C.T. STUD జీవిత చరిత్ర

పూర్తి పేరు:- చార్లెస్. టి. స్టడ్
జన్మస్థలం:- ఇంగ్లాండ్ లోని విల్ట‌్‌‌ షైర్
తల్లిదండ్రులు:- ఎడ్వర్డ్ దంపతులు
భార్య పేరు:- ప్రిస్కిల్లా స్టేవార్డు
జననం:- 1860 డిసెంబర్ 2
మరణం:- 1931 జూలై 16
సేవాకాలము:- 40 సంవత్సరాలు చేసి ఉండొచ్చు.

సేవాఫలితము:- క్రికెటర్ గా మంచి పేరు పొంది కోటీశ్వరుడైనప్పటికీ, క్రీస్తు కొరకు వాటన్నిటినీ విడిచి చైనా, ఆఫ్రికా దేశాలలో సువార్త ప్రకటించి అనేకులను ప్రభువు కొరకు సంపాదించెను.

వ్యక్తిగత సాక్ష్యం:- చార్లెస్. టి. స్టడ్, ఎడ్వర్డ్ అను ఒక ధనవంతుని కుమారుడు. చిన్నప్పటి నుండి ఎంతో సౌఖ్యముగా, ఆడంబరముగా పెరిగినవాడు. క్రికెట్ యందు, వేట యందు, గుర్రపు పందేముల యందు ఆశక్తి కలిగినవాడు. తన 16 ఏళ్ళ వయస్సులోనే క్రికెట్ ఆటలో ప్రావీణుడయ్యాడు. అందమైన, దృఢమైన శరీరం కలిగి తన ఆట నేర్పరితనంవలన అతిశయించువాడు. అనేక గంటలు అద్దం ముందు గడిపేవాడు. ఇంతలోనే డి.ఎల్ మూడీ గారు జరిపించిన కూటముల ద్వారా అతని తండ్రి పశ్చాత్తాపపడి, మారుమనసు పొందెను. అప్పటి నుండి తన తండ్రి సొంత పనులను విడిచిపెట్టి క్రీస్తు కొరకు జీవించాలని నిర్ణయించుకున్నాడు. కుమారులు కూడా రక్షించబడాలని ప్రార్థిస్తూ ఉండేవాడు. అయితే స్టడ్ కూడా మూడీ గారి ద్వారా సువార్త విని కదిలించబడినను తన హృదయాన్ని ప్రభువుకిచ్చుటకు వెనుకాడుచుండెను. అయితే తన సహోదరుడైన జార్జి బహు వ్యాధిగ్రస్తుడై పడకమీద ఉండటం చూసినప్పుడు గొప్ప కనువిప్పు కలిగెను. ఈ లోకపు అందచందాలు, ఆస్తిపాస్తులు తాత్కాలికమైనవని, ఆధ్యాత్మిక జీవితం ఎంతో విలువైనది అని గ్రహించుకునెను.

తరువాత డి.ఎల్ మూడీ గారు జరిపిస్తున్న విద్యార్థుల కూటములకు హాజరై తన జీవితమును పూర్తిగా దేవునికి సమర్పించుకున్నాడు. తను బి.ఏ చదువు పూర్తి చేసి న్యాయవాది అవ్వాలని కోరుకొనెను. కానీ ప్రపంచంలో వేలకొలది ఆత్మలు నశించుచుండగా లోక ఘనతను, అందమును ఆశించి నా జీవితమును ఎట్లు వృధాపరచుకొనగలను అనుకొని క్రీస్తు కొరకు మిషనరీగా వెళ్ళగోరెను. అయితే క్రికెట్ ఆటను, చదువును, తల్లిదండ్రులను విడిచి యేసును వెంబడించ నిశ్చయించుకొనెను. క్రికెట్ లో ప్రఖ్యాతి గడించినవారు, స్టడ్ ను ఎరిగిన వారు అనేకులు ఉండిరి. గనుక వారి యొద్దకు వెళ్లి ఏసుక్రీస్తు తనను ఎలాగూ మార్చెనో సాక్ష్యమివ్వటం విని అనేకులు ఆశ్చర్యపడుచుండిరి. తన జీవితంలో మిషనరీగా ఎక్కడికి వెళ్లవలెనో ప్రార్థించుచుండగా ”నన్ను అడుగు జనములు నీకు స్వాస్థ్యముగానూ, భూమిని దిగంతములవరకు సొత్తుగానూ ఇచ్చెదను అను స్వరమును మాటిమాటికీ వినుచుండెను. సువార్త అందని కోట్ల కొలది ప్రజలు ఉన్న చైనా దేశమునకు దేవుడు తనను వెళ్ళమనుచున్నాడు అనే గ్రహింపు కలిగెను. అయితే అతని తల్లిదండ్రులు, స్నేహితులు ఇంగ్లాండ్ లోనే సేవ చేయమని బ్రతిమాలినప్పటికీ తాను 1885 ఏప్రిల్ 01వ తేదీన చైనా దేశం చేరెను. షాంగై పట్టణము చేరి ఏడు దినాలు కష్టపడి చైనా భాష నేర్చుకున్నాడు. ప్రతిరోజు ఇంచుమించు 40 మైళ్ళ చొప్పున నడిచి సువార్త ప్రకటించెను. ఎన్నో కష్టాలకు ఓర్చికొని ఆత్మల రక్షణార్థమై ప్రయాసపడెను. తండ్రి మరణించాడు అని, తనకు రావాల్సిన ఆస్తిని విడిచిపెట్టాడు అనే వార్తను విన్న తర్వాత ఆస్తిని ప్రేమించక ఆస్తిలో కొంత భాగాన్ని డి.ఎల్ మూడీ గారి పరిచర్యకు, మరి కొంత భాగాన్ని అనాధ పిల్లలకు సేవ చేయుచున్న జార్జి ముల్లర్ గారికి, మరికొన్ని డాలర్లను పేద ప్రజల మధ్య సేవ చేయుచున్న విలియం బూత్ స్థాపించిన రక్షణ సైన్యమునకు, మరి ఇతర సేవకులకును పంచి ఇచ్చెను. అటు తర్వాత దేవుడు అతనిని అత్యధికముగా దీవించెను. ఆయన పరిచర్యలో ఎప్పుడూ ఏ లోటూ కలుగలేదు.

