Nehemiah – నెహెమ్యా

బబులోను చెర నివాసమునకు తరువాత యెరూషలేమునకు మూడవ సారిగా అనగా చివరి సారిగా తిరిగి వచ్చిన వారికి నాయకుడు నెహెమ్యా. నెహెమ్యా పారసీకదేశపు రాజైన అర్తహషస్తకు పానదాయకునిగా ఉండిన ఈయనకు యెరూషలేమును గురించి, అక్కడ కష్టపరిస్థితులలో జీవించిన ప్రజల గురించి కలిగిన భారము పరిశుద్ద సాహసాలు చేయునట్లుగా ప్రోత్సాహం ఇచ్చినది. అర్తహషస్త రాజు యొక్క అనుమతి పొంది తనతో బయలుదేరిన కొంత మందితో సైనిక నాయకులతో, గుఱ్ఱపు పరిచారకులతో కలిసి తన్ను వెంబడించువారితో యెరూషలేమునకు వచ్చెను. యెరూషలేము ప్రాకారమును కట్టునట్లుగా స్వజనులకు పిలుపునిచ్చెను.

ఆ కాలములో కోట ప్రాకారములేని పట్టణం ఏదైన దోపిడిదారుల ఆక్రమనమునకు “ఎర” గా మారు పరిస్థితియుండెను. అందువలన కాపుదల అవసరమని యూదులు యెరూషలేములో ఉండకండా చుట్టూ ఉన్న గ్రామములలో జీవించినారు. ఇందువలన అన్యజనులతో కలిసిపోవుటవలన భాషా, ఆచారపు అలవాట్లు, పరిశుద్ధ విశ్వాసము కూడా పోగొట్టుకునే పరిస్థితి వచ్చినది. ప్రాకారము మరమత్తు చేయబడి కట్టబడితే ఒక నిజమైన యూదా నగరమును కట్టినట్లైతే లోపలకి వచ్చువారిని, బయటకు వెళ్ళువారిని అదుపు చేయవచ్చును.

ఆ దేశ ప్రజల భయంకరమైన వ్యతిరేకతను ఎదుర్కొని 52 దినములలో ప్రాకారపు పని ముగించినప్పుడు ఈ అసాధ్యమైన కార్యమును చేయుటకు యెహోవాయే సహాయము చేసినాడని యూదుల యొక్క విరోధులు కూడా ఒప్పుకొనవలసి వచ్చినది. నెహెమ్యా యొక్క గొప్ప దైవ నమ్మిక, సంఘటిత సామర్థ్యం, శ్రేష్ఠమైన నాయకత్వ తలాంతు మరమత్తు చేయబడిన ప్రాకారముతో, అస్తవ్యస్తమైన యూదా ప్రజల జీవితమును సరిచేసి నూతన జీవమునిచ్చు అవకాశము ఏర్పడుటయే ఈ పుస్తకము యొక్క విషయ సూచికగా ఉన్నది.

ఉద్దేశము: పాతనిబంధన చరిత్ర పుస్తకములలో నెహెమ్యా చివరిది. చెరనుండి యెరూషలేముకు 3వ సారి వచ్చిన చరిత్రను చెప్పుచున్నది. దానితో బాటుగా యెరూషలేము యొక్క ప్రాకారము ఏలాగు మరలా కట్టిముగించారు అనేది, విశ్వాస సంస్కరణ ఎలాగు జరిగినది అనేది. ఈ పుస్తకము చెప్పుచున్నది.

గ్రంథకర్త : నెహెమ్యా. (పరిశోదకుడు అన్న స్థితిలో నెహెమ్యాతో పాటు ఎజ్రా కూడా ఈ రచనలో సహాయం చేసి ఉండవచ్చను.)

కాలం : క్రీపూ 445 – 432.

నేపథ్యము : క్రీ.పూ. 537లో జెరుబ్బాబేలు నాయకత్వములో యెరూషలేమునకు మొదటి సారి తిరిగి వచ్చుట జరిగినది. 458లో రెండవ సారి తిరిగి వచ్చుటకు ఎజ్రా నాయకత్వము వహించెను. 445 లో చివరిగా యెరూషలేములో ప్రాకారములను మరమ్మత్తు చేయుటకు చెర నుండి 3వ సారి వచ్చిన వారిలో నెహెమ్యా కూడా చేరినాడు.

ముఖ్యమైన వ్యక్తులు : నెహెమ్యా, ఎజ్రా, సన్బ్ల్లట్టు, టోబియా.

ముఖ్యమైన స్థలము : యెరూషలేము

గ్రంథ విశిష్టత : యెరూషలేము యొక్క ప్రాకారము తిరిగి కట్టబడును. అని జెకర్యా, మరియు దానియేలు యొక్క ప్రవచనములు నెరవేర్పులు ఈ పుస్తకము చూపించుచున్నది.

ముఖ్యమైన మాట : యెరూషలేము యొక్క ప్రాకారపు గోడలు

ముఖ్యవచనములు : నెహెమ్యా 6:15-16; నెహెమ్యా 8:8

ముఖ్య అధ్యాయములు : నెహెమ్యా 9. పాత నిబంధన బావము. దేవునితో ఉన్న నిబంధన యెరూషలేము ప్రాకారము కట్టబడిన తరువాత ప్రజలు పశ్చాత్తాపపడి పాపములను ఒప్పుకొని దేవునితో నిబంధనచేసిన దానిని వ్రాసి ముద్రించినట్లుగా ఈ అధ్యాయములో వ్రాయబడినది.

పుస్తకము యొక్క వివరణ : నెహెమ్యా మరియు ఆయన సమకాలికుడైన ఎజ్రా సేవలు ఇంచుమించుగా ఒకే కాలములో నిర్వహించబడెను. ఒక యాజకుడుగా ఎజ్రా ఒక ఆత్మీయ ఉజ్జీవమునకు నాయకత్వము వహించుచున్నాడు. నెహెమ్యా ఒక అధికారిగా లోకసంబంధమైన రాజకీయ సంబంధమైన సంస్కరణలను చేయుచున్నాడు. చెరనివాసమునకు తరువాత తిరిగి వచ్చిన దైవ ప్రజలలో మిగిలిన వారిని దైవ దర్శనములో స్థిరపరచి ఇద్దరూ ఏకీభవించి ఒక సంస్కరణలను చేసినారు. పాత నిబంధన ప్రవక్తలలో చివరివాడైన మలాకీ కూడా అదే కాలములో ప్రజలకు క్రమశిక్షణలో ఆత్మీయతతో మార్గమును చూపించెను.

నెహెమ్యా పుస్తకము పాత నిబంధన చరిత్ర చివరి కాలము అనగా క్రీ.పూ. 400 సంవత్సరముల ముందు కాలమునకు మనలను తీసుకొని వెళ్ళుచున్నది. పుస్తకము యొక్క రెండు పెద్ద భాగములు క్రింద ఇవ్వబడెను. (1). ప్రాకారపు మరమ్మత్తు1 – 7 అధ్యాయములు. (2). ప్రజలను సంస్కరించుట 8 – 13 అద్యాయములు.

కోట ప్రాకారపు పనితో యెరూషలేముకు సురక్షిత స్థితి ఏర్పడెను.

దాని తరువాత ప్రజల పునరుద్దారణ కోసం ఎజ్రా, నెహెమ్యా ఏకీభవించి చేసిన భాగమే పుస్తకము యొక్క శ్రేష్ఠమైన భాగమనవచ్చు.

క్రీ.పూ. 433లో పారసీకదేశమునకు తిరిగి వెళ్ళిన నెహెమ్యా క్రీ. పూ. 432 ప్రజలను తట్టి లేపి దేవుని దగ్గరకు వచ్చునట్లుగా మరియొక ప్రమాణమును చేసినాడు ఆయన దేవాలయమును పరిశుద్ధ పరచి విశ్రాంతి దినమును ఆచరించుటను స్థిరపరచి అన్య స్త్రీలైన భార్యలను పరిత్యాగ పత్రిక ఇచ్చి పంపివేయుమని ప్రజలకు ఖచ్చితముగా చెప్పెను.

కొన్నిక్లుప్త వివరణలు : పరిశుద్ధ గ్రంథములోని 16వ పుస్తకము ; అధ్యాయములు 13; వచనములు 406; నెరవేరిన ప్రవచనములు 3; హెచ్చరికలు 3; ఆజ్ఞలు 14; వాగ్దానములు లేవు; దేవుని దగ్గర నుండి ప్రత్యేక సందేశములేవు; ప్రశ్నలు 24.

Ezra – ఎజ్రా

దినవృత్తాంతములు రెండవ పుస్తకము తరువాత జరిగిన చరిత్ర మార్పును కొనసాగిస్తూ 70 సంవత్సరముల చెరనివాసమునకు తరువాత దేవుడు తన ప్రజలను వాగ్దాన దేశమునకు తిరిగి తీసుకొని వచ్చుటను గురించి చెప్పు పుస్తకము. ఇది బబులోను నుండి బయలుదేరి వచ్చు ఈ సంఘటనను రెండవ నిర్గమము అనవచ్చు. అయినప్పటికి ఈ రెండవ నిర్గమము మొదటి నిర్గమము వలె శ్రేష్ఠముగా ఉండలేదు. ఎందుకనగా బబులోనులో జీవించిన యూదులలో కొంత భాగము అంటే కొద్ది మంది మాత్రమే ఆ స్థలము వదలి తిరిగి వచ్చుటకు ముందుకు వచ్చిరి.

బబులోనును వదలి బయలుదేరి వచ్చిన రెండు గుంపులను గూర్చి ఎజ్రా వివరించుచున్నాడు మొదటి గుంపు జెరుబ్బాబేలు నాయకత్వములో దేవాలయమును కట్టుటకు, రెండవ గుంపు ఎజ్రా నాయకత్వములో ప్రజల భక్తి సంబంధమైన కార్యములలో తట్టిలేపుటకు స్వదేశమునకు తిరిగి వచ్చిరి. ఈ రెండు సంఘటనలకు మద్య సుమారు 60 సంవత్సరములు కాలవ్యవధియుండెను. ఈ మధ్య కాలంలో ఎస్తేరు పారసీక దేశ రాణిగా యుండెను. మూల భాషయమైన హెబ్రీ భాష పరిశుద్ధ గ్రంథములో ఎజ్రా, నెహెమ్యా ఒకే పుస్తకముగా ఉండినవి. ఎందుకనగా ఈ రెండు పుస్తకములలో వరుసగా ఒకే చరిత్ర వ్రాయబడియున్నది. లాటిన్ పరిశుద్ధ గ్రంథములో ఎజ్రా పుస్తకమునకు మొదటి ఎజ్రా అని, నెహెమ్యా పుస్తకమునకు రెండవ ఎజ్రా అని పేరు ఇవ్వబడినది.

ఉద్దేశము : తన ప్రజలను తిరిగి వారి దేశమునకు రప్పింపజేసెదను అనువాగ్దానమును నెరవేర్చుటలో దేవుడు ఎంత యదార్ధవంతుడుగా ఉండెనో చూపించుట.

గ్రంథకర్త : ఎజ్రా

కాలము : సుమారు క్రీ.పూ. 538 – 457. పారసీక రాజైన కోరెషు (సైరస్) క్రీపూ 539లో బబులోనును జయించెను. ప్రతి దేశస్తులకు వారి వారి మతాచారపు అలవాట్లకు అరాధన జరిగించుటకు స్వేచ్చ యివ్వబడవలెననునదే పారశీకుల పద్ధతి. ఇందువలననే క్రీ. పూ. 538లో కోరెషు యెరూషలేము దేవాలయమును కట్టుటకు అజ్ఞయిచ్చెను. దైవభక్తి, త్యాగము గల యూదులు జెరుబ్బాబేలు నాయకత్వంలో యెరూషలేము దేవాలయము కట్టుటకు బయలుదేరిరి. క్రీ.పూ. 536లో వారు దేవాలయమునకు పునాదులు వేసి పని ప్రారంభించిరి. క్రీపూ 586లో యెరూషలేము నాశనము చేయబడిన తరువాత కేవలం 50 సంవత్సరములు మాత్రమే చెరకొనసాగినది. కాని చెర నివాస కాలము 70 సంవత్సరములుగా లెక్కింపబడుచున్నది. ఎలాగనగా ఈ ప్రజలు బబులోనుకు మొట్టమొదట చెరపట్టబడిన క్రీ.పూ. 605 నుండి లెక్కింపబడినది. దేవాలయపుపని క్రీ.పూ. 534లో ఆటంకపర్చబడిన తరువాత క్రీ. పూ. 520లో పునఃప్రారంభమైనది. క్రీ.పూ. 516లో పని ముగించబడినది. యూదా నుండి ప్రజలను చెరపట్టుకొని పోయినది మొదటిగా క్రీ. పూ. 605 లోను, 2వ సారి క్రీ. పూ. 597 లోను, 3వ సారి క్రీపూ 586లో జరిగినది.

నేపథ్యము: దినవృత్తాంత పుస్తకములవలె ఎజ్రా పుస్తకము కూడా యూదా ప్రజల చరిత్రను చెప్పుచున్నది. చెరనివాసం వచ్చిన తరువాత యూదులు స్వదేశనమునకు తిరిగి వచ్చుట ఈ పుస్తకము యొక్క సారాంశం.

ముఖ్యమైన వ్యక్తులు : కోరెషు, జెరుబ్బాబేలు, హగ్గయి, జెకర్యా, దర్యావేషు, మొదటి అర్తహషస్త, ఎజ్రా.

ముఖ్య స్థలములు : బబులోను, యెరూషలేము.

గ్రంథ విశిష్టత : ఎజ్రా, నెహెమ్యా, హెబ్రీ పరిశుద్ధ గ్రంథములో ఒకే పుస్తకముగా ఉండినవి. ఈ రెండు పుస్తకములలో, ఎస్తేరు పుస్తకమును చేర్చినట్లైతే చెర నివాసము తరువాత కాలపు చరిత్ర పుస్తకములగును.

