డేవిడ్ బ్రెయినార్డ్ జీవిత చరిత్ర
(దుర్బలుడైన వీర మిషనరీ – డేవిడ్ బ్రెయినార్డ్) అమెరికా నుండి రెడ్ ఇండియన్స్ మధ్యకు మిషనరీగా వెళ్ళెను…
పూర్తి పేరు:- డేవిడ్ బ్రెయినార్డ్
జన్మస్థలం:- అమెరికా సంయుక్త రాష్ట్రాలు కనెక్టికట్ రాష్ట్రంలోని ”హద్ధాం”
తల్లిదండ్రులు:- హిజ్కియా, దోరతి
జననం:- 1718 ఏప్రిల్ 20
మరణం:- 1747 అక్టోబర్9
రక్షణానుభవం:- 21 సంవత్సరాల వయసులో
సేవా ఫలితము:- అనేక శ్రమలు సహించి, ఎంతో క్లిష్టపరిస్థితుల్లో కీకా అరణ్యములో ఉన్న రెడ్ ఇండియన్స్ మధ్య గొప్ప త్యాగపూరిత సేవ చేసి అనేకులకు మార్గదర్శి అయ్యెను…
వ్యక్తిగత సాక్ష్యము:- డేవిడ్ బ్రెయినార్డ్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 1718 వ సంవత్సరంలో ఏప్రిల్ 20 వ తేదీన జన్మించాడు. చిన్న వయసు నుండి ఆత్మను గూర్చి, మరణానంతర జీవితం గురించి ఆలోచించేవాడు. తన హృదయంలో నిత్య సంతోషం ఉండవలెనని మరణిస్తే పరలోకం చేరాలని ఆశించేవాడు. తొమ్మిది సంవత్సరాలకే తన తండ్రిని, 14 సంవత్సరాల వయస్సులో తన తల్లిని పోగొట్టుకొని అనాధైన బ్రెయినార్డ్ కృంగియుండెను.. కానీ చెడు స్నేహములకు దూరముగా ఉండీ రహస్య ప్రార్థనలో, బైబిల్ చదవడంలో, ఎక్కువ సమయం గడపటం అలవాటు చేసుకునెను. తన 21వ ఏట లోతైన మారుమనస్సు పొంది తన స్వనీతిని బట్టి కాక దేవుని కృప వల్లనే రక్షించబడితినని చెబుతూ ఉండేవాడు..
బ్రెయినార్డ్ మంచి ప్రార్ధనాపరుడు, అత్యంత ప్రతిభావంతుడు. ప్రార్ధనాపరుడైన బ్రెయినార్డ్ ని కాపరిగా ఉండమని అనేక సంఘాలు ఆహ్వానించాయి. కానీ తాను రెడ్ ఇండియన్స్ కు యేసు క్రీస్తు ప్రేమను తెలియపరచాలని నిశ్చయించుకొని కీకా అరణ్యములో చొరబడి ప్రయాణము చేస్తూ ఎంతో ప్రయాసతో వారిని చేరుకున్నాడు.. నరమాంసభక్షకులైన ఆ అనాగరికులను యేసు వైపు త్రిప్పుటకు అమెరికా కీకారణ్యంలో ఏకైక విశ్వాసవీరుడిగా వెళ్లి రేయింబవళ్ళు వారి కొరకు కన్నీటితో ప్రార్థిస్తూ సువార్త ప్రకటించాలని పూనుకున్నాడు. తన భాష వారికి, వారి భాష తనకు తెలియకపోయినా దిగులుపడక ప్రార్ధించెను.. అప్పుడు బ్రెయినార్డ్ కు త్రాగుబోతు, విగ్రహారాధికుడైనా ఒకడు అనువదించుటకు దొరికెను. అతని సహాయంతో యేసు ప్రేమను గురించి బోధించుచుండగా కొన్ని దినములలోనే ఆ త్రాగుబోతు తాను పాపినని పశ్చాత్తాపపడి మార్పు చెందెను..
