రాబర్ట్ మోఫాట్ జీవిత చరిత్ర
పూర్తిపేరు:- రాబర్ట్ మోఫాట్
తల్లిదండ్రులు:- రాబర్ట్, ఆన్ గార్డనర్
జన్మస్థలము:- స్కాట్లాండ్ లోని ఆర్మిస్టన్ పట్టణం
జననము:- 1795 డిసెంబర్ 21
భార్యపేరు:- మేరీ స్మిత్
రక్షణానుభవము:- 17 సంవత్సరాల వయస్సులో
మరణం:- 1883 ఆగస్టు 9
సేవాఫలితము:- ఆఫ్రికాదేశంలో మిషనరీగా అడుగుపెట్టి వారి యొక్క మూఢనమ్మకాలను తొలగించి వారిని విద్యావంతులను చేశాడు. అలాగే ఆఫ్రికా, బ్రిటన్ దేశాలలో ఈయన పరిచర్య కల్పవృక్షంలా విస్తరించడమే కాక అనేకమంది ఈయన సేవనుబట్టి మిషనరీలుగా వెళ్లారు.
వ్యక్తిగతసాక్ష్యం:- రాబర్ట్ మోఫాట్ 1795 డిసెంబర్ 21 తేదీన స్కాట్లాండ్ లోని ఆర్మిస్టన్ పట్టణంలో జన్మించాడు. అనేకమైన కష్టాలను ఎదుర్కొని, తల్లిదండ్రులమీద ఆధారపడక తన రెక్కల కష్టానికి అందినదానిలో తనను తాను పోషించుకుంటూ విద్యను అభ్యసించాడు. ప్రతి ఉదయం, సాయంత్రం బైబిల్లోని ఒక్కొక్క అధ్యాయము క్రమం తప్పకుండా చదువుతూ కంఠస్థం చేసేవారు. అయితే క్రీస్తును తన రక్షకునిగా అంగీకరించిన నాటినుంచి మిషనరీ పరిచర్య తన ధ్యేయంగా భావించి లండన్ మిషనరీ సొసైటీ వారికి లేఖ రాశాడు. అయితే అతని యొక్క విద్యార్హతలు సరిపోవని అభ్యర్ధనను త్రోసివేసారు. అయితే పట్టువదలక చేసినా ప్రయత్నాల ద్వారా సొసైటీవారు ఆఫ్రికాలోని ‘కేప్ టవున్’ అనే ప్రాంతానికి మిషనరీగా పంపించారు.
అయితే భయంకరమైన సముద్ర ప్రయాణం ద్వారా ఆఫ్రికా చేరుకున్నాడు. అతను యొక్క ఉద్దేశం, దేవునిపై తనకున్న విశ్వాసం ఏమిటంటే ”నేను దేవునికి కావలసినవాడను దేవుడే నన్ను ఈ దేశానికి పంపించాడు, కాబట్టి ఏ శక్తి నన్ను ఆటంకపరచదు, నా ప్రయాణాన్ని ఆపలేదు” అని విశ్వసించేవాడు. అయితే అనేక జాతులు కలగలిసిన ఆ దేశంలో అందరితో సునాయాసంగా వెళ్లి పరామర్శించేవాడు. అక్కడ వృద్ధుల పట్ల వ్యవహరించే తీరు గమనించాడు. వారికి ఒకపూట మాత్రమే భోజనం పెట్టి ఎడారికి తొలివేసేవారు. అయితే వారికి క్రీస్తు ప్రేమను చూపించుట ద్వారా వారిని ఆకట్టుకున్నాడు. తన బోధనల మూలంగా వారిలో గొప్పమార్పు తేగలిగాడు. రాబర్ట్ అనేకమందిని వెలుగులోనికి నడిపించాడు. అయితే ఒకరోజు రాబర్ట్ ఒక భయంకరమైన గజదొంగ స్థావరంగా పిలువబడుతున్న ‘నామల్ కండ్’ అనే ప్రాంతానికి వెళ్లడానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి ఎవరు తెగించలేదు. కానీ రాబర్ట్ అదొక సవాలుగా తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడున్న ఆ క్రూరుని జయించి, అతని చేత క్రీస్తును అంగీకరింపచేసిన సంఘటన ఆఫ్రికన్లను ఆశ్చర్యపరిచింది. తరువాత లండన్ చేరుకొని ‘మేరీస్మిత్’ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. తన భార్య 50 ఏళ్ల పాటు తన భర్తకు సేవలో అండగా నిలిచింది. అలాగే దేవుడు వారికి కుమార్తెను అనుగ్రహించాడు. ఆ కుమార్తెను అదే ఆఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్ళిన ‘డేవిడ్ లివింగ్ స్టన్’ కు ఇచ్చి వివాహం చేశారు.