పుస్తకపు ముఖ్య భాగములు : ముఖ్యమైన వాక్యము, దేవాలయము సారాంశము: – దేవాలయమును తిరిగి కట్టుట, దైవ ప్రజల ఆత్మీయ, సమాజిక క్రమశిక్షణను సంస్కరించుట.

ముఖ్య వచనములు : ఎజ్రా 1:3; ఎజ్రా 7:10

ముఖ్యమైన అధ్యాయము : ఎజ్రా 6 దేవాలయము కట్టి ముగించిన తరువాత దాని ప్రతిష్ఠితను గూర్చి చెప్పు అధ్యాయము. ఇది పస్కా ఆచరించుటకు, అన్యజనుల అపవిత్రతను వదలి దేవునికి లోబడుటకు, లోబడి ఒక పరిశుద్ధ జీవితము జీవించుటకు ప్రజలు ప్రోత్సహింపబడిరి.

గ్రంథ విభజన : ఎజ్రా పుస్తకమును 2 పెద్ద భాగములుగా విభజించవచ్చును. 1 – 6 అధ్యాయముల వరకు ఉన్న మొదటి భాగము దేవాలయమును తిరిగి కట్టబడుటను గురించి, 7 – 10 అధ్యాయములలో ఉన్న రెండవ భాగం ప్రజల ఆత్మీయ సంస్కరణలను గురించి చెప్పుచున్నది.

కొన్ని క్లుప్త వివరణలు : పరిశుద్ధ గ్రంథములోని 15 వ పుస్తకము ; అధ్యాయములు 10; వచనములు 280; ప్రవచనములు లేవు; దేవుని నుండి ప్రత్యేక సందేశములు లేవు; వాగ్దానములు లేవు; ప్రశ్నలు 9; ఆజ్ఞలు 43.

Chronicles 2 – 2 దినవృత్తాంతములు

ఉద్దేశము : రాజులకు తీర్పునిచ్చే కొలబద్ద చూపించుచూ, నిజమైన ఆరాధనకు మనుష్యులను ఐక్యపరచుట, యూదాలోని నీతి మంతులైన రాజులను వారి యొక్క పరిపాలనలో జరిగిన ఆత్మీయ ఉజ్జీవమును చూపించుట. చెడు రాజుల పాపములను బహిరంగముగా చూపించుట.

గ్రంథకర్త : ఎజ్రా (యూదా పారంపర్య నమ్మకమును బట్టి).

కాలం : క్రీ.పూ. 430 ( సొలొమోను పరిపాలన ప్రారంభమైన క్రీ. పూ. 970 నుండి బబులోను చెర ప్రారంభమైన క్రీ.పూ. 586 వరకు జరిగిన సంఘటనలు వ్రాయబడినవి).

నేపథ్యము: ఒకటి, రెండు రాజుల రెండు పుస్తకముల ఉన్న చరిత్రను దినవృత్తాంతముల రెండవ పుస్తకములో వివరించుచున్నది. ఉత్తర భాగము ఇశ్రాయేలు అని దక్షిణ భాగము యూదా అని విభజింపబడిన దానిలో ఉత్తర ఇశ్రాయేలు దేశము మరియు అక్కడ ఏలిన రాజులను గురించిన చరిత్ర యించుమించు పూర్తిగా ఈ పుస్తకములో తీసివేయబడినది. ఈ పుస్తకము వ్రాయబడిన కాలంలో అధర్మం, విగ్రహారాధన వలన నాశనమైపోయిన ఆదేశములో యేదియును మిగలలేదు. దాని చరిత్రను వ్రాసి సమయమును వ్యర్థము చేయకూడదని గ్రంథకర్త తీర్మానము.

దీనికి బదులుగా దేవాలయమును కట్టుటకు అనుమతిని పొంది తిరిగి వచ్చిన దైవ ప్రజలైన యూదా ప్రజలకు ఆత్మీయ ప్రోత్సాహము ఇచ్చుటకు వారి గత కాలపు మహిమను గూర్చిన గర్వమును, భవిష్యత్తును గురించిన మంచి నమ్మికను వారిలో పెంచటానికి ఈ పుస్తకము ద్వారా గ్రంథకర్త ప్రయత్నిస్తున్నాడు. దైవభక్తి లో ఉన్నతముగా ఉండిన దావీదు రాజు కాలము తరువాత ఆయన వారసులుగా పరిపాలన సాగించిన ఎనిమిది మంది ఉత్తమమైన రాజుల చరిత్రను, వారి యొక్క సంస్కరణలను వివరించుటకు పుస్తకములోని అధిక భాగమును గ్రంథకర్త ఉపయోగించాడు. తమ దేశము స్థిరపరచబడుటకు దైవ ఆరాధన ప్రాధమిక పునాది అనుకొని గ్రంధకర్త యెరూషలేము దేవాలయ మహిమ అక్కడ జరిగిన ఆరాధనను నొక్కి చెప్పుచున్నాడు గ్రంథకర్త.

ముఖ్యవచనము : 2 దినవృత్తాంతములు 7:14

ముఖ్య వ్యక్తులు : సొలొమోను, షేబారాణి, రెహబాము, ఆసా, యెహోషాపాతు, యెరొబాము, యోవాషు, ఉజ్జియా, అహాజు, హిజ్కియా, మనషె, యోషియా.

ముఖ్యస్థలము : యెరూషలేము

గ్రంథ విశిష్టత : దేవాలయపు పనివివరములు వ్రాయబడినవి

గ్రంథ విభజన : (1). సొలొమోను పరిపాలనా కాలము : 1 నుండి 9 వరకు ఉన్న అధ్యాయములు, సొలొమోను పరిపాలనా కాలము సమాధానము, ధన సమృద్ధి, ఆరాధన అనువాటి యొక్క స్వర్ణయుగముగా ఉండినది. ఈ కాలములో యూదా ఐకమత్యములో, ధన సమృద్ధిలో ఉన్నత స్థానములో ఉండినది. సొలొమోను యొక్క ఐశ్వర్యము, జ్ఞానము, రాజభవనము, దేవాలయము అనునవి ఈ కాలములో ప్రఖ్యాతిగాంచినవి. ఈ భాగము యొక్క 9 అధ్యాయములలో మొదటి ఆరు అధ్యాయములు దేవాలయపు కట్టడపు పని, అర్పణ అనువాటిని కేంద్రముగా చేసుకున్నవి అనునది గమనించదగినది. (2). యూదా రాజుల యొక్క పరిపాలన : అధ్యాయము 10 – 36 వరకు దురదృష్టకరముగా ఇశ్రాయేలు మహిమ, ఐశ్వర్యము ఎక్కువ కాలము నిలువబడలేదు. సొలొమోను మరణము తరువాత అతని కుమారుడైన రెహబాము రాజు అయిన వెంటనే దేశము రెండుగా విడిపోయినది. విభజన ఫలితముగా ఏర్పడిన రెండు రాజ్యముల మధ్య పోరాటము వచ్చినది. కొంచెము కొంచెముగా తమ నాశనము దిగజారిపోయినవి. అప్పుడప్పుడు వచ్చిన కొందరు ఉత్తములైన యూదా రాజుల ఆత్మీయ సంస్కరణల వలన నాశనమగుటకు కొంచెము ఆలస్యయినది. యూదాను పరిపాలించిన 20 మంది రాజులలో 8 మంది ప్రజలను విగ్రహారాధన నుండి, క్రమశిక్షణా రాహిత్యము నుండి పైకి లేపుటకు ప్రయత్నించిరి. అయిననూ ఎవరి ప్రయత్నమైననూ ఒక తరము కంటె మించి నిలువబడినట్లుగా కనబడలేదు.

చివరిగా యోషియా తరువాత వచ్చిన నలుగురు రాజుల పాలన కాలములో దేశమునకు పూర్తిగా నాశనము వచ్చినది. మూడుసార్లు బబులోను రాజులు యూదా ప్రజలను, రాజులను చెరపట్టి తన దేశమునకు తీసుకువెళ్ళిరి. చివరిసారి అంటే క్రీ. పూ. 586లో యెరూషలేము నగరము, దేవాలయము పూర్తిగా నాశనమైనవి. అయినప్పటికిని 70 సంవత్సరముల బానిసత్వము తరువాత అప్పటి పారశీక రాజైన కోరెషు (ఈ విరామ కాలములో బబులోను రాజ్యము ముగింపై మాదీయ పారశీక సామ్రాజ్యము స్థాపించబడినది. యూదులు తమ దేశమునకు మరలుటకును, యెరూషలేము దేవాలయము కట్టుటకు, ఆజ్ఞాపించెను. “ఆయన ప్రజలందరిలో ఎవడు ఉన్నాడో వాడు వెళ్ళవచ్చును వాని యొక్క దేవుడైన యెహోవా వానికితోడై ఉండునుగాక” అనునది ఆజ్ఞ యొక్క సారాంశము.

క్లుప్త వివరణలు : పరిశుద్ధ గ్రంథములోని 14వ గ్రంథము ; అధ్యాయములు 36; వచనములు 822; చరిత్ర సంబంధమైన వచనములు 583; నెరవేరిన ప్రవచనములు 31; నెరవేరనివి 7; హెచ్చరికలు 42; ఆజ్ఞలు 45; వాగ్దానములు 8 ; దేవుని ప్రత్యేక సందేశములు 21; ప్రశ్నలు 47.

Chronicles 1 – 1 దినవృత్తాంతములు

సమూయేలు రెండవ గ్రంథము మొదలుకొని రాజులు రెండవ గ్రంథము వరకు చెప్పబడిన యూదా చరిత్ర యొక్క పలు కోణముల మరులిఖితమైయున్నది. అయినను ఇది మరొకసారిచెప్పుట కాదు. ఇశ్రాయేలు చరిత్రకు దేవుడు ఇచ్చిన ఒక వివరణ అని దీనిని చెప్పవచ్చు. రెండవ సమూయేలు, మొదటి, రెండవ రాజులు ఇశ్రాయేలీయుల సంపూర్ణ రాజకీయ చరిత్రగా కనబడుచుండగా, దావీదు నుండి ప్రారంభమైన యూదా రాజ కుటుంబమును మాత్రము ఒక మత చరిత్రగా దినవృత్తాంతముల పుస్తకములు వ్రాయబడినవి.

సమూయేలు, రాజులు అనే పుస్తకముల వలె ఈ పుస్తకములు కూడా హెబ్రీ భాషలో ఒకే పుస్తకముగా వ్రాయబడిననూ గ్రీకు “సెప్టోజెంట్ ” తర్జుమాలో రెండుగా విభజించబడినవి. దీని మొదటి పుస్తకములో దావీదు జీవిత చరిత్రను, రెండవ పుస్తకములో దావీదు నుండి ప్రారంభమైన యూదా రాజకుటుంబ చరిత్ర వరకు కనబడుచున్నది. దావీదు వంశావళి వివరణలో మొదటి పుస్తకము ప్రారంభమగుచున్నది. ఆయన యొక్క న్యాయపరిపాలన, ఆత్మీయ శ్రేష్ఠతను ప్రత్యక్షపరచి అది ముగియుచున్నది.

దినవృత్తాంతముల గ్రంథము హెబ్రీ గ్రంథములో చివరి పుస్తకములైనందున 1 నుండి 9 అధ్యాయములలో కనిపించే విశేష వంశావళి యొక్క వివరణ క్రొత్త నిబంధన యొక్క మొదటి పుస్తకములో కనిపిస్తున్నది. యేసుక్రీస్తు యొక్క వంశావళికి ప్రారంభమని చెప్పవచ్చును.

దినవృత్తాంతముల పుస్తకము హెబ్రీ భాష శీర్షికమైన “డిబారెహయామిమ్” అనుమాటకు అనుదిన కార్యక్రమములు అని అర్థము ఇది గ్రాహ్యమగునట్లుగా తెలుగులో తీసుకొనబడిన మాటే ఈ దినవృత్తాంతములు.

ఉద్దేశము : దేవుని ప్రజలను ఐక్యపరచడం, దావీదు వంశావళిని వ్రాయుట, సమాజములోను, వ్యక్తిగత జీవితములోను నిజమైన ఆరాధనకు ప్రథమ స్థానం ఇవ్వబడవలెనని చెప్పుట.

గ్రంథకర్త : ఎజ్రా, (యూదా పారంపర్య నమ్మికనుబట్టి)

వ్రాసిన కాలము : క్రీ.పూ. 430 (క్రీ.పూ. 1000 – 960 కాలములో జరిగిన సంఘటనలు వ్రాయబడినవి).

నేపథ్యము : రెండవ సమూయేలు వివరణగా ఈ పుస్తకమును చెప్పవచ్చును. యూదా మరియు ఇశ్రాయేలు మత చరిత్రకు దీనిలో ప్రాముఖ్యత ఇవ్వబడినది. చెర తరువాత ఒక మత గురువు (యాజకుని) నేతృత్వములో ఈ పుస్తకము వ్రాయబడినది.

ముఖ్యవచనము : 1 దినవృత్తాంతములు 14:2

ముఖ్యమైన వ్యక్తులు : దావీదు, సొలొమోను

ముఖ్య స్థలములు : హెబ్రోను, యెరూషలేము

గ్రంథ విభజన : బబులోను చెర నుండి తిరిగి వచ్చు వరకు ఇశ్రాయేలు గురించి మొత్తం చరిత్రకు ఇంకొక ప్రతి బింభముగా ఉన్నది. ఇశ్రాయేలులో తిరిగివచ్చిన శేష దైవ ప్రజలకు వారి యొక్క పాతకాలపు జీవితమును గురించిన ఒక ఆత్మీయ దృష్టిని ఇచ్చుటకు ఈ పుస్తకము వ్రాయబడినది. ఈ మొదటి పుస్తకము అంతయు సమూయేలు రెండవ పుస్తకము వలె దావీదు జీవిత చరిత్రను వివరించుటకు ఉపయోగపడుచున్నది. ఈ క్రింది విధముగా రెండు ముఖ్య భాగములను ఈ పుస్తకములో చూడవచ్చును.