ఆ తరువాత అనేకులు క్రీస్తు ప్రేమను గుర్తించి మారిరి. వారి క్రూర స్వభావములను, నీచాతి నీచమైన కార్యములను విడిచిపెట్టి యేసు ప్రభువును నమ్ముకొనిరి. కీకా అరణ్యములో నివసిస్తూ ఒక్క రొట్టె ముక్క కోసము 10 or 15 మైళ్ళు గుర్రంపై ప్రయాణం చేయవలసి వచ్చేది.. అనేకసార్లు ఆ రొట్టెకు బూజు పట్టి, గట్టి పడిపోయి ఉండేది. క్రీస్తు కొరకు ప్రయాసపడుతూ, శ్రమ అనుభవించుట భాగ్యమని ఎంచుకున్న బ్రెయినార్డ్ అటువంటి రొట్టెలతో గడుపుతూ, గుంటలలో మురికి నీరు త్రాగుతూ, చిన్న బల్ల చెక్కపై గడ్డి పరచుకుని పడుకునేవాడు.. అచ్చట తనను అర్థం చేసుకునే స్నేహితులు, బలపరిచే మిత్రులు లేనందున కొన్నిసార్లు ఎంతో కృంగిపోయేవాడు.. కానీ దేవుని సన్నిధిలో ఆనందం ఉంది అని తన సమయాన్ని ప్రార్థనలో గడిపేవాడు…
ఇలాంటి శ్రమల మధ్యలో ఆయన చేసిన పరిచర్య ఫలించేను..అనేక ఆత్మలు రక్షించబడ్డాయి.. తన డైరీలో ఆత్మల కొరకు తాను పడిన వేదన, దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థనలు, దేవుడు చేసిన అద్భుతముల గురించిన అనేక సంగతులను వ్రాసి ఉంచుకున్నాడు.. అవి చదివిన వారికి ఈనాటికీ ఆయన సేవా జీవితము సవాలుగా ఉన్నది.. ఈయన సేవ యుద్ధం లాంటిది. సాతాను ఉచ్ఛుల్లో ఉన్న మనుషులను విడిపించుటకు ప్రాణాలు లెక్క చేయక యుద్ధవీరుడిలా పోరాడిన ఈయన మాటలలో, చేతలలో బహిరంగంగానూ, వ్యక్తిగతంగానూ రాత్రింబవళ్ళు ఆత్మల సంపాదనకు ప్రయాసపడెను..జోనాథన్ ఎడ్వర్డ్స్ గారు ఆయన గూర్చి ఇలా అన్నాడు.. ”విజయవంతమైన సేవలు ఆశించే వ్యక్తులకు ఆయన మార్గదర్శి” యుద్ధభూమిలో విజయం కోసం పోరాడే యోధుడిలా ఆయన పోరాడాడు.. గొప్ప బహుమానాన్ని అందుకోవడానికి శాయశక్తులా పరిగెత్తే ఓ పందెగాడిలా ఆయన పరుగెత్తాడు.. క్రీస్తు కోసం, ఆత్మల కోసం తపించిపోయి ఆయన చేసిన కృషి, ప్రయాసలు ఇంతా అంతా అని చెప్పలేము… సుఖమనేది ఎరుగడు, ఎప్పుడూ ఏదో ఒక అపాయానికి గురవుతూనే ఉండేవాడు, వేళకు భోజనం ఉండదు, సరైన ఆహారము దొరకడం కూడా గగనమయ్యేది… ఇన్ని ఇబ్బందులకు లోనై పశువుకన్నా హీనంగా బ్రతుకుతున్న ఈయన ఏనాడు మిషనరీ పని వదిలిపెట్టి పోవాలనే యోచన అతనికి కలగలేదు.. అయినప్పటికీ గాలి పీల్చడం ఎంత సులభమో అతనికి ప్రార్థన చేయడము అంతే…..
ఆయన ఆశయం అంతా కూడా తను ఎవరి వద్దకైతే పంపబడ్డాడో వాళ్లు క్రీస్తు రూపం లోనికి మార్చబడాలి అని పట్టు విడువని ప్రార్థనా పరుడైన యాకోబుకు వారసుడిలా పట్టువిడవకుండా అనేక రాత్రులు ప్రార్థనలో పోరాడిన మహనీయుడు డేవిడ్ బ్రెయినార్డ్..అయితే బ్రెయినార్డ్ 29 సంవత్సరాలు జీవించి చేసిన సేవ 4 సంవత్సరాలే అయినా 70 సంవత్సరాలు జీవించి చేసిన సేవ కంటే ఎక్కువ సేవ చేశాడు అని అంచనా వేయబడినది.. డేవిడ్ బ్రెయినార్డ్ నేను ఎంత బలహీనుడునైనా, ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నా, నా మరణం వరకు అనేకులను ప్రభు దగ్గరకు నడిపించగలిగితే అదే నాకు 10,000 అని తన డైరీలో రాసుకున్నాడు… తన ఆరోగ్యము కన్నా అన్యజనుల రక్షణకు ప్రాధాన్యతనిచ్చి శరీర ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల బలహీనుడైన బ్రెయినార్డ్ వ్యాధిగ్రస్తుడయ్యెను.. అయినను ఆత్మలను రక్షించాలనే భారంతో పరిచర్యను కొనసాగించాడు.. అయినను నేను దేవుని కొరకు ఎక్కువ సేవ చేయలేకపోతిని అని నాకు వెయ్యి ఆత్మలు ఉన్నచో వాటిని దేవుని కొరకై సమర్పించి ఉందును అని విలపించెను..
చివరికి 1747 అక్టోబర్ 9 వ రోజు అనగా శుక్రవారం నాడు సరిగ్గా సూర్యుడు ఉదయించే వేలకు ”యేసు వచ్చెను ఆయన ఆలస్యము చేయడు నేను త్వరలో మహిమలో ఉందును, దేవదూతలతో కలిసి దేవుని మహిమపరతును.” అని పలుకుతూ ప్రభువు సన్నిధానానికి వెళ్ళిపోయాడు…..