ఆ తరువాత ఐరిష్ దేశమునకు చెందిన ప్రిస్కిల్లా స్టెవార్డ్ అను యువతిని వివాహము చేసుకొనెను. దేవుడు వారిని దీవించి ఐదుగురు బిడ్డలను ఇచ్చెను. అనేక కష్టనష్టాలను ఓర్చుకుని ఏడు సంవత్సరాల తర్వాత ఎనిమిది వందల మంది స్త్రీలు, పురుషులు రక్షించబడిరి. అయితే ఆయన ఆరోగ్యము బహుగా దెబ్బతినడం వల్ల ఇంగ్లాండ్ దేశమునకు తిరిగి వచ్చి ఆరు సంవత్సరాలు ప్రార్థనలో గడిపెను. ఆరోగ్యం కుదుటపడిన తరువాత దక్షిణ భారతదేశమునకు మిషనరీగా వచ్చి పరిచర్య చేసెను. సేవలో అనేక ఇబ్బందులు ఎదురవడం వల్ల మరలా వ్యాధిగ్రస్తుడైనందున తన దేశమును చేరి విశ్రాంతి తీసుకోనెను. మరలా అదే రోజుల్లో ఆఫ్రికా వారికి మిషనరీ కావాలని ప్రకటన చూచెను. ఆ దేశానికి ఎంతో మంది ఆఫీసర్లు, వ్యాపారస్తులు వెళ్తున్నారు. కానీ యేసును గూర్చి చెప్పుటకు ఎవరూ వెళ్లడం లేదు అని ఆలోచిస్తుండగా ”నీవు వెళ్ళుము” అను స్వరమును స్టడ్ వినెను కానీ పదిహేను సంవత్సరాలుగా వ్యాధితో బాధపడుచున్నాను అని అనగా నేను స్వస్థపరచుగలను ఆఫ్రికాలాంటి చీకటి ఖండానికి నీవే వెళ్లాలి అని ప్రభువు స్వరమును మరలా విన్నారు. అయితే అప్పటికీ అతనికి ఉన్న ఆస్తి అంతా చైనా, భారత్ సేవకు ఖర్చు చేశాడు పైగా అతని శరీరం కూడా క్షీణించిపోయింది. అయితే ఆఫ్రికా కొరకు నా ప్రాణాన్ని త్యాగం చేస్తానని సిద్ధపడ్డాడు. ఆఫ్రికా వెళ్లి 20 సంవత్సరాలు సేవ చేశాడు. అనేకులకు సువార్తను ప్రకటించి క్రీస్తు కొరకు అనేకులను సంపాదించాడు. చివరికి వృద్ధాప్యంలో 69వ ఏట ఆఫ్రికాలో ఒక చిన్న గుడిసెలో మరణించి ప్రభు సన్నిధికి వెళ్ళాడు..

గొప్పపలుకు:- జూదగాడు జూదములో సమస్తమును కోల్పోయినట్లే, యేసు కొరకు మనకు ఉన్నదంతా త్యాగం చేయాలి అనేవాడు..

324 Views
Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account