(1). అధ్యాయము 1 నుండి 9 వరకు దావీదు వంశావళి పట్టిక. ఈ భాగములో దావీదు మరియు ఇశ్రాయేలీయుల పూర్వీకుల పారంపర్య ప్రారంభము నుండి ఇవ్వబడినది. పుస్తకము పూర్తిగా యూదా రాజ్య చరిత్రతో నిండిన యూదా, బెన్యామీను అను గోత్రములకే ముఖ్యత్వము ఇచ్చి ఈ పూర్వీకుల పట్టిక ఉద్భవించబడినది. ఈ పుస్తకములో యాజక ప్రాథమిక దృష్ట్యా లేవీ గోత్రమునకు ఉన్నతమైన స్థానము ఇవ్వబడినది.

(2). అధ్యాయము 10 – 29 వరకు. దావీదు జీవిత ముఖ్య సంఘటనలు వివరించు ఈ భాగములో సౌలుకు భయపడి ఆయన చేసిన అజ్ఞాత జీవితం, హెబ్రోనులో 7 సంవత్సరములు యూదా గోత్రమును మట్టుకు యేలినది. అనునవి విడువబడినవి. అదేవిధముగా బెత్సేబాతో దావీదు పడిపోయిన సంఘటనను ఈ గ్రంథకర్త వదిలివేసెను. దేవుని క్షమాపణ, ప్రేమ ఆశీర్వాదమహిమ అను వాటికి ముఖ్యత్వము ఇచ్చి చెర నుండి వచ్చిన దేవుని ప్రజలను విశ్వాసములోను, లోబడుటలోను, దేవుని భయంలోను దృఢపరచి స్థిరపరచవలెనన్న ఉద్దేశ్యముతో వదలవలసిన భాగములను వదిలి పెట్టి చేర్చవలసిన భాగములను చేర్చి పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి ఈ గ్రంథకర్త ఈ గ్రంథమును వ్రాశాడు. దేవుడు దావీదుకు దేవాలయము కట్ట అనుమతిని ఇవ్వకపోయినప్పటికి కట్టుడు పని నిమిత్తము సకల సిద్ధపాటులను ఆయన చేయగలిగెను. దావీదు యొక్క బహిరంగమైన స్తోత్రముతో, సొలొమోను సింహానాసీనుడయ్యే దృశ్యముతో ఈ పుస్తకము ముగింపగుచున్నది.

కొన్ని క్లుప్త వివరణలు : పరిశుద్ధ గ్రంథములో 13వ పుస్తకము ; అధ్యాయములు 29; వచనములు 942; చరిత్రకు సంభందించిన వచనములు 927; నెరవేరిన ప్రవచనములు 81; నెరవేరనివి 71; హెచ్చరికలు 30; ఆజ్ఞలు 53; ప్రశ్నలు 19; వాగ్దానములు 9; దేవుని సందేశములు 8.

Kings 2 – 2 రాజులు

వాగ్దానదేశములో నివాసమును స్థిరపరచిన దేవుని ప్రజల అంధకార దినములను గూర్చి రాజుల రెండవ పుస్తకము చిత్రించి చూపించుచున్నది. దేవునితో ఉన్న ఒడంబడికను దేవుని ఆజ్ఞలను మరచి విగ్రహారాధన చేసి చెడిపోయిన జీవితములో మునిగిపోయిన ప్రజల మీదికి వచ్చిన భయంకర న్యాయ తీర్పునే ఈ పుస్తకములో మనము చూచుచున్నాము. చివరి ఘట్టం వరకు ఇశ్రాయేలులోనూ, యూదాలోనూ పాలించిన రాజుల గురించిన దృశ్యములను మార్చి మార్చి చూపించుచున్నాడు గ్రంథకర్త.

ఇశ్రాయేలు, 19 మంది దుష్టపాలకుల పరిపాలన ముగిసిన తరువాత అపూరుకు బానిస అయినది. దీనితో పోల్చి చూసినపుడు యూదా చరిత్ర ఉన్నతముగా ఉన్నది అని చెప్పవచ్చును. అక్కడ అప్పుడప్పుడు దైవభక్తి కలిగిన కొందరు రాజులు లేచి తమ పితరులు నిలిపిన బలిపీఠములను, విగ్రహములను తీసివేసి ప్రజల జీవితమును చేతనైనంత వరకు పరిశుద్ధపరచ ప్రయత్నించిరి అయినప్పటికీ, చిట్టచివరికి నీతికి బదులు అధికముగా పాపము పెరిగి యూదారాజులు, దేశ ప్రజలు బబులోనుకు చెరగా వెళ్ళిరి.

కాలము : బబులోను చెరపట్టిన కాలమైన క్రీ. పూ. 586 కు ముందు రాజులును గూర్చి ఈ గ్రంథములో ఎక్కువ భాగము వ్రాయబడియుండవచ్చును. సొలొమోను మరణము, ఇశ్రాయేలు విభజన క్రీ.పూ. 930 సంవత్సరములో జరిగినది. ఐక్య ఇశ్రాయేలు రాజ్యము క్రీ.పూ. 1050 నుండి 930 వరకు 120 సంవత్సరములు నిలిచియుండినది. తదుపరి ఉత్తర ఇశ్రాయేలు రాజ్య ము క్రీ.పూ 930 నుండి 722 సంవత్సరముల వరకు 208 సంవత్సరములు కొనసాగినది. క్రీ.పూ 722 సంవత్సరములో అషూరు ఇశ్రాయేలును హస్తగతం చేసుకుని అనేకులైన ప్రజలను చెరగా తీసుకుని వెళ్ళినది. దక్షణ యూదా రాజ్యము దీని తదుపరి 136 సంవత్సరములు కొనసాగినది. క్రీ. పూ. 586 లో బబులోను చెర ద్వారా అది కూడా పతనమైనది. ఈ విధముగా క్రీ.పూ 1050 నుండి 586 వరకైన 464 సంవత్సరములు ఇశ్రాయేలు చరిత్రకాలములో ప్రపంచములో చాలా గొప్ప రాజకీయ మార్పులు చోటుచేసుకున్నవి. పాలస్తీనా భూభాగము పై అనేక సార్లు ఐగుపుకు, అషూరుకు మారిమారి అధికారము, పాలన ఉండినది. అప్పుడు విస్తరించిన అషూరు సామ్రాజ్యము కొంచెము కాలము తరువాత పతనమైనది. బబులోను దానిని తనలో విలీనం చేసుకున్నది.

ఉద్దేశ్యము : దేవుని న్యాయకత్వమును అంగీకరించుటకు సిద్ధమనస్సు లేని ప్రజల భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చూపించుట.

గ్రంథకర్త : యిర్మీయా

నేపథ్యము: ఒకే రాజ్యముగా ఉండిన ఇశ్రాయేలు దేశము విభజింపబడిన నూరు సంవత్సరముల తరువాత

ముఖ్య వచనములు : 2 రాజులు 17:22-23; 2 రాజులు 23:27

ముఖ్యమైన వ్యక్తులు : ఏలియా, ఎలీషా, షూనేమీయురాలు, నయమాను, యెజెబెలు, యెహూ, యోవాషు, హిజ్కియా, మనషేయోషియా, యెహోయాకీము,సేన్హేరీబు, యెషయా, సిద్కియా, నెబుకద్నేజరు.

పుస్తకము యొక్క ప్రత్యేకత : పాత నిబంధన చివరలో కనబడు 17 ప్రవచన పుస్తకములు రెండవ రాజుల పుస్తకముతో పోల్చి చూసి నేర్చుకొనదగినవి.

గ్రంథ విభజన : రాజులు రెండవ పుస్తకమును రెండు పెద్ద భాగములుగా విభజించవచ్చును. . 1. విడిపోయిన తరువాత ఏర్పడిన రెండు రాజ్యముల చరిత్ర. (1 – 17 అధ్యాయము) 2. అష్హురుతో యుద్ధము తరువాత నిలిచియున్న ఏక రాజ్య మైన యూదా చరిత్ర ( 18 – 25 అధ్యాయము).

ఇశ్రాయేలు పతనమునకు ఆరు సంవత్సరములకు ముందు హిజ్కియా యూదాకు రాజాయెను. ఆయన యొక్క మంచి దైవభక్తి చేసిన ఉజ్జీవ కార్యములు, వీటిని బట్టి దేవుడు యూదాను శత్రువుల నుండి విడిపించి వారికి ఐశ్వర్యమును, సుఖవంతమైన స్థితిని ఇచ్చెను. అయినప్పటికి హిజ్కియా కుమారుడైన మనషె కాలంలో దేశము చెడుతనములోకి తిరిగి కూరుకుపోయినది. మనషె యొక్క మనుమడైన యోషియా

మెచ్చుకొనదగిన, పరిశుద్ధపరచు కార్యముల వలన రావలసిన నాశనమును ఎన్నటెన్నటికి రాకుండా ఆపలేకపోయినది. యోషియా తరువాత వచ్చిన నలుగురు రాజుల కాలంలో బబులోను యొక్క తీవ్రమైన యుద్ధములు కొనసాగినవి. బబులోను రాజు మూడుసార్లు యూదులను చెరపట్టుకుని వెళ్ళెను. మూడవసారి యెరూషలేము నగరము, దేవాలయము నాశనమైనవి. చివరి ఘట్టములో యూదాలో మిగిలిపోయిన వారికి రాబోవు నిరీక్షణను చూపి, ఒప్పింపజేసి ఈ పుస్తకము ముగింపగుచున్నది. ఇశ్రాయేలులోనూ ఇంకా యూదాలోనూ రాజుల పరిపాలనా కాలయములో మనుష్యుల హృదయములను దేవుని వైపు త్రిప్పుటకు అనేక మంది ప్రవక్తలను దేవుడు తపెను, ఏలియా, ఎలీషా, ఆమోసు, హోషేయా అనువారు ఇశ్రాయేలులోను ఓబద్యా, యోవేలు, యెషయా, మీకా, నహూము, జెఫన్యా, యిర్మీయా, హబక్కూకు అనువారు

యూదాలో వారి సేవలను జరిగించిరి.

కొన్ని కుప్ల వివరములు : పరిశుద్ధ గ్రంథములోని 12వ పుస్తకము ; అధ్యాయములు 25; వచనములు 719; ప్రశ్నలు 118; చరిత్రకు సంబంధించిన వచనములు 560; నెరవేరిన ప్రవచనములు 58; నెరవేరనివి 1; హెచ్చరికలు 65; ఆజ్ఞలు 118; వాగ్దానములు 3; దేవుని సందేశములు

Kings 1 – 1 రాజులు

జ్ఞానులకు జ్ఞానియైన సొలొమోను రాజు పరిపాలన, ఆయన గొప్ప కార్యములను గురించి ఈ గ్రంథము యొక్క మొదటి భాగము చెప్పుచున్నది. సొలొమోను పరిపాలనా కాలము ఇశ్రాయేలు రాజ్యపు స్వర్ణ యుగముగా ఉండినది. శిల్పకళలో శ్రేష్టమైన గుర్తుగా యెరూషలేము దేవాలయము కట్టబడినది. అతని పాలనలో ఇశ్రాయేలు మహిమ చేరినది. దీనిని సొలొమోను యొక్క శ్రేష్టమైన కార్యముగా చెప్పవచ్చును. ప్రతి దినము రెండు లక్షల మంది పనివారు ఏడు సంవత్సరములు పనిచేసి ఈ దేవాలయమును కట్టిరి. గొప్ప జ్ఞానియూ, కవియూ అయిన సొలొమోను యొక్క జ్ఞానమును వినుటకును, ఆయన అంతఃపురము యొక్క మహాత్యమును చూచుటకు పలు దేశముల నుండి రాజులు, రాణులు యెరూషలేముకు వెళ్ళుట ఆనాటి అలవాటుగా ఉండినది.

అయినప్పటికి ఆయన వృద్ధాప్యము ఒక దుఃఖకరమైన స్థితికి సాక్ష్యమిచ్చినది. ప్రజల మధ్యలో అసంతృప్తి ఏర్పడినది. దేశములో విభజనలు, అంతర్గత కలహములు పెరిగినవి. మహిమ కలిగిన దేశము అతి త్వరగా చిన్నాభిన్నమైనది. ఈ నాశనమునకు కారణములు ఏమిటి అనేది చూద్దాం.

(1). ఆడంబర జీవితము, అనవసరమైన ఖర్చులు పెరిగి ప్రజలకు భారమాయోను. (2). రాజులందరు తమ నైపుణ్యము వలన జయించుటకు చేసిన ప్రయత్నముల మధ్య దేవుని కేంద్ర బిందువుగా చేయడం సొలొమోను మరచినాడు. (3). ఆయన వివాహ జీవితము సుఖభోగము యెక్క గుర్తుగా ఉండినది. ఆయన అంతఃపురంలో 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉండేవారు. ఆయన యొక్క అన్యులైన భార్యలు ఆయనను విగ్రహారాధనలోకి లాగిపడవేసిరి.

మహిమతో నిండిన యెరూషలేము దేవాలయమును కట్టిన రాజు విగ్రహారాధికునిగా మారుట ఎంత దుఃఖకరము. అయిననూ సొలొమోను జీవితములో ఇదే సంభవించినది.

ఉద్దేశ్యము : ఇశ్రాయేలు మరియు యూదా రాజుల చరిత్రను చెప్పుటతోబాటు, దేవుని ఆజ్ఞలు గైకొని నడుచువారిని, వాటిని మీరి నడచువారిని పోల్చి చూపించుట.

గ్రంథకర్త పేరు : యిర్మీయా

నేపథ్యము: ఇశ్రాయేలు దేశము విభజింపబడుచున్నది. లోక పరిస్థితిలో మాత్రము కాక, ఆత్మీయ స్థితిలోనూ వేరుపరచబడినది.

ముఖ్యవచనములు : 1 రాజులు 9:4-5

ముఖ్యమైన వ్యక్తులు : దావీదు, సొలొమోను, రెహబాము, యరొబాము, ఏలియా, ఆహాబు, యెజెబెలు.

ప్రత్యేకత : మొదటి, రెండవ రాజులు రెండూ కలిసి ప్రారంభములో ఒకే పుస్తకముగా ఉండినవి.

కాలము : క్రీ.పూ. 722 సంవత్సరంలో ఇశ్రాయేలు రాజ్యము ఆషూరు చెరకు, క్రీ. పూ. 586 సంవత్సరంలో యూదా రాజ్యము బబులోను చెరకు తీసికొనిపోబడుటకు కారణం లోబడకపోవడం, విగ్రహారాధన, చెడునడత అనునవే అని వివరించే అక్షరచిత్రముగా రాజుల పుస్తకములలో గోచరమగుచున్నవి. సొలొమోను రాజ్యమునకు వచ్చిన క్రీ. పూ. 970 నుండి అహజ్యా యొక్క పాలన ముగిసిన క్రీ. పూ. 853 వరకు ఉన్న 123 సంవత్సరాల చరిత్ర మొదటి రాజులు పుస్తకపు విషయ సూచికమగును. ఈ పుస్తకము క్రీ.పూ. 930 సంవత్సరమును గమనించేటట్లుగా చేయుచున్నది. సొలొమోను మరణించుటతోడనే దేశము రెండుగా విడిపోవుట ఈ సంవత్సరములోనే జరిగినది.

మహా గొప్ప జ్ఞానియూ, రాజకీయ చతురుడైన సొలొమోను వృద్ధాప్యములో ఒక బుద్దిహీనుడుగా ప్రవర్తించడం మనము చూస్తున్నాము. దీనిని బట్టి దేవుడు ఇశ్రాయేలు నుండి 10 గోత్రములను తీసి ఆయన సేవకుడైన ఇంకొకరికి ఇచ్చెను. పన్నును తగ్గించమని అడిగిన ప్రజలకు కఠినమైన జవాబు ఇచ్చిన రెహబాముకు రెండు గోత్రములు మాత్రమే ఇవ్వబడినవి. యూదా, బెన్యామీను గోత్రములే అవి. తక్కిన 10 గోత్రములు యరొబాముతో కలిసి ఉత్తర ఇశ్రాయేలు దేశముగా ఏర్పడినవి. అది ఆయనకు, అనుచరులకు సొంతమైనది.

గ్రంథ విభజన : ఈ పుస్తకమును తేటగా రెండు పెద్ద భాగములుగా విభజించవచ్చును.

ఒకటిగా కలిసిన ఇశ్రాయేలు దేశము (1 – 11 అధ్యా వరకు). 2. విడిపోయిన దేశము – ఉత్తర ఇశ్రాయేలు, దక్షిణ ప్రాంత యూదా (12 – 22 అధ్యా వరకు)
కొన్ని క్లుప్త వివరములు : పరిశుద్ధ గ్రంథములో 11వ పుస్తకము; అధ్యాయములు 22; వచనములు 816; ప్రశ్నలు 66; నెరవేరిన ప్రవచనములు 71; నెరవేరని ప్రవచనము 1; దేవుని సందేశములు 36; ఆజ్ఞలు 92; హెచ్చరికలు 73; వాగ్దానములు 6.

Samuel 2 – 2 సమూయేలు

సౌలుకు భయపడి మొదట యూదాలో, తరువాత ఫిలిప్తీయుల దేశములో దాగుకొని జీవించిన దావీదు, సౌలు మరణము తరువాత దేవుని ఆలోచన చొప్పున యూదాకు, తదుపరి ఇశ్రాయేలు దేశమంతటికి రాజై పరిపాలన చేసిన చరిత్రే సమూయేలు రెండవ పుస్తకము. దావీదు జీవిత చరిత్ర 1 రాజుల గ్రంథము మొదటి రెండు అధ్యాయముల వరకు కనబడినప్పటికీ, దావీదు యొక్క పరిపాలన గురించి ఎక్కువగా చెప్పిన గ్రంథము రెండవ సమూయేలు. దావీదు సింహాసనమును ఎక్కుట, చుట్టువున్న శత్రువుల మీద జయము పొందుట, చెదరిపోయే స్థితి నుండి ఇశ్రాయేలును స్థిరమైన దేశముగా రూపించుటకు ఆయన నాయకత్వము వహించుట మొదలగువాటిని గురించి ఈ గ్రంథము చెప్పుచున్నది. దావీదు యొక్క విజయాలను తెలుపుటతో పాటు, దిగజారిన స్థితిని కూడా నిజాయితీగా చిత్రించుటలో ఈ పుస్తకము ప్రత్యేకతను సంతరించుకొనినది. ఆయన జీవితమును పుట్టుకురుపు బాధించిన వ్యభిచారము, నరహత్య మొదలగు వాటి భయంకరమైన ప్రతిఫలములు ఆయన కుటుంబమును, దేశమును ఏలాగు కలవరపరచినవో ఈ గ్రంథములో చూడవచ్చును. గ్రంథము యొక్క పేరు, దానికి సంబంధించిన సమాచారము గురించి 1 సమూయేలు పరిచయములో చూడగలము. ఆ పుస్తకములో వ్రాయబడిన రాజ్య చరిత్ర కొనసాగింపే ఈ రెండవ పుస్తకములో చూచుచున్నాము.

ఉద్దేశము : 1. దావీదు పరిపాలనా కాలచరిత్రను చెప్పుటకు. 2. దేవుని పరిపాలన క్రింద ఎంత ఉన్నతముగా పాలన జరిగినదో చూపించుటకు. 3. ఒక వ్యక్తి ద్వారా మార్పులను తీసుకురాగలము అని చూపించుటకు. 4. దేవుని సంతోషపరచుటకు అవసరమైన గుణశీలములు ఏమిటి అని చూపించుటకు. 5. ఎన్నో కొరతలు ఉన్నా ఒక దేశములో మహా గొప్ప రాజుగా దావీదును చిత్రించి క్రొత్తది మరియు సంపూర్ణమైన ఒక దేశము

యొక్క మాదిరి గల నాయకుని రాబోయే క్రీస్తుని దావీదు మూలంగా ప్రతిబింబింపచేయుట (అధ్యాయము 7).

గ్రంథకర్త : యూదా పారంపర్యమునుబట్టి సమూయేలు, కానీ 1 దినవృత్తాంతములు 29:29 ప్రకారము నాతాను, గాదు అని కొందరు భావించుచున్నారు.

నేపథ్యము : దావీదు పరిపాలన క్రింద ఉన్న ఇశ్రాయేలు రాజ్యము.

ముఖ్యవచనములు : 2 సమూయేలు 5:12

గ్రంథ విశిష్టత : దావీదును అభిషేకించి దేవుని కొరకు జీవించ సలహానిచ్చిన సమూయేలు ప్రవక్త పేరు, ఈ పుస్తకమునకు ఇవ్వడినది.

సౌలు – దావీదు : సాధారణ గొర్రెలకాపరి స్థితి నుండి ఇశ్రాయేలీయుల శ్రేష్ఠుడైన రాజపదవికి దేవుడు తనను హెచ్చించెను అనునది దావీదు ఎప్పుడూ మరువలేదు. సౌలుకు, దావీదుకు మధ్య పోల్చి చూచి పరిశోధన జరిపితే ముఖ్యమైన వ్యత్యాసము బహిరంగపరచబడుట చూడగలము. ఇశ్రాయేలీయుల అతిచిన్న గోత్రము యొక్క సాధారణ కుటుంబములో నుండి దేవుడు తనను ఎన్నుకొన్నాడు అనే గహింపు ప్రారంభములో సౌలుకు ఉండినది. కానీ కాలము గడిచే కొలది తన పూర్వస్థితిని సౌలు మరచిపోయెను. దేవుని ఆజ్ఞలను విడచి అవిధేయత అనే పాపంలో దావీదు, సౌలు దాదాపుగా ఒకే విధముగా పడిపోయినప్పటికీ వారిద్దరూ తప్పు ఒప్పుకొనే స్థితిలో చాలా గొప్ప వ్యత్యాసమున్నది. సౌలు పాపములను ఒప్పుకొన్నప్పటికి ఒక నిజమైన పశ్చాత్తాపము ఆయనలో ఎన్నడూ ఏర్పడలేదు. దావీదైతే విరిగిన హృదయముతో దేవునికి మొఱ్ఱ పెట్టి, నిజమైన హృదయ మార్పుకు తనను తాను అప్పగించుకొనెను. అందువలన దావీదు దేవుని కృపను సంపాదించుకొనెను. వృద్ధాప్యంలో ఘనత, ఐశ్వరము కలిగి దావీదు మరణించగా, (1 దినవృత్తాంతములు 29:28) సౌలు సొంత ఖడ్గము మీదపడి భయంకరమైన మరణమును ఎదుర్కొనెను. (1 సమూయేలు 31:4)

గ్రంథ విభజన : ఈ గ్రంథమును మూడు పెద్ద భాగములుగా విభజింపవచ్చును. I. దావీదు పొందిన జయములు (1 – 10 అధ్యాయములు). 2. దావీదు యొక్క పాపం (11 అధ్యాయము). 3. పాప ఫలితము వలన దావీదు అనుభవించవలసిన శ్రమలు (12 – 24 అధ్యాయములు)

కొన్ని క్లుప్త వివరములు : పరిశుద్ధ గ్రంథములోని 10వ పుస్తకము : అధ్యాయములు 24; వచనములు 695; ప్రశ్నలు 125; చరిత్రకు సంబంధించిన వచనములు 679; నెరవేరిన ప్రవచనము 9; నెరవేరనివి 7; దేవుని సందేశములు 11; ఆజ్ఞలు 70; వాగ్దానములు 13; హెచ్చరికలు 25.

Samuel 1 – 1 సమూయేలు

ఇశ్రాయేలీయులులో దీర్ఘకాలము న్యాయాధిపతుల ద్వారా పరిపాలన చేసిన రాజ్యము తన స్థలమును ఖాళీ చేసి ఇచ్చే కాల మార్పునే ఈ మొదటి సమూయేలు పుస్తకము చెప్పుచున్నది. ఇశ్రాయేలీయుల రాజ్యమును గురించి చెప్పు ఆరు పుస్తకములు ఈ పుస్తకము నుండి ప్రారంభమగుచున్నవి. వీటి యొక్క విషయ సూచికలను చూద్దాము.

1 సమూయేలు – మనుష్యుని అర్హతలను బట్టి సరి అయిన రాజు – సౌలు.

2 సమూయేలు – ఆత్మీయ యోగ్యతలను బట్టి దేవుడు ఎన్నుకున్న రాజు – దావీదు.

1 రాజులు – సొలోమోను, ఇశ్రాయేలు.

2 రాజులు – ఇశ్రాయేలీయుల రాజవంశము.

1 దినవృత్తాంతములు – సొలొమోను, దేవాలయము.

2 దినవృత్తాంతములు – రాజంశములు, దేవాలయము.

ఇశ్రాయేలీయులలో 500 సంవత్సరాల రాజుల పాలన చరిత్ర ఈ పుస్తకము నుండి ప్రారంభమగుచున్నది. ఈ పుస్తకములో తలఎత్తి నిలువబడిన ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులను ఈ గ్రంథకర్త మన దృష్టికి తీసుకువస్తున్నాడు.

(1). చివరి న్యాయాధిపతియైన సమూయేలు. (2). మొదటి రాజైన సౌలు. (3). అభిషేకము పొందిన రాజు గా ఉండినప్పటికి 10 సంవత్సరాలు పారిపోయి దాగుకొనిన దావీదు.

జీవిత చరిత్రకు ఆకర్షణీయమైన వస్త్రములను ధరింపజేసి గ్రంథకర్త పొందుపరచాడు. అందరు ఇష్టపడు ఒక విషయము. సన్నివేశమును వివరించుట. క్రైస్తవ కుటుంబములలో పెరిగే చిన్న బిడ్డలు పిన్న వయసు నుండి వినే కథలుగా చిన్న సమూయేలు జీవితము (అధ్యా – 3), దావీదు – గొల్యాతును సంధించుట (అధ్యా 17), దావీదు యోనాతానుల స్నేహము (అధ్యా 18లో) కనబడుచున్నవి.

పుస్తకము యొక్క పేరు : హెబ్రీబైబిలులో సమూయేలు 1, 2 పుస్తకములు ఒకే సమూయేలు పుస్తకముగా కనబడుచున్నవి. సమూయేలు అను పేరునకు “దేవుని దగ్గర అడిగిపొందబడినవాడు” అని అర్థము. జీవితమంతటిని దేవుని కొరకు అప్పగించుకొనిన సమూయేలు, అన్నింటికంటే పైగా ఒక ప్రార్ధనా వీరుడుగా ఉన్నాడు. ప్రార్థనా శక్తికి మార్గము చూపించే ఒక పుస్తకముగా సమూయేలు గ్రంథము ఉన్నది. న్యాయాధిపతుల పరిపాలనలోని అంధకారయుగములో జీవించిన ఒక ప్రార్థనా పరురాలి చరిత్రతో ఈ పుస్తకము ప్రారంభమగుచున్నది. ఈ విధముగా దేవునిని అడిగి ఆమె పొందిన సమూయేలు ఏలీ ఎదుట యోహోవాను సేవించెను (1 సమూయేలు 3:1) దేవునికి ఉపయోగకరమైన పాత్రగా బాలుడైన సమూయేలు ఉన్నాడు. (1 సమూయేలు 3:1-19) దేవుని ప్రజలకు ప్రార్థన ద్వారా జయమును సంపాదించే ప్రవక్తగా సమూయేలు పెరిగెను. (1 సమూయేలు 7:5-10). తన ప్రజలు ఒక రాజు కొరకు అడిగినప్పుడు ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసెను (1 సమూయేలు 8:6. ఈ విధముగా విజ్ఞాపన ప్రార్థన సమూయేలు యొక్క జీవితములో ముఖ్యమయిన భాగముగా ఉన్నది.

ఉద్దేశము : ఇశ్రాయేలీయుల చివరి న్యాయాధిపతి అయిన సమూయేలు జీవిత చరిత్ర, మొదటి రాజైన సౌలు పరిపాలనా మరియు పతనము, ఇశ్రాయేలీయుల మహోన్నతమైన రాజుగా దావీదును ఎన్నుకొనుట. తర్ఫీదు చేయుట యొక్క వివరములు.

