

రిచర్డ్ ఉర్మ్ బ్రాండ్ జీవితచరిత్ర
పూర్తిపేరు:- రిచర్డ్ ఉర్మ్ బ్రాండ్
జన్మస్థలము:- రుమేనియాలోని బుకారోస్ట్ పట్టణం
జననం:- 1909 మార్చి 24
మరణం:- 2001 ఫిబ్రవరి 17
భార్యపేరు:- సబీనా ఓస్టర్
రక్షణానుభవము:- 15 సంవత్సరాల వయసులో
సేవాఫలితము:- కమ్యూనిస్ట్ ప్రాంతాలలో భయంకరమైన ప్రజల మధ్య క్రీస్తు ప్రేమను ప్రకటించి అనేకులను క్రీస్తు కొరకు సంపాదించింది ‘లవ్ ఇన్ యాక్షన్’ అనే పేరుతో ఒకసంస్థను ప్రారంభించి అనేకుల అవసరాలు తీర్చాడు.
వ్యక్తిగతసాక్ష్యం:- రిచర్డ్ ఉర్మ్ బ్రాండ్ రుమేనియాలోని బుకారోస్ట్ పట్టణంలో ఒక పేద యూదుల కుటుంబములో జన్మించాడు. పసితనంలో అనాధ ఆయెను. తిండి కొరకు ఎంతో కష్టపడుచు 14 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి ఒక నాస్తికుడుగా జీవించుట ప్రారంభించెను. కానీ ఒక వడ్లవాని యొక్క ప్రార్థన ద్వారా మరియు సువార్త ప్రకటనద్వారా యేసును రక్షకునిగా స్వీకరించాడు. యేసుప్రభు యొక్క పరిశుద్ధజీవితము తనయొక్క పాపజీవితమును, అపవిత్రతను, ద్వేషముతో కూడిన జీవితమును గుర్తుచేసుకుని ఎంతో విలపిస్తూ ఉండేవాడు. తన పూర్ణహృదయముతో యేసునందు విశ్వాసముంచి రక్షించబడెను. 1945వ సంవత్సరంలో రష్యన్ సైనికులు రూమేనియాను హస్తగతం చేసుకున్నారు. భయంకరమైన ఆ కమ్యూనిస్టుల పరిపాలనలో వాళ్లకు ఎదురునిలిచి, బహిరంగంగానూ, అజ్ఞాతంగానూ ఈయన ప్రభువును గురించి బోధిస్తూ ఉండేవాడు. ఒకసారి కమ్యూనిస్టు వారు క్రైస్తవ శాఖలన్నిటికీ ఒకరోజున పార్లమెంటులో సభ ఏర్పాటు చేశారు. ఆయా గుంపులకు చెందిన పాస్టర్ లు, గురువులు, పరిచారకులు నాలుగు వేల మంది ఆ సభలో పాల్గొన్నారు. ఆ మీటింగ్ లో జోసఫ్ స్టాన్లీ అనే వ్యక్తిని సన్మానించాలని అనుకున్నారు.