అయితే రాబర్ట్ ప్రయాణంలో అడుగడుగునా ఎన్నో వింత సంఘటనలు ఎదురయ్యాయి. ఒక దినము అతను ప్రయాణం చేస్తుండగా చనిపోయిన ఒకస్త్రీని పాతిపెట్టడానికి కొంతమంది గొయ్యి తవ్వుతున్నారు. వారికి చేరువులో మరో ఇద్దరు పాపలు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లు కూర్చున్నారు. అయితే చనిపోయిన తల్లితోపాటు బ్రతికున్న పసిపాపలను పాతిపెట్టడం వారి ఆచారమని తెలుసుకున్న రాబర్ట్ అదిరిపోయాడు. ఆలోచించే కొద్దీ గుండె ద్రవించి పోయి భయకంపితుడయ్యాడు. అయితే ఆ పిల్లలిద్దరినీ ఎత్తుకొని ఇంటికి తీసుకువెళ్ళి వారిని తన కుటుంబసభ్యులుగా చేసుకున్నాడు. అలా తన మిషనరీ సేవ ఫలించింది. ఎక్కువమంది క్రీస్తును అంగీకరించేవారు. కాబట్టి ఆఫ్రికన్లకు వారి భాషలోనే గ్రంథాన్ని ముద్రించాలని పట్టుదల కలిగింది. దాని విషయమై ప్రభుత్వ అధికారులను కలుసుకున్నాడు వారు మిషన్లు ఉన్నాయి కానీ కార్మికులు లేరని అధికారులు చెప్పారు. చివరికి అతికష్టం మీద స్నేహితుల సహాయంతో గ్రంథాన్ని ముద్రించాడు. అలా పూర్తి బైబిల్ ను వారి భాషలోకి అనువదించి, ముద్రించి ఆఫ్రికన్లకు అందించాడు. అలాగే యాత్రికుని ప్రయాణం కీర్తనలు పుస్తకం కూడా అనువదించి ముద్రించాడు.
ఆవిధంగా రాబర్ట్ యొక్క పరిచర్య అంచెలంచెలుగా విస్తరించింది. అతని పేరు, ప్రతిష్టలు ఆ దేశమంతా విస్తరించాయి. అయితే రాబర్ట్ దంపతులను కాలము కఠినంగా మారింది. మొదట తన పెద్ద కుమారుడు మరణించాడు. ఆ తర్వాత రెండవకుమార్తె డేవిడ్ లివింగ్ స్టన్ భార్య అయిన మేరీ కూడా మరణించింది. వరుస మరణాలు చూస్తున్నప్పటికీ కుప్పకూలిపోకుండా నిబ్బరంగా ఉంటూ ఎప్పటిలాగే మిషనరీ సేవ కొనసాగించారు. రాబర్ట్ వయసు మించిపోయి ఆరోగ్యము క్షీణిస్తూనే ఉంది. తర్వాత ఏడాది గడవక ముందే రాబర్ట్ భార్య కూడా చనిపోయింది. అందువల్ల ఎంతో క్రుంగిపోయి కదలలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వ్రాయడం, ప్రసంగించడం, ముద్రించటం మానలేదు. తరువాత 1872 లో ఎడిన్ బరో యూనివర్సిటీ వారు ‘డాక్టర్ ఆఫ్ డివినిటీ’ బిరుదుతో సత్కరించారు. చివరికి తాను 1883 ఆగస్టు 9న తన 83వ ఏట ప్రభువు చెంతకు వెళ్ళిపోయాడు.
గొప్పపలుకు:- నాకు వెయ్యి జీవితాలు, వెయ్యి శరీరాలు ఉన్నట్లయితే అవి క్షీణించినా, తృణీకరించబడినా ప్రియమైన మానవులకు క్రీస్తును గురించి బోధించడం తప్పా, వేరే ఉపాధికి ఆ జీవితాలను అంకితం చేయకూడదు.