గ్రంథకర్త : సమూయేలు (నాతాను, గాదు అనే ప్రవక్తల రచనలు కూడా ఉన్నవి. 1 దినవృత్తాంతములు 29:29.

గత చరిత్ర : న్యాయాధిపతుల కాలంలో ఈ పుస్తకము ప్రారంభమగుచున్నది. దేవుని పరిపాలన నుండి రాజుపాలనకు పరివర్తన చెందుటను గూర్చి వివరించుచున్నది.

ముఖ్యవచనములు : 1 సమూయేలు 8:7-9

ముఖ్యమైన వ్యక్తులు : ఏలీ, హన్నా, సమూయేలు, సౌలు, యోనాతాను, దావీదు.

గ్రంథ విభజన : సమూయేలు మొదటి పుస్తకమును మూడు భాగములుగా విభజింపవచ్చును.

సమూయేలు న్యాయము తీర్చిన కాలము ( అధ్యా 1-7); 2. సౌలు పరిపాలనా కాలము (అధ్యా 8 -15 ); 3. సింహాసనమును పొందిన దావీదు అజ్ఞాతవాస కాలము ( అధ్యా 16 -31) ఈ కాలములో సౌలు రాజుగా కొనసాగాడు గిల్బోవ పర్వత శిఖరమున సౌలు, అతని కుమారులు చనిపోయిన వెంటనే దావీదు తిరుగులాడిన కాలము ముగిసినది.
పుస్తకము యొక్క చివరి అధ్యాయములో (అధ్యా 31) నల్లని బట్టలు ధరించిన దుఃఖభరితమైన, కథ చాలా హీనమైన, పడిపోయిన దృశ్యమును చూచుచున్నాము. సొంతకత్తి మీదపడి చనిపోయిన సౌలు సొంత కత్తితో ఆత్మహత్య చేసికొని చనిపోయిన మనిషి యొక్క ప్రతిబింభమును అక్కడ చూచుచున్నాము. బంగారు యౌవనమో లేక సాధించిన గొప్ప విజయములో జీవితముగింపులో జయమునకు హద్దుగా ఉండవు. లోబడుటలో జీవిత ముగింపు వరకు నిలిచే వ్యక్తులే జీవ కిరీటమునకు యోగ్యులగుదురు. లోబడకపోవుట, గర్వం, అసూయ మొదలగు వాటికి, ఎరగా మారి నాశనమైన ఒక వ్యక్తి యొక్క విషాధమైన చిత్రముతో ఈ పుస్తకము యొక్క కథకు తెరదిగుచున్నది.

ఈ కొన్ని క్లుప్త వివరములు : 9వ పుస్తకము : అధ్యాయములు 31; వచనములు 810; ప్రశ్నలు 157; నెరవేరిన ప్రవచనములు 50; నెరవేరని ప్రవచనము 1; దేవుని యొద్ద నుండి ప్రత్యేక సందేశములు 29; వాగ్దానములు 4; ఆజ్ఞలు 117; హెచ్చరికలు 57.

Ruth – రూతు

న్యాయాధిపతుల యొక్క అంధకార యుగములో కల్తీలేని ప్రేమతో, నిష్కపట భక్తికి వర్ణకాంతులు విరజిమ్ముచున్న ఒక ఆదర్శ స్త్రీ చరిత్ర రూతు గ్రంథము. ఇశ్రాయేలు ప్రజలను, ఇశ్రాయేలు దేవుని ప్రేమించడానికి తన స్వజాతితో ఉన్న సంబంధములను, ఆచారములను త్రోసివేసి బెత్లెహేముకు వచ్చిన ఒక మోయాబు స్త్రీయే ఈ పుస్తకము యొక్క కథానాయకురాలు. బోయజు అనే ఉత్తమ భర్తను, ఓబేదు అనే మంచి కుమారుని ఆమె యొక్క భక్తి, ప్రేమ, దీనత్వము మొదలగు వాటికి బహుమతులుగా దేవుడు ఇచ్చెను. దావీదు రాజు తండ్రియైన యెష్షయి యొక్క తండ్రియే ఈ ఓబేదు. ఈ విధముగా ఆమె దావీదు పితరుల వంశావళి పట్టికలో స్థానం పొందినది. ఐక్యత అనే అర్ధమునిచ్చే “రియూత్ ” అనే హెబ్రీమాట యొక్క అర్థమే రూతు అను పేరు.

రూతు యొక్క కాలము: రూతు కథ నాలుగు రకములైన పరిస్థితులతో జరుగుచున్నది. రూతులో జరిగిన సంఘటనలు నాలుగు విభిన్న పరిస్థితులుగానుండెను. 1. మోయాబు దేశము (రూతు 1:1-18); 2. బెత్లెహేములో ఒక పంట పొలము (Ruth,1,19-2,23); 3. బెత్లెహేములోని ఒక ధాన్యపు కళ్లము (రూతు 3:1-18); 4. బెత్లెహేము నగరము (రూతు 4:1-21). ఇశ్రాయేలుకు పొరుగు రాజ్యమైన మోయాబు దేశము మృత సముద్రము యొక్క ఈశాన్యములో ఉన్నది. రూతు యొక్క మొదటి వచనము గత చరిత్రను స్పష్టీకరించుచున్నది. చూడండి, “న్యాయాధిపతులు యేలిన దినములయందు” (రూతు 1:1) విశ్వాసము, త్యాగము, యుద్ధము, క్రమశిక్షణా రాహిత్యము, అక్రమము, అరాచకము అనునవి రాజ్యమేలిన ఆ అంథకార యుగములో దేవుని ఆజ్ఞలను పట్టుదలతో వెంబడించిన ప్రజలు దేశములో ఉండినట్లుగా ఈ పుస్తకము దృఢపరచుచున్నది. ఆ ప్రత్యేక కాలమట్టము యొక్క చరిత్ర సందేశమును చెప్పుట మాత్రమే గాక, అందమైన ఒక సంభవమును చిత్రించుటకు ఈ పుస్తకము వ్రాయబడినది. కనుక దీని వర్తమానకాలమును గణించుట కఠినమైనది. కాని ముందుగా చెప్పిన నాలుగు పరిస్థితులను ప్రాథమికముగా పెట్టుకొని అది జరిగిన కాలమును మనము ఈ విధముగా గుర్తించవచ్చును. (1). రూతు 1:1-18 లోని దృశ్యము జరిగిన స్థలము మోయాబుదేశము, కాలము – సుమారు 10 సంవత్సరాలు. (2). Ruth,1,19-2,23 లోని దృశ్యము జరిగిన స్థలము – బేల్లెహేములోని ఒక పొలము, కాలము – సుమారు 1 నెల. (3). రూతు 3:1-18 లోని దృశ్యము జరిగిన స్థలము – బేబ్లె హేములోని ఒక కళ్లము, కాలము – ఒక రాత్రి. (4) రూతు 4:1-22 లోని దృశ్యము జరిగిన స్థలము – బెత్లెహేము నగరము. కాలము ఒక సంవత్సరము.

ఉద్దేశము: చుట్టు ఉన్నవారందరు తొట్రిపడిపోవుచున్నప్పుడును, శ్రేష్ట స్వభావములోను, దేవునితో ఉన్న యథార్ధ సంబంధములోను ఏవిధముగా స్థిరముగా నిలబడగలము అను చూపించుట కొరకు.

గ్రంథకర్త: పుస్తకములోని ఏ భాగములోను గ్రంథకర్తను గురించిన వివరములు లేవు. దీని గ్రంథకర్త రచించినది సమూయేలు అని కొందరు అభిప్రాయపడుచున్నారు. ఈ పుస్తకములో తేటగా చెప్పబడిన కొన్ని భాగములను బట్టి చూచినట్లయితే సమూయేలు మరణము తరువాత ఇది వ్రాయబడినది.

కాలము: న్యాయాధిపతుల కాలము. క్రీ.పూ. 1375 – 1050.

నేపథ్యము: తమ ఇష్టానుసారముగా జీవించిన ఇశ్రాయేలీయుల అంథకారయుగము. (న్యాయాధిపతులు 17:6) ముఖ్యవచనము: రూతు 1:16.

ముఖ్యమైన వ్యక్తులు: రూతు, నయోమి, బోయజు.

ముఖ్యమైన స్థలములు: మోయాబు, బెత్లెహేము.

గ్రంథ విభజన: 1. నయోమి మోయాబుకు వెళ్ళి నివశించుట, తిరిగి వచ్చుట. రూతు 1:1-22. 2. రూతు స్వీకరించబడినది Ruth,2,1-3,18. 3. బోయజు, రూతు రూతు 4:1-21.

కొన్ని క్లుప్త వివరములు: పరిశుద్ధ గ్రంథములో 8వ పుస్తకము ; అధ్యాయములు 4; వచనములు 84; ప్రశ్నలు 16; ప్రవచనములు లేవు. ఇశ్రాయేలీయులకు ఒక ప్రవక్త ద్వారా కూడా సందేశమును తీసుకురాని మొదటి పుస్తకము, ఆజ్ఞలు 30; వాగ్దానములు 2.

Judges – న్యాయాధిపతులు

యెహోషువ పుస్తకములో తేటగా చెప్పబడిన ఇశ్రాయేలీయుల పరిస్థితికి భిన్నమైన పరిస్థితిని చెప్పే పుస్తకమే ఈ “న్యాయాధిపతులు”. లోబడె గుణము కల్గిన ఒక సమూహము దేవుని శక్తిని ఆనుకొని కనానును జయించుట మనము యెహోషువలో చూస్తున్నాము. న్యాయాధిపతులలో లోబడని, విగ్రహారాధన చేయు ప్రజలు దేవునికి వ్యతిరేకముగా నిలుచుట వలన మరలా మరలా ఓటమి పొందిన దృశ్యమును చూస్తున్నాము. దేవుని ఆజ్ఞలను విడిచి పెట్టిన తరువాత తమ ఇష్టము చొప్పున నడచు ఈ ప్రజలు అనేక రకములైన జనాంగముల వలన హింసను, కౄరత్వమునకు బలైయ్యారు. సుమారు 350 సంవత్సరాల ఇశ్రాయేలీయుల చరిత్ర ఈ పుస్తకములో చెప్పబడుచున్నది. ఈ పరిస్థితుల మధ్య వారిని విడిపించుటకు పరాక్రమము గల నాయకులను దేవుడు లేవుచున్నాడు. ప్రతినాయకుని కాలంలో ప్రజలు పశ్చాత్తాపపడినప్పుడు, సమాజములో మంచి పరిపాలన సమాధానము స్థిరపరచబడుచున్నది. అయినప్పటికిని ఆ నాయకుల తరువాత మరలా వారు మహా గొప్ప దేవుని విడిచి పెట్టి పాపములోనూ, విగ్రహారాధనలోను పడిపోవుచుండిరి.

పుస్తకము యొక్క పేరు: హెబ్రీ పరిశుద్ధ గ్రంథములో ఈ పుస్తకమునకు ఇవ్వబడిన పేరుకు తెలుగు తర్జుమాయే “న్యాయాధిపతులు”. హెబ్రీ పరిశుద్ధ గ్రంథములో “షో పెట్రీమ్” అను పేరునకు న్యాయాధిపతి, ఏలువాడు, విమోచకుడు, రక్షకుడు అను అర్ధాలు ఉన్నవి. గ్రీకు బైబిలులో వాడబడిన “క్రిట్టాయి” అను పేరునకు కూడ న్యాయాధిపతులని అర్థము. “ ఓటమిపుస్తకము” అని కూడా ఈ పుస్తకమును పిలుస్తారు. న్యాయాధిపతుల పరిపాలనా కాలము: యెహోషువ మరణకాలంలో కూడా కనానులో ఆక్రమించుకొనవలసిన ప్రాంతములు ఇంకను అనేకం ఉండినవి. యెహోషువ క్రీ.పూ. 1390లో మరణించెను దానికి సుమారు 10 సంవత్సరములకు ముందు అంటే క్రీ.పూ. 1380 నుండి సుమారు. క్రీ.పూ. 1045 వరకు ఉన్న 335 సంవత్సరముల చరిత్రను ఈ న్యాయాధిపతుల గ్రంథము వివరించుచున్నది. ఒత్నీయేలు నుండి సంసోను వరకు 13 మంది, 1 సమూయేలులో మనము చూస్తున్న ఏలీ, సమూయేలు, యోవేలు, అబీయా అను నలుగురును చేర్చినయెడల మొత్తం 17 మంది. ఇశ్రాయేలులో న్యాయాధిపతులుగా పరిపాలన చేసిరి. సమూయేలు పుస్తకములో జరిగిన సంభవముల కాలమైన 30 సంవత్సరములను చేరిస్తే మొత్తము సుమారు 365 సంవత్సరములు ఇశ్రాయేలులో న్యాయాధిపతుల పరిపాలనా కాలమగును.

ఉద్దేశ్యము: దేవుడు పాపమును శిక్షించును అనేది ఖచ్చితము. అయినప్పటికి పశ్చాత్తాప పడువారిని క్షమించి, ఆయనతో ఉన్న సంబంధమును, నూతన పరచును అనే కార్యము దృఢపరచడమైనది.

గ్రంథకర్త: సమూయేలు

నేపథ్యము: తరువాత ఇశ్రాయేలుగా పిలువబడిన కనాను దేశము దేవునిని ద్వేషించువారు అనేక రాజ్యములుగా నున్న కనానును లోపరచుకొనుటకు దేవుడు ఇశ్రాయేలీయులకు సహాయము చేసెను. వారు దేవునికి లోబడనందున ఆదేశమును పోగొట్టుకునే పరిస్థితులలో వారున్నారు.

ముఖ్య వచనములు: న్యాయాధిపతులు 17:6

ముఖ్యమైన వ్యక్తులు: ఒత్నీయేలు, యెహూదు, దెబోరా, గిద్యోను, అబీమెలెకు, యెఫ్తా, సంసోను, దెలీలా.

పుస్తకము యొక్క ప్రత్యేక: ఇశ్రాయేలు దేశములో మొట్టమొదటి అంతర్గత యుద్ధమును తెలియజేయుచున్నది.

గ్రంథ విభజన: 1. న్యాయాధిపతుల దినములలో నున్న పరిస్థితులు Judg,1,1-3,6; 2. ఇశ్రాయేలీయులను శ్రమపరచిన రాజ్యములు, Judg,3,7-16,31; 3. విగ్రహారాధన, దేశీయ అంతర్గత యుద్ధము Judg,17,1-21,25

కొన్ని క్లుప్త వివరములు: పరిశుద్ధ గ్రంథములో 7వ పుస్తకము ; అధ్యాయములు 21; వచనములు 618; చరిత్రకు సంబంధించిన వచనములు 585; నెరవేరిన ప్రవచనములు 33; ప్రశ్నలు 92; దేవుని ప్రత్యేక సందేశములు 23; ఆజ్ఞలు 71; హెచ్చరికలు 26; వాగ్దానములు 5.

తుది కూర్పు: న్యాయాధిపతులు 17 నుండి 21 వరకు ఉన్న అధ్యాయములు ఈ పుస్తకము యొక్క తుది కూర్పుగా చెప్పవచ్చును. దేవుని విడిచి స్వంత మార్గములకు తిరిగి ఇశ్రాయేలీయుల అంతర్గత కలహమును, క్రమశిక్షణను మీరిన భయంకర స్థితిని మనము చూస్తున్నాము. న్యాయాధిపతులు 19లో చూచిన విధముగా క్రమశిక్షణలేని హీనమైన జీవితము బైబిలులోని వేరే భాగములలో ఎక్కడైనా చూడవచ్చునా అని సందేహముగా ఉన్నది. పాపము ఎక్కువైన స్థలములో దేవుని కృప కూడా ఎక్కువగుట అనే దేవుని సత్యమును జరిగిన సంగతుల మూలముగా మనము అర్ధము చేసుకొనవచ్చును.

Joshua – యెహోషువ

మోషే యొక్క పంచకాండములకు తరువాత యెహోషువ మొదలుకొని ఎస్తేరు గ్రంథము వరకు ఉన్న 12 చరిత్ర పుస్తకములు బైబిలులోని రెండవ భాగము అని చెప్పవచ్చును. వాటిలో మొదటి పుస్తకమైన యెహోషువ పంచకాండముల పుస్తకములను, ఇశ్రాయేలీయుల చరిత్రను కలుపుచున్నది.

మూడు ముఖ్యమైన యుద్ధముల ద్వారా కనానును జయించుట ఈ పుస్తకము యొక్క సారాంశము. యెహోషువ నాయకత్వంలో దాదాపుగా 30 శత్రు సేనలను ఇశ్రాయేలీయులు జయించిరి. జయము అనునది సైన్యము యొక్క బలము వలన కాదుగాని, దానికి బదులుగా దేవుని మీద ఉన్న విశ్వాసము, దేవుని వాక్యమునకు లోబడుట ద్వారా సాధ్యము అని ఈ పుస్తకము నిరూపించుచున్నది. దీనివలె ధైర్యమును ప్రోత్సాహము, దైవజ్ఞానమును ఇచ్చు పుస్తకము పాత నిబంధనలో ఇంకొకటి లేదు అని చెప్పవచ్చును. పుస్తకము యొక్క పేరు: పుస్తకము యొక్క ముఖ్యమైన వ్యక్తి అయిన యెహోషువ పేరే ఈ పుస్తకమునకు పెట్టుట గమనించదగినది. యెహోషువ యొక్క మొదటి పేరు హోషేయా (Num13 8). “రక్షణ” అనునది ఈ పేరుకు అర్ధము. మోషే ఆ పేరును యెహోషువ అని మార్చినాడు. సంఖ్యాకాండము 13:16, “యెహోవాయె రక్షణ” అనునది దీని అర్ధము. గ్రీకు భాషలో యేసు అనునదే హెబ్రీభాషలో యెహోషువ. కనానును జయించే పనిలో ఇశ్రాయేలీయుల నాయకునిగా యెహోషువ ఉన్నప్పటికి నిజమైన జయశీలుడు దేవుడే అని ఈ పుస్తకము చెప్పుచున్నది.

భౌగోళిక పరిస్థితి: యెహోషువ పుస్తకములో మనము మూడు భౌగోళిక పరిస్థితులను చూచుచున్నాము. అవి యొర్దానునది, కనాను దేశము, 12 గోత్రములు నివసించిన స్థలములు.

ఉద్దేశము: ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశమును స్వతంత్రించు కొనుటను వివరించుట

గ్రంథకర్త: యెహోషువ (చివరి భాగమును ఆయనతో ఉండిన ఫీనెహాసు వ్రాసియుండవచ్చును).

గతచరిత్ర: వాగ్దాన దేశమైన కనాను (ఇప్పటి ఇశ్రాయేలు దేశము).

ముఖ్యమైన వ్యక్తులు: యెహోషువ, రాహాబు, ఆకాను, ఫీనెహాసు, ఎలియాజరు.

ముఖ్యమైన స్థలములు: యెరికో, హాయి, ఏబాలు పర్వతము, గెరిజీము కొండ, గిబియోను, గిల్గాలు, షెకేము. ప్రత్యేకత: 20 లక్షల కంటె ఎక్కువ మంది ఐగుప్తు నుండి బయలుదేరినప్పటికి 20 సంIIలకు పైనున్న వారిలో యెహోషువ, కాలేబు మాత్రమే వాగ్దాన దేశములోనికి అడుగిడిరి.

పుస్తకము యొక్క ముఖ్య భాగములు: స్వతంత్రించు కొనుట అనునది ఈ గ్రంథము యొక్క ప్రాముఖ్యమైన మాట. ఇంకా ముఖ్యమైన భాగములు యెహోషువ 1:2-3; యెహోషువ 1:8; యెహోషువ 11:23; యెహోషువ 23:14

యెహోషువ గ్రంథములో 24వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనది. యెహోషువ చివరి సందేశమును విన్న ఇశ్రాయేలీయులు దేవునితో నిబంధన చేయుట. యెహోషువ మరణము, పాతి పెట్టుట అనునవియే ఈ అధ్యాయము యొక్క ముఖ్యాంశములు.

గ్రంథ విభజన: యెహోషువ గ్రంథమును రెండు పెద్ద భాగములుగా విభజింపవచ్చును.

1 వాగ్దాన దేశమును జయించుట, Josh,1,1-13,7 వరకు 2 వాగ్దాన దేశమును పంచి గోత్రములను నివసింపచేయుట Josh,13,8-24,33 వరకు

ఈ భాగములలో కనబడే అంశముల విషయ సూచిక ఈ క్రింద ఇవ్వబడుచున్నది.

సైన్యమునకు కావలసిన ఆత్మీయత మరియు లోక సంబంధమైన సిద్ధపాటు 1 – 5 అధ్యాయములు, మోషే యెహోషువకు ఇచ్చిన ఆలోచనలు వేగుచూచుట, మొర్దాను, నూతన తరము వారి సున్నతి ఆచారములు ఈ భాగములో ఉన్నవి. మధ్య కనాను మీద యుద్ధమునకు పోవుట Josh,6,1-8,35 వరకు. దక్షిణ కనాను, ఉత్తర కనానుల మీద యుద్ధము చేయుట Josh,9,1-13,7 వరకు. పంచి పెట్టుట, నివాస స్థలము ఏర్పాటు చేయుట Josh,13,8-24,33 వరకు. ఈ భాగములో గోత్రము గోత్రముగా నివసించవలసిన స్థలములు వివరించుటలో కాలేబుకు హెబ్రోను కొండ ఇచ్చుట, ఆశ్రయ పురములను ఎన్నుకొనుట, లేవీయుల నగరములు, యెహోషువ చివరి సందేశము, మరణము, పాతి పెట్టబడుట మొదలగునవి చెప్పబడినవి.

కొన్ని క్లుప్త వివరములు: పరిశుద్ధ గ్రంథములోని 6వ పుస్తకము, అధ్యాయములు 24; వచనములు 658; చరిత్రకు సంబంధించిన వచనములు 624; నెరవేరిన ప్రవచనములు 42; ప్రశ్నలు 21; దేవుని సందేశములు 14; ఆజ్ఞలు 98; హెచ్చరికలు 44; వాగ్దానములు 15.

Deuteronomy – ద్వితీయోపదేశకాండము

120 సంవత్సరాల వృద్ధుడైన మోషే 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణమును ముగించాడు. వాగ్దాన దేశమును స్వతంత్రించుకొనడానికి సిద్ధముగా ఉన్న రెండవ తరము వారైన ఇశ్రాయేలీయులను పంపడానికి అతడు ఇచ్చిన సందేశమే ద్వితీయోపదేశకాండము. లేవీయకాండమువలె ఈ పుస్తకములో పెద్ద ఆజ్ఞల పట్టికను చూడవచ్చును. కాని లేవీయకాండములో ముఖ్యముగా యాజక వంశముతో మాట్లాడినట్లుగా ఇక్కడ సాధారణ ప్రజలతో మాట్లాడుచున్నాడు. వారిముందు తరమువారి భయంకర నాశనమునుండి పాఠము నేర్చుకొనునట్లును, లోబడుటలో ఉన్న గొప్పతనమును అర్ధము చేసుకొనునట్లును మోషే పిలుపునిచ్చుచున్నాడు. ఈ పుస్తకములో ఆజ్ఞల యొక్క బంధకాలను చూడకుండ దేవుని వాక్యములోని మాధుర్యాన్ని దర్శించుచున్నాము అనునదే ఈ పుస్తకము యొక్క ప్రాముఖ్యతగా ఉన్నది. లోబడుట ద్వారా వచ్చు ఆశీర్వాదమును లోబడక పోవుట ద్వారా వచ్చు శాపమును వివరించుటకే ఈ పుస్తకము వ్రాయబడినది.

ద్వితీయోపదేశకాండము – క్రీస్తు: ప్రభువు (క్రీస్తు) తరచుగా ఈ పుస్తకములోని లేఖన భాగములను ఉపయోగించేవాడు. సాతానుతో పోరాడుటకు ప్రభువు ఉపయోగించిన మూడు వచనములు ద్వితీయోపదేశ కాండము నుండి తీసుకొనబడినవే. (మత్తయి 4:-10). పరిత్యాగ పత్రికను గురించి యూదులతో మాట్లాడేటప్పుడు, ధర్మశాస్త్రములోని ప్రధానమైన ఆగ్నేమిటి అని ప్రశ్న వేసినప్పుడు ప్రభువు ఎత్తిచూపినవి ఈ పుస్తకములోని వచనములే (మత్తయి 19:3-8; మత్తయి 22:30-40)

పుస్తకము యొక్క పేరు: హెబ్రీ భాషలో ఈ పుస్తకము హార్టేబరీమే అనే మాటతో ప్రారంభమగుచున్నది. “ఆ వాక్యములు” అని అర్ధమునిచ్చే, ఆ మాటే పుస్తకము యొక్క పేరుగా ఇయ్యబడినది. మోషే యొక్క ఆ మాటలే దేవుడిచ్చిన ధర్మశాస్త్ర వాక్యములే అని ఈ మాట చూపించుచున్నది. సీనాయి పర్వతమునందు ఇవ్వబడిన ధర్మశాస్త్రమును తిరిగి చెప్పే పుస్తకము అను సందర్భములో ద్వితీయోపదేశకాండము అనే పేరు తెలుగులో ఇవ్వబడుట బహుసరిగా నున్నది.

సమకాలీన పరిస్థితులు: యెరికోకు, యొర్దాను నదికి తూర్పున వున్న మోయాబు మైదానములో జరిగిన సంగతులు ఈ పుస్తకములో చూపించ బడుచున్నవి. ఈ సంగతులన్ని సుమారు రెండు నెలలలో జరిగినవని అనుకొనవచ్చును. దీనిలో రెండవ నెల మోషే గురించి ఇశ్రాయేలీయులు ప్రలాపించిన దినములుగా ఉన్నవి దానిని విడదీస్తే అరణ్య ప్రయాణము చివరి ఒక నెలలో (క్రీ.పూ 1405) దీనిలో చెప్పబడిన ముఖ్యమైన సంగతులు జరుగుచున్నవి. ద్వితీయోపదేశకాండము 1:3; ద్వితీయోపదేశకాండము 34:8; యెహోషువ 5: 6-12, ఈ వాక్యభాగములను పోల్చి చూస్తే ఇది తేటపడుతుంది. క్రొత్త తరము కనానులో ప్రవేశించుటకు సిద్ధమగుచున్న సమయములో, వారు దేవుని విశ్వసించి, లోబడి దైవీక ఆశీర్వాదములను స్వతంత్రించుకొనవలెననే లక్ష్యంతో వ్రాయబడిన పరిశుద్ద పుస్తకముగా దీనిని ఎంచవచ్చును.

ఉద్దేశము: దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు చేసినవి మరలా వారికి జ్ఞాపకము చేయుట, వారిని మరలా ఒక అర్పణకు ప్రోత్సాహించుట.

గ్రంథకర్త: మోషే (మోషేమరణము తరువాత మిగిలిన భాగమును యెహోషువ వ్రాసినట్లుగా చెప్పబడుచున్నది)

ఎవరికి వ్రాసిరి: వాగ్దానదేశములో ప్రవేశించడానికి సిద్ధముగా ఉన్న నూతన ఇశ్రాయేలు సంతతికి

కాలము: క్రీ.పూ 1405

గత చరిత్ర: యోర్దానునది తూర్పు ప్రాంతము

ముఖ్యవచనము: ద్వితీయోపదేశకాండము 7:9

ముఖ్యమైన వ్యక్తులు: మోషే, యెహోషువ

ముఖ్యమైన స్థలాలు: మోయాబు దేశములోని అరాబా మైదానము.

గ్రంధ విభజన: ముందు సీనాయిపర్వతము మీద దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రమును పోలిన మాదిరిగా మోషే ఇచ్చిన మూడు సందేశములే ఈ పుస్తకములోని ముఖ్యాంశములు

మొదటి సందేశములో Deut,1,1-4,43 వరకు దేవుడు తన ప్రజల కొరకు చేసిన కార్యములు. 2.రెండవదిగా Deut,4,44-26,19 వరకు దేవుడు వారి దగ్గర నుండి ఎదురుచూచిన కార్యములు. 3.మూడవదిగా ద్వితీయ 27వ అధ్యాయము నుండి 33వ అధ్యాయము వరకు భవిష్యత్తులో దేవుడు వారి కొరకు చేయ నిశ్చయించినవి మోషే చెప్పుచున్నాడు. ఈ విధముగా మోషే దేవుని ధర్మశాస్త్రమును ఎత్తి చూపి, వివరించి, స్థిరపరచుచున్నాడు.
కొన్ని క్లుప్తమైన వివరములు: పరిశుద్ధ గ్రంథములోని ఐదవ పుస్తకము, అధ్యాయములు 34; వచనములు 958; ప్రశ్నలు 33; చరిత్రకు సంబంధించిన వచనములు 690; నెరవేరిన ప్రవచనములు 230; నెరవేరనివి 37; దేవుని సందేశములు 33; ఆజ్ఞలు 519; వాగ్దానములు 47; హెచ్చరికలు 497.

Numbers – సంఖ్యాకాండము

ఇశ్రాయేలీయులు అవిశ్వాసము, అవిధేయత వలన దాదాపుగా 40 సంవత్సరాలు అరణ్యములో సంచరించిన చరిత్రనే సంఖ్యాకాండము చెప్పుచున్నది. హెబ్రీమూల భాషలో దీనికి చెప్పబడిన మొదటి మాట వాక్వేతెబర్ (చెప్పబడినది) అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞ అని దాని అర్ధము. ఆజ్ఞ అరణ్య ప్రయాణం ప్రారంభంలోనే ఇశ్రాయేలీయులలో యుద్ధమునకు వెళ్ళుటకు అర్హులు ఎంత మంది అని లెక్కించి తీర్మానించాలి. దాదాపుగా 38 సంవత్సరముల తరువాత రెండవ సారి ఒక లెక్కింపు జరిగినది. అప్పుడు వారి అరణ్య ప్రయాణపు చివరి ఘట్టములో మోయాబు మైదానములోనికి వచ్చిరి. ఆ సమయములో మోషే ఎదుట ఉన్నవారిలో ఇద్దరు తప్ప తక్కిన వారంతా రెండవ తరమువారు. ఈ రెండు లెక్కింపులు ఈ పుస్తకము యొక్క పేరుకు బలమునిచ్చేవిగా నున్నవి. జన సంఖ్య లెక్కింపులో నేర్చుకొనవలసిన శ్రేష్ఠమైన పాఠం ఒకటున్నది. మొదటి లెక్కింపు జరిగినపుడు యుద్ధవీరులుగా లెక్కించబడినవారు ఆరు లక్షలుకు పైగానున్నారు. వారందరు అరణ్యములో రాలిపోయిరి. ఏదేమైనప్పటికి కనానులో కాలు మోపే సమయమునకు ఇంకొక ఆరు లక్షలకు పైగా యుద్ధవీరులు యుద్ధ భూమిలోనికి దుమికిరి. దేవుని యొక్క ఉద్దేశ్యములు ఎల్లప్పుడు సరిఅయిన సమయములో నెరవేరును. దానిని ఎవరు అడ్డుకొనలేరు.

అధిక సంచార పయనం : కాదేషు బర్నేయలో నుండి కనాకు వెళ్ళుటకు పదకొండు దినముల ప్రయాణము చాలును. దానికి బదులుగా 38 సంవత్సరాలు అరణ్యమార్గమున సంచరించి కష్టములు అనుభవించిరి. దేవుడు 95 కీర్తనలోని రెండు వచనములలో ఇశ్రాయేలీయుల క్లిష్ట పరిస్థితిని గూర్చి చెప్పెను నలువది యేండ్ల కాలము ఆ తరమువారి వలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలిసికొనలేదని అనుకొంటిని. కావున నేను కోపించి – వీరెన్నడును నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసితిని. (కీర్తనల గ్రంథము 95:10-11)

అన్ని పాపములకు నివాసం అవిశ్వాసమే. దాని ఫలితం సర్వనాశనమని హెబ్రీ గ్రంథకర్త ఈ చరిత్రను జ్ఞాపకము చేసికొని 3, 4 అధ్యాయములలో విశదీకరించెను. ఈ విధంగా దేవుని ప్రజల మధ్యకు వచ్చిన అవిశ్వాసము అనే పాపము విపత్తులకు విత్తనములు విత్తినది. వారు అరణ్యములో చనిపోయిరి. ప్రధానయాజకుడైన అహరోను ఆయన సహోదరి మిర్యాము వాగ్దాన దేశమును చూడకుండా పోయిరి. మోషే ప్రజలను బట్టి విసుగుచెంది కోపగించుకుని దేవుని ఎదుట పాపము చేయడం జరిగినది. సీను అరణ్యములో నీరులేకజనులు సణిగినపుడు నీరు ఇమ్మని బండతో మాట్లాడమని దేవుడు ఆజ్ఞాపించెను. మోషే రెండు మారులు బండను కొట్టెను. కాబట్టి వాగ్దాన దేశమును చూడటం మాత్రమే గాని, దానిలో నీవు కాలు పెట్టవు అని దేవుడు చెప్పెను. మోషే పిస్గా కొండ శిఖరమున మరణించెను. సంఖ్యాకాండము 26 నుండి 33 వరకు ఉన్న అధ్యాయములలో మోయాబు మైదానములోనికి వచ్చిన క్రొత్త తరము వారు కనానును స్వతంత్రించుకొనుటకు దేవుడు వారిని స్థిరపరచడాన్ని చూస్తున్నాము. దేవుని దీర్ఘశాంతము, నమ్మకత్వము ఇక్కడ ప్రత్యక్షమగుచున్నది. యెహోషువ మోషేకు బదులుగా దేవుని ప్రజల నూతన నాయకునిగా అభిషేకం చేయబడడం ఇక్కడ చూడవచ్చును.

ఉద్దేశ్యము : వాగ్దాన దేశములోనికి ప్రవేశించుటకు ఇశ్రాయేలీయులు ఏలాగు తెగించిరి? వారి యొక్క పాపము ఏలాగు శిక్షించబడినది? వారు ఇంకను ప్రవేశింప ఏలాగు ప్రయత్నించిరి?

గ్రంథకర్త : మోషే

కాలము : క్రీ.పూ 1450 నుండి 1410

గతచరిత్ర : సీనాయి ప్రాంతపు పెద్ద యిసుక ఎడారి కనానుకు ఈశాన్యములో ఉన్న ప్రాంతము.

ముఖ్య వచనములు : సంఖ్యాకాండము 14:22-23; సంఖ్యాకాండము 20:12.

ముఖ్యమైన వ్యక్తులు : మో షే, అహరోను, మిర్యాము, యెహోషువ, కాలేబు, ఎలియాజరు, కోరహు, బిలాము.

ముఖ్యమైన స్థలములు : సీనాయి పర్వతము, వాగ్దాన దేశమైన కనాను, కాదేషు బర్నేయ, హోరేబు కొండ, మోయాబు మైదానము.

గ్రంథ విభజన : సంఖ్యా కాండమును మూడు ముఖ్యమైన భాగములుగా విభజించవచ్చును. 1. ప్రయాణమునకైన సిద్ధపాటు ప్రయాణ ప్రారంభము 1 – 13 అధ్యాయములు, 2. అవిశ్వాసము వలన తిరుగులాడిన స్థితి 14 – 25 అధ్యాయములు, 3. కనానును ఆక్రమించుకున్న క్రొత్త తరమును సిద్ధపరచుట 26 – 36 అధ్యాయములు

కొన్ని క్లుప్తమైన వివరములు : పరిశుద్ధ గ్రంథములో నాలుగవ గ్రంథము; అధ్యాయములు 36; వచనములు 1288 ; ప్రశ్నలు 59 ; నెరవేరిన ప్రవచనములు 42; నెరవేరని ప్రవచనములు 15; దేవుని సందేశములు 72; ఆజ్ఞలు 554 ; వాగ్దానములు 5; హెచ్చరికలు 79.

Leviticus – లేవీయకాండము

ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశమును విడిచి సాగిపొమ్మని దేవుడు వారికి ఆజ్ఞాపించిన తరువాత, విడుదల పొందిన ఆ జనులను దేవునిలో కేంక్రరింపబడే ఒక జనసమూహముగా చేయుట అవశ్యకమై యున్నది. వారిని ఎల్లప్పుడు సేవించు ప్రజలుగా ఆయన నియమించెను. ఈ విధముగా వారు దేవుని ఎలా సేవించాలి? ఎలా ఆరాధించాలి? ఆయనకు లోబడి ఎలా జీవించాలి? అని మోషే ద్వారా యెహోవా దేవుడు ఆజ్ఞలను వివరించి చెప్పెను. ఈ ఆజ్ఞల సంపుటియే లేవీయకాండము. ఈ ఆజ్ఞలను గైకొనుటయే దీని యొక్క ప్రాముఖ్యాంశము. ఇశ్రాయేలీలు ప్రజలకు అనగా తన జనులకు దేవుడు దయచేసిన ఒక చరిత్రాత్మిక పుస్తకమే ఈ లేవీయకాండము.

ఒక యూదబాలుడు తన జీవితములో మొట్టమొదటిగా నేర్చుకొనవలసిన పుస్తకమే ఈ లేవీయకాండము. ఇందులోనున్న ఒక్కొక్క దృశ్యభాగము రాబోవు కాలములో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు చేయదలచిన మానవాళి రక్షణ కొరకైన కార్యమును వ్రేలెత్తి చూపిస్తున్నది. ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండమను ఈ మూడు పుస్తకములు మానవుని క్రమశిక్షణ, దైవికమైన మూడు పద్ధతులను వివరించుచున్నవి. ఆదికాండములో – నశించిపోయెడి మానవుని గురించి, నిర్గమకాండములో – రక్షింపబడిన మానవుడు, లేవీయకాండములో – ఆరాధించునట్టియు, గైకొనునట్టియునైన మానవుని గురించి మనము చూడగలము.

ఉద్దేశ్యము : యాజకులకు ఆరాధన సంబంధమైన కర్తవ్యములు, హెబ్రీయులకు పరిశుద్ధ జీవితమును జీవించు మార్గములను నిర్దేసిస్తున్నది.

గ్రంథకర్త : మోషే

కాలము : క్రీ.పూ 1446 – 1445

గతచరిత్ర : సీనాయి పర్వతము. ఇశ్రాయేలు జనాంగము ఏవిధముగా ఒక పరిశుద్ధమైన ప్రజలుగా జీవితమును జీవించుటను గురించి దేవుడు వారికి నేర్పించిన విధము.

ప్రాముఖ్యమైన వచనములు : లేవీయకాండము 19:2; 17 11; 20 7-8.

ప్రాముఖ్యులు : మోషే, అహరోను, నాదాబు, ఎలియాజరు, ఈతామారు.

ముఖ్యస్థలములు : సీనాయి పర్వతము.

గ్రంథ విశిష్టత : పరిశుద్ధతను గురించి ఏ పుస్తకములో లేని విధముగా ఈ పుస్తకమందు అతిపరిశుద్ధతను గురించి 152 సార్లు చెప్పబడినది. పాత నిబంధన గ్రంథకాలములో వేరే దేశములతో ఉన్న నియమ నిబంధనలతో పోల్చి చూచినట్లయితే దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞల యొక్క సత్య విలువను గ్రహించగలము. ప్రత్యక్ష సాక్ష్యముగా నిర్గమకాండము 20వ అధ్యాయములో చూడగలము. “దొంగిలింపబడిన దాని విషయం” అనే ఆజ్ఞను గమనించినట్లయితే దొంగ దొంగిలింపబడిన వస్తువును బట్టి శిక్షింపవలెనన్న నియమము నియమించెను. ఒకవేళ వాడు పరిహారము చెల్లించలేకపోయినట్లయితే వానిని చంపవలెనన్న నియమములేదు. అయినప్పటికి 300 సంవత్సరములకు ముందు కాలములో జీవించిన బబులోను రాజైన హమ్మురాబ్బుని చట్ట ప్రకారము దొంగ దొంగిలింపబడిన వస్తువు యొక్క విలువను అచ్చుకొనవలయును, లేనియెడల వానిని చంపవలెనన్న నియమము కలదు. నేరస్థుని స్థానము ఏదైనప్పటికిని ఆ నేరస్థునికి ఒకే శిక్ష విధింపవలెను, “ అదే కంటికి కన్ను పంటికి పన్ను చెల్లింపవలెను” ఇదే ఈ ఆజ్ఞయొక్క పరమార్ధం. (లేవీయకాండము 24:20) విదేశీయులు (పరదేశి) చేసినట్లు పక్షపాతము లేక తీర్పు తీర్చవలెను, లేనట్లయితే దేవుడు వారికి కఠిన శిక్ష విధించును. దేవుని శాసనములో అనాధలకు, గ్రుడ్డివారికి, బీదలకు, చెవిటివారికి, సంరక్షణ కలదు. దేవుని దృష్టిలో ధనికుని సమృద్ధిలో నుండి పొందే అవకాశము వీరికి కలదు. స్వంతగా జీవించలేని బీదల (వారి కాళ్ళమీద వారు నిలబడలేని వారి) యెడల దేవుడు అక్కర కలిగియున్నాడు. లేవీయకాండము 19:9; లేవీయకాండము 19:13-14; లేవీయకాండము 15:32-37 పొరుగు వారితో నీవు నడవవలసిన విధులు వారి అక్కరలలో వారిని పరామర్శించు విధానమును గూర్చిన హెచ్చరికలు : నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను (లేవీయకాండము 19:18) అనే ఆజ్ఞనువారికి వివరించెను.

గ్రంథ విభజన : 1. అనేక ఆజ్ఞల వివరములు 1 – 17 అధ్యాయములు, 2. పరిశుద్ధతకై అనుసరించవలసిన ఆజ్ఞలు 18 – 27 అధ్యాయములు వీటి యందు మొదటి భాగములో దేవుని జనాంగము పాటించవలసిన ఐదు రకములైన బలులు వాటి యొక్క వివరములు, రెండవ భాగము నందు వారందులో చేయదగిన, పాటించదగిన విశ్రాంతి దినమును, సంవత్సరమంతయు ఆచరింపవలసిన ఏడుపండుగలను గురించిన వివరములు మనము చూడగలము.

కొన్ని సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో మూడవ గ్రంథము; అధ్యాయములు 27; వచనములు 859 ; ప్రశ్నలు 3 ; నెరవేరిన ప్రవచనములు 58 ; నెరవేరని ప్రవచనములు 6; చరిత్రాత్మిక వచనములు 799; ఆజ్ఞలు 795 ; వాగ్దానములు 26 ; హెచ్చరికలు 125; దేవుని యొద్ద నుండి ప్రాముఖ్యమైన అంశములు 35.

లేవీయకాండములో ప్రాముఖ్యమైన వచనములు : లేవీయకాండము 17:11; లేవీయకాండము 20:7-8

ముఖ్యాంశములను పొదిగించిన అధ్యాయము : 16 వ అధ్యాయము.

Exodus – నిర్గమకాండము

 

ఉద్దేశ్యము : ఐగుప్తులోని ఇశ్రాయేలీయులు బానిసత్వము నుండి విడిపింపబడుట మరియు వారు ఒక దేశముగా ప్రబలుటను గురించినది.

గ్రంథకర్త : మోషే

కాలము : సుమారు ఆదికాండ గ్రంథకాలములోనే క్రీ.పూ 1480 – 1410

రచించిన స్థలము : ఇశ్రాయేలీయులు అరణ్య ప్రాంతము గుండా పయనించు సమయములో సీనాయి సమతల భూభాగమునందు.

గత చరిత్ర : ఐగుప్తు దేశమునందు అనుకూల కాలవ్యవస్థ యందు జీవించిన ఇశ్రాయేలీయులు ఇప్పుడు దాస్యమునందున్నారు. దేవుడు వీరి బానిసత్వము నుండి విడుదల దయచేయుచున్నాడు. (ఐగుప్తు దాస్యములో నుండి విడుదల)

ప్రాముఖ్య వచనములు : నిర్గమకాండము 3:7-10

ప్రాముఖ్యులు : మోషే, మిర్యాము, ఫరో, ఫరో ప్రజలు, యిత్రో, అహరోను, యెహోషువ, బెసాలీయేలు,

కాలేబు.

ప్రముఖ స్థలములు : ఐగుప్తు, గోషేను, నైలునది, మిద్యాను, ఎఱ్ఱసముద్రము, సీనాయి సమతల భూమి, సీనాయి పర్వతము.

గ్రంథ విశిష్టత : పాతనిబంధన గ్రంథములోని అన్ని గ్రంథముల కన్నా అధికమైన అద్భుతములు లిఖించబడియున్న గ్రంథము ఇది. పది ఆజ్ఞలు ఈ గ్రంథము యొక్క ప్రాముఖ్యాంశము.

సమకాలీన చరిత్ర : క్రీ.పూ 1710 నుండి 1570 వరకు నున్న మధ్య కాలము 140 సంవత్సరములు ఐగుప్తు దేశమును పాలించిన రాజులు (ప్రభువులు) హి క్కోసు వంశపు వారుగా పరిగణింపబడు భూరాజులు అన్యదేశీయులుగా ఉండిరి. తూర్పు పాశ్చాత్య దేశమైన కనాను, సిరియా దేశస్టులైన వీరు బలవంతులు, యుద్ధ ప్రియులు. ఈ హిక్కోషీయులు అన్యులైనందున అన్యులతోనే సహవాసము కలిగియుండిరి. వీరిలో ప్రాముఖ్యుడైన అపోపి అనే రాజు (ఫరో) వీరి నాగరికతకు తగిన రీతిగానే అన్యుడుగా ఎంచబడిన యోసేపును అధిపతిగా చేసి ఐగుప్తు దేశములోని ఫలవంతమైన

గోషేనును ఇశ్రాయేలీయులకు నివాసస్థలముగా యిచ్చెను. ఈ హిక్కోషు ఫరోలు ఆ దేశస్థులైన ఐగుప్తీయుల యెడల నిర్దయతో అనాగరికముగా ప్రవర్తించారు. రక్త ప్రవాహము ద్వారా వీరు అధికారములోనికి ప్రవేశించారు, వారు స్వదేశీయులైన జనాంగమును శ్రమలపాలు చేసెడివారు. ఐగుప్తు దేశములోని స్త్రీలను,

పిల్లలను హింసించి పట్టణములను పాడుచేసి, దేవాళయములను పడగొట్టి, అగ్నిచేత వారిని దహించివేసేవారు. ఇటువంటి శ్రమలను అనేక దినములు సహించిన ఐగుప్తీయులు వారి దేశములో కలహములను రేపి అధికారమును ప్రజలే చేజిక్కించుకొనిరి ఈ విధముగా ప్రజలే ఫరోలను నిర్ణయించిరి. హిక్కో షు వారిపై ఐగుప్తీయులకు ఉన్న పగకు నిరఫరాధులైన ఇశ్రాయేలీయులు బలయ్యారు. ఇశ్రాయేలు జనాంగము శక్తినొంది అభివృద్ధి నొందుచున్నందున, ఐగుప్తీయులు వీరు తమకు విరోధముగా రావచ్చునేమో అని తలంచి తప్పుగా బావించి ఈ విధముగా వారిని బాధించెడివారు. వీరు దేశమునకు కరువు వచ్చునని బావించి అక్కడ నివసించే ప్రజలు 20 లక్షల కంటే ఎక్కువ మంది అన్యులని భావించి దేశాన్ని సంరక్షించుటకై కరువు నుండి తప్పించుకొనుటకై ఆహార వస్తువులను, ధాన్యములను నిలువచేయుటకై పెద్ద పెద్ద గదులు నిర్మాణించుటకు తీర్మానించిరి. ఈ పని పూర్తి చేయుటకు కావలసిన ఇటుకలు చేయుటకు లక్షలకొలది పనివారు కావలసి వచ్చెను. ఈ పని ప్రారంభించుటకు బానిసలుగా జనసంఖ్య బలాభివృది పొందుచున్న ఇశ్రాయేలీయులపై వీరు ధ్యాసనుంచిరి. ఐగుప్తు ఫరో దృష్టి ఇశ్రాయేలీయులపై పడినందున, అప్పటి నుండి ఇశ్రాయేలీయులకు శ్రమల కాలము ప్రారంభమైనది. యోసేపు పేరు ద్వారా సుకుమార జీవనమును గడుపుచున్న ఇశ్రాయేలీయులు బానిస బ్రతుకులకు దాస్యముగా లొంగిపోయిరి. కఠినమైన పనిలో వీరిని భాదించి పీతోము, రామె సెసను ఆహార దాన్యములు నిల్వచేయు ధాన్యాగారముల పట్టణములను కట్టిరి. అప్పటి నుండి కఠినమైన పనులలో ఇటుకల పని, కట్టడపని వీరికి బహుకఠినమాయెను, అవి వారికి భరించలేని భారమైపోయెను. హిక్కోషు ఫరోల ప్రీతికరమైన ప్రజలు కఠినమైన బానిసలుగా పనిచేయుట తట్టుకోలేకపోయిరి. అన్యదేశములో ప్రవచన రీతిగా తాము చేయుచున్న పెట్టి పనులను బట్టి వారు నిట్టూర్పులు విడిచిరి, వారి నిట్టూర్పులు దేవుని చెవిని చేరినవి. ఇశ్రాయేలీయుల బానిసత్వము దేవుని అనాది సంకల్పములో ఒక భాగమని ఐగుప్తు ఫరో గ్రహించలేక పోయెను. నిర్ణయకాలము వచ్చువరకు అనేక శ్రమానుభవముల తర్వాతనే ఐగుప్తు ఫరోలు వారికి విడుదల దయచేసిరి. మోషే నాయకత్వములో క్రీ.పూ 1446 లో విడిపింపబడిన పావురములవలె వాగ్దానభూమికి యాత్రుకులైరి. దీనినే నిర్గమమందురు.

భాగములు : 1. రక్షకుడైన మోషే Exo,1,1 – 4,31. 2. ఫరోతో జరిగిన యుద్ధకాండ Exo,5,1- 13,19. 3. ఐగుప్తు నుండి సీనాయి పర్వతము వరకు Exo,13,20-19,2. 4. నిబంధన నెరవేరు కాలము Exo,19,3-24,8. 5.దేవుని ఆరాధించుటకు ప్రత్యక్షపు గుడారములు Exo,24,9-40,38.

కొన్ని సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో రెండవ గ్రంథము; అధ్యాయములు 40; వచనములు 1,213; చరిత్రాత్మిక వచనములు 1089; నెరవేరిన ప్రవచనములు 129; నెరవేరనివి 2; ప్రశ్నలు 58; దేవుని సందేశములు 73; ఆజ్ఞలు 827; హెచ్చరికలు 240; వాగ్దానములు 28; మోషే ద్వారా చేయబడిన అద్భుతములు 35 తో కలిపి అద్భుతములు 42.

Genesisi – ఆదికాండము

పురాతన ప్రతులైన ఆదికాండము మొదలుకొని ద్వితీయోపదేశకాండము వరకు ఉన్న ఐదు పుస్తకములను నిబంధన పుస్తకములందురు. (2 దినవృత్తాంతములు 34:30). క్రీ.పూ 3వ శతాబ్దములోని రచయితలు హెబ్రీ భాష నుండి గ్రీకు భాషకు పాతనిబంధన గ్రంథమును తర్జుమా చేసిన సెప్టోలెజెంట్ భాషాంతర తర్జుమాదారులు వీటిని ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము, ద్వితియోపదేశకాండము అని ఐదు వివిధమైన పేర్లతో పిలిచిరి.

ఉద్దేశ్యము : ప్రపంచముల నిర్మాణమును గురించిన ముఖ్యాంశములను వ్రాయుటను దేవుని ఆరాధించుటకు ఒక ప్రత్యేక జనాంగమును ఎర్పరచుకొనుట దీని ముఖ్య ఉద్దేశ్యము.

రచయిత : ఈ ఐదు కాండముల (పుస్తకముల) ముఖ్య రచయితగా యూదావంశపువారును, యేసును అపోస్తలుల ద్వారా అంగీకరించబడిన వ్యక్తి మోషే, ప్రవక్తయైన మోషేకు దేవునికి మధ్య నలువది రాత్రింబవళ్ళు జరిగిన సంభాషణలో తన చర్యను గూర్చి తాను చేయబోయెడి విధానమును గూర్చిన వివరణ: నిర్గమకాండము 24:18, నిర్గమకాండము 34:28 వచనములలో చదువగలము. ఆ సంభాషణ ఫలితమే ఈ ఐదు కాండము (పుస్తకము) లని అనుకొనుట యుక్తమైయున్నది. మార్కు 12:26, యోహాను 1:17; యోహాను 5:46; యోహాను 7:19, యోహాను 7:23; అపో. కార్యములు 7:37- 38; అపో. కార్యములు 13:39; అపో. కార్యములు 15:1; అపో. కార్యములు 15:21; అపో. కార్యములు 28:23.

ఆదికాండము అని పేరు : ఆది అనగా ప్రారంభము అని అర్ధమిచ్చును. భాషాంతరమున పరేషిత్ అనే హెబ్రీ బాషాపదముతో పాతనిబంధన ప్రారంభమయినది. ఈ పుస్తకమునకు ఆదికాండము అను పేరు పెట్టుటకు గల కారణము ఈ పుస్తకములోని ప్రారంభపదమే దీనికి మూలకారణం. ఆది అనే సంస్కృత మాటకు సృష్టి , ప్రారంభము, పుట్టుట అను అనేక విధములైన పర్యాయపదములు కలవు.

రచించిన కాలము : క్రీ.పూ 1480 – 1410

గత చరిత్ర : మధ్య తూర్పుదేశము అనగా ప్రస్తుతమందు పిలువ బడుచున్న మిడిల్ ఈస్ట్.

ముఖ్య వచన భాగములు : ఆదికాండము 1:27; ఆదికాండము 12:2-3

గ్రంథ పరిశోధన : ఆదికాండములో సమస్త సృష్టి యొక్క చరిత్రయైన ఆకాశము, భూమి, వాటి నిర్మాణమును గురించిన వివరణ మరియు రాత్రింబవళ్ళు, సస్యమృగములు పక్షిజలచరములు, మానవుడు, భాషలు క్రమ శిక్షణ, సంబంధ బాంధవ్యములు వంటివి ఏ విధముగా ఏర్పరచబడినవి అను వాటిని గురించి పరిపూర్ణ అవగాహననిచ్చుచున్నది. పాపము యొక్క ప్రారంభ చరిత్ర దానికి దేవుడు చేసిన ప్రాయశ్చిత్తము ఈ పుస్తకము యొక్క ముఖ్య ఉద్దేశ్యమగును. భూగోళ శాస్త్రములోని మూడు ముఖ్యమైన విభన్న దేశ సంబంధములను ఈ ఆదికాండము తెరకెక్కించుచున్నది. యూప్రటీసు, టైగ్రీసు నదీతీరములు మొదటి భాగమునకు, కనాను దేశ ప్రాంతము రెండవ భాగమునకు, ఐగుప్తు మూడవ భాగమునకు విశిదీక రింపబడియున్నవి. మొదటి అధ్యాయము మొదలుకొని 11వ అధ్యాయము వరకునున్న మొదటి

భాగములో అన్నింటి ప్రారంభమును గురించి మొదటి మానవుని నిర్మాణమును గురించి, వారి వంశావళిని గూర్చిన చరిత్ర యిమిడియున్నది. మరియు 12వ అధ్యాయము మొదలుకొని 38వ అధ్యాయము వరకుగల రెండవ భాగములో ఆనాటి మానవుల వంశావళుల చరిత్రలో అబ్రాహాము అను ప్రత్యేకమైన మనిషిని దేవుడు పిలిచి ఏర్పరచి, ఆ అబ్రాహాము కుటుంబము ద్వారా యాకోబు సంతతివారిని