ఇతడు ప్రపంచ నాస్తికసమాజానికి అధ్యక్షుడు, అనేకమంది క్రైస్తవులను హతమార్చిన నరహంతకుడు. అయితే పాస్టర్లు, బిషప్పులు లేచి కమ్యూనిజం, క్రైస్తవ్యం రెండు సిద్ధాంతాలు ఒకటేనని ఈ రెండు ముందుకు సాగటానికి వీలుంది అన్నారు. ఒకరి తర్వాత ఒకరు హామీ ఇచ్చి కొత్తప్రభుత్వానికి క్రైస్తవసంఘము అన్ని విధాలా తోడ్పడగలదని హామీ ఇచ్చారు. ఈ లోక సమస్యలకు సమాధానం కమ్యూనిజంనందే ఉందని అందరు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. అయితే ఆ సభలో రిచర్డ్ మరియు అతని భార్య ఉన్నారు. అతని భార్య అతనితో ఇట్లనెను. క్రీస్తు మీదికి వస్తున్న అవమానము తుడిచి వేయడానికి లేచి నిలువు అని చెప్పింది. వారు ఆయన ముఖం మీద ఉమ్మేస్తునారు అని చెప్పింది. అందుకు రిచర్డ్ తన భార్యతో అవును వారు క్రీస్తును అవమానపరుచుచుది నాకును వేదనకరముగా ఉన్నది కానీ నేనిప్పుడూ లేచి మాట్లాడితే నీవు భర్తను కోల్పోవలసి ఉంటుంది అని అన్నాడు. అందుకామె నా భర్త పిరికివాడిగా ఉండుటకంటే క్రీస్తు కొరకు నిలబడనందుకు లేకుండుటే మేలు అని అన్నది. అంతే..! రిచర్డ్ ఆ సభలో లేచి నిలబడి క్రీస్తే లోక సమస్యలకు సమాధానం అని, క్రీస్తు ద్వారా తప్ప లోకానికి వేరే గతి లేదని ప్రభువును పొగిడెను. ఆ దినము కమ్యూనిస్టు పార్లమెంటు నుండి ఇచ్చిన సందేశము దేశమంతటా రేడియోలో వినబడెను. చివరకు దాని ఫలితముగా 1948లో కమ్యూనిస్టులు ఆయన నిర్బంధనలోనికి తీసుకున్నారు. ఆయన భార్యను కూడా చెరపట్టి మూడు సంవత్సరాలు ఆమెతో వెట్టిచాకిరి చేయించారు. రిచర్డ్ మూడు సంవత్సరాలు ఏకాకిగా ఒకగదిలో నిర్బంధించబడి ఎంతో హింసించబడ్డాడు.
తరువాత ఖైదీలతో పాటు 5 సంవత్సరాలు బాధపెట్టారు. మొత్తంమీద 14 సంవత్సరాలు కమ్యూనిస్టు చెరసాలలో అమానుషంగా చిత్రహింస పొందాడు. అయినను ఎన్నడూ క్రీస్తును ద్వేషించలేదు, విడిచిపెట్టలేదు. ఆ పరిస్థితులలో 9 ఏళ్ల ప్రాయంలో ఉన్న వారి కుమారుడు వీధుల్లో వదిలివేయబడి అష్టకష్టాలపాలయ్యాడు. సబీనా ఉర్మ్ బ్రాండ్ చెరసాల నుండి విడుదలైన తర్వాత తన భర్త ప్రారంభించిన పనిని కొనసాగించడానికి అజ్ఞాత సంఘాన్ని ఐక్యము చేయటానికి ఎంతో ప్రయాసపడెను. 1964లో రాజకీయ ఖైదీలను విడుదల చేసే సందర్భంలో దేవుని కృపవలన రిచర్డ్ కు విడుదల దొరికినది. కానీ రహస్యసంఘసేవను తిరిగి పున:ప్రారంభించుట వలన మళ్లీ అపాయములో చిక్కుకొనెను. ఇట్టి సమయంలో నార్వే ఇశ్రాయేలు సంస్థ మరియు హిబ్రూ క్రిస్టియన్ అలయన్స్ వారు లక్షడాలర్లు చెల్లించి ఆయనను విడిపించారు. ఇలాగు రుమేనియాను విడిచిపెట్టి స్వతంత్రదేశాలలోనికి వెళ్లి ఆయన ఎవరి కొరకు నానాహింసల పాలయ్యాడో ఆ క్రీస్తు ప్రేమను అనేకచోట్ల ప్రకటించాడు. ఆయన కమ్యూనిస్టు దేశాలలో చిత్రహింసల పాలగుచున్నవారి కొరకు, వారి అవసరాలను తీర్చుట కొరకు ‘లవ్ ఇన్ యాక్షన్’ అనే సంస్థను ప్రారంభించి గొప్ప పరిచర్య చేశారు. చెరసాలలో ఉన్న వారికి బైబిల్లు, కరపత్రాలు పంచుతూ రేడియో, టెలివిజన్ ద్వారా సువార్తను అందించుటకు కష్టపడి, ప్రయాసపడి కడవరకు నమ్మకంగా జీవించాడు. అనేక శ్రమలు ఎదుర్కొన్నాడు. కాని ఏనాడు వెనుతిరుగలేదు. చివరికి 2001 ఫిబ్రవరి 17వ తారీఖున ప్రభువునందు నిద్రించారు.