హడ్సన్ టేలర్ జీవిత చరిత్ర
పూర్తి పేరు:- జేమ్స్ హాడ్సన్ టేలర్
జన్మస్థలం:- ఇంగ్లాండ్ లోని “యారూశైగీ”
తల్లిదండ్రులు:- జేమ్స్ టేలర్, అమీలియా
భార్య పేరు:- మేరీ డైర్
జననం:- 1832 మే 21
మరణం:- 1905 డిసెంబర్ 22
రక్షణానుభవం:- 14 సంవత్సరాల వయస్సులో
సేవా ఫలితము:- చైనా దేశంలో సువార్త ప్రకటించి “చైనా ఇన్ లాండ్ మిషన్” ను స్థాపించెను..
వ్యక్తిగతసాక్ష్యం:- జేమ్స్ హడ్సన్ టేలర్ 1832 మే 21వ తేదీన ఇంగ్లాండ్లోని యారూశైగీ అనే స్థలంలో జన్మించెను.. “ప్రధమ ఫలం నాది” అను ప్రభువు మాటలకు విధేయతగా హడ్సన్ ను తల్లిదండ్రులు దేవుని సేవ కొరకు సమర్పించారు.. కానీ హడ్సన్ చిన్ననాటి నుండి చాలా బలహీనంగా ఉండేవాడు.. అందువల్ల పాఠశాలకు వెళ్లకుండా ఇంటివద్దనే ఉంటూ చదువుకునేవాడు.. నాలుగు సంవత్సరాల వయస్సులోనే తండ్రి వద్ద హెబ్రీ అక్షరాలు నేర్చుకునెను. ఈయన తల్లిదండ్రులు చిన్నప్పటినుండి ఈయనను భక్తిలో పెంచుచుండిరి.. అందువల్ల హడ్సన్ చిన్నప్పుడే ‘నేను పెద్దవాడైన తరువాత చైనా దేశానికి మిషనరీ’ గా వెళ్తాను అని అంటుండేవాడు..
పీటర్ పారే అను దైవజనుడు వ్రాసిన ఒక పుస్తకమును చదివిన టేలర్ చైనా దేశంలోని ప్రజలకు సువార్త అవసరము అని గుర్తించినప్పుడు చైనా దేశానికి వెళ్ళుటకు ప్రేరేపించబడెను. 14 సంవత్సరాల వయస్సులో పాఠశాలకు వెళ్ళుట ప్రారంభించిన హడ్సన్ ఆత్మీయ జీవితంలో కొంత దిగజారెను .. అయితే తల్లిదండ్రుల కన్నీటి ప్రార్ధనల ద్వారా ఒక నాడు ‘సమాప్తమైనదీ’ అనే ఒక సువార్త కరపత్రిక చదివి పశ్చాత్తాపపడి, మారుమనసు పొంది, రక్షణ భాగ్యమును పొందెను..
17 సంవత్సరాల వయసులో నా జీవితం పట్ల నీ చిత్తము ఏమిటి అని ప్రార్ధించినప్పుడు దేవుడు నా కొరకు “చైనా దేశమునకు వెళ్లుము” అని మాట్లాడినాడు.. అప్పటి నుండి చైనాకు మిషనరీగా వెళ్లి సేవ చేయుట కొరకు తన్నుతాను సిద్ధపరుచుకున్నాడు.. చైనా భాషను నేర్చుకున్నాడు, చైనా భాషలో ఉన్న లూకా సువార్తను గంటల తరబడి చదువుతుండేవాడు.. కఠినమైన శరీర శ్రమను అలవరచుకుని , ఎటువంటి సుఖాశక్తులకు స్థలమియ్యక తన్ను తాను శ్రమపరుచుకుంటూ ప్రతి పని తానే చేయుట నేర్చుకొనెను. . చైనా దేశంలో మిషనరీగా ఉండుట కొరకు వైద్య విద్యను కూడా నేర్చుకొనుటకు కాలేజీలో చేరాడు. ఈ కష్టాలు, పేదరికం అంతా ప్రభువుకు సన్నిహితముగా ఉండుటకు సహాయపడింది.. తన ఆదాయంలో మూడు వంతులు దేవునికి ఇచ్చి ప్రతి రోజు కాలేజీకి ఎనిమిది మైళ్లు నడిచి వెళుతూ ఉదయం, రాత్రి ఒక రొట్టె ముక్క తిని సరిపెట్టుకునేవాడు…
చివరికి 1853 లో తన 22 వ ఏట ఐదున్నర నెలలు ఓడలో ప్రయాణం చేసి చైనా దేశం చేరెను.. సువార్త ప్రకటనకు అవకాశాలు లేకున్నా భాష నేర్చుకొనుటకు, చైనా వారి వలే వేష భాషలందు ప్రావీణ్యం సంపాదించుకొనెను.. సరైన వసతి, ఆహారము లేనందువల్ల ఆరోగ్యం దెబ్బతిన్నా సువార్త ఆపలేదు.. అదే చైనాలో దేవుని సేవలో, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మేరీ డైర్ అనే ఆమెను వివాహము చేసుకొనెను.. విస్తారమైన సేవ వలన అనారోగ్య పీడితుడై ఆరోగ్యం కొరకు ఏడు సంవత్సరాల తర్వాత ఇంగ్లాండ్ ప్రయాణమయ్యాడు.. కానీ ఇంగ్లాండ్ లో ఉన్నప్పటికీ చైనా జాతీయపటాన్ని గోడకు తగిలించుకుని దేశం కొరకు భారంగా ప్రార్థించేవాడు.. ఆ దేశానికి 24మంది మిషనరీలు కావాలని దేవునిని అడిగేవాడు .. దానికొరకు ” చైనా ఇన్ లాండ్ మిషన్ ” అను సంస్థను ప్రారంభించాడు.. ఆ దేశంలోని 11 రాష్ట్రముల కొరకు, 38 కోట్ల జనుల కొరకు ప్రార్థించేవాడు..ఆ ప్రార్థనా ఫలితంగా 11 నెలల తర్వాత 16 మంది మిషనరీలతో చైనా బయల్దేరాడు. వీరి సేవలను దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించి ఇన్ లాండ్ మిషన్ ద్వారా 20 సంవత్సరాలకు 225 మంది మిషనరీలను చైనాకు పంపారు..
తన 12 సంవత్సరాల సేవలో తోడుగా ఉన్న తన భార్య, ముగ్గురు కుమార్తెలు దేశంలోని తీవ్ర పరిస్థితులు బట్టి చనిపోయారు . టేలర్ కూడా వెన్నెముక గాయమై కొన్ని నెలలు మంచం మీదనే ఉండి చైనా కోసం ప్రార్థించేవాడు. అయినా దేశంలో అనేక సంవత్సరాలు బలమైన పరిచర్య చేసి ఎందరికో ప్రభువును చూపిన టైలర్ 1905 డిసెంబర్ 22న చైనా దేశంలోనే ప్రభు సన్నిధికి చేరి పోయారు..
గొప్పపలుకు:- “ఆ ప్రభువు ఎంత శక్తిమంతుడో, నేనెంత బలహీనుడనో నిరూపించేందుకై ఆయన తన కృప ద్వారా నా వలన ఆయన బలమైన కార్యములు జరిగించెను..”