు నిద్రించారు..
గొప్పపలుకు:- మనుషుల కంటే దేవునికి విధేయులగుట మేలు..