జార్జ్ విలియమ్స్ జీవిత చరిత్ర

పూర్తిపేరు:- జార్జ్ విలియమ్స్
తల్లిదండ్రులు:- ఆమోసు విలియమ్స్ దంపతులు
జన్మస్థలం:- ఇంగ్లాండు దేశంలోని సోమర్‌సెట్ అనే ప్రాంతం
జననం:- 1821 సెప్టెబరు 11
రక్షణానుభవము:- 16 సంllల వయసులో
మరణం:- 1905 అక్టోబర్ 6

సేవాఫలితము:- బట్టల వ్యాపారం చేస్తూ ప్రభువు కొరకు ప్రపంచంలోనే అతిపెద్ద యవ్వనస్థుల సంఘమైన “యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్” (వై.ఎం.సి.ఎ) (క్రైస్తవ యువకుల సంఘం) స్థాపించి యువకుల ఆత్మీయ స్థితిని మెరుగుపరచారు.

వ్యక్తిగతసాక్ష్యము:- ఒక ఉన్నతమైన వ్యవసాయ కుటుంబములో జన్మించారు విలియమ్స్. కొన్ని సంవత్సరాల పాటు పాఠశాల విద్యను అభ్యసించిన తరువాత అతను వారి పొలంలో పనిచేయడం ప్రారంభించారు. అయితే విలియమ్స్ యొక్క జీవితం దేవుడు లేని జీవితముగా ఉంది. పిమ్మట అతను ఒక వస్త్రాల వ్యాపారి వద్ద సహాయకునిగా పనిచేయడం ప్రారంభించగా, అక్కడి తన యజమాని ఒత్తిడి మేరకు ఒక క్రైస్తవాలయంలో ఉదయకాలపు కూడికకు హాజరుకావడం మొదలుపెట్టారు. కాగా 1837వ సంll ఒక ఆదివారపు సాయంకాలం, అతను సువార్త వలన లోతుగా కదిలింపబడి తన జీవితమును యేసు క్రీస్తు ప్రభువుకు సమర్పించుకున్నారు. ఆ రక్షణానుభవమును గురించి అతను వ్రాస్తూ, “నా పాపముల కొరకు ప్రభువైన యేసు క్రీస్తు మరణించారని నేను మొదటిసారిగా చూసినప్పుడు నా హృదయాంతరంగములలో పెల్లుబికిన సంతోష సమాధానములను నేను వర్ణించలేను” అని వివరించారు.

అప్పటి నుండి తన జీవితాంతము వరకు తాను కలుసుకున్న ప్రతి ఒక్కరికీ సాక్ష్యమిచ్చారు విలియమ్స్. తదుపరి వస్త్రాల వ్యాపారమును ఉపాధిగా ఎంచుకొనిన విలియమ్స్, అందులో ముందుకు కొనసాగుటకుగాను లండన్ నగరమునకు వెళ్ళారు. తాను భక్తి కలిగిన క్రైస్తవుడగుటచే తాను పనిచేసే స్థలములోని తోటి పనివారైన యువకుల ఆత్మీయ స్థితిని గురించిన భారమును అతను కలిగియుండేవారు. కాగా వారి జీవితములను మార్చుటకు ఏదైనా చేయవలెననుకొనిన అతను మరియు అతని స్నేహితుడు కలిసి అందుకొరకు ప్రార్థించి ఆ యువకులను సువార్తతో సాధించుటకు ప్రణాళికలు రూపొందించారు. త్వరలోనే వారి ప్రార్థనలకు సమాధానం లభించింది. చాలా మంది యువకులు వారితో పాటు కలిసి ప్రార్థించుటకు కూడుకున్నారు. వారు పనిచేసే సంస్థ మొత్తం ఒక సువార్త సంస్థగా మారింది. ఇతర వ్యాపార సంస్థలలో కూడా ఇదే మాదిరిని అవలంబించి ఫలితములను పొందవలెననిన విలియమ్స్ యొక్క దృఢ నిశ్చయం. తన స్వంత పడకగదిలో కేవలం 12 మంది సభ్యులతో మొదటి ‘వైఎంసిఎ’ స్థాపించబడుటకు దారితీసింది. ఆ చిన్న ప్రయత్నం విస్తృతముగా అభివృద్ధి చెందినదై ఇతర ఖండాలకు కూడా వ్యాపించింది. యువకుల ఆత్మీయ ఎదుగుదల కొరకై బైబిలు తరగతులు, ప్రార్థనా కూడికలు మరియు ఆత్మీయ సంస్థల ద్వారా ఈ వైఎంసిఎ సేవలందిస్తుంది. ‘ఎంత చిన్న పని అనేది కాదు కానీ, ఇతరుల కొరకు మనం ఎంత చేయగలం అనేది ముఖ్యం’ అనునది తన నినాదముగా చేసుకున్న జార్జ్ విలియమ్స్, తన తుది శ్వాస వరకు కూడా కనికరము కలిగిన క్రైస్తవునిగాను మరియు నిజమైన సువార్త యొక్క చిహ్నముగాను జీవించారు..

312 Views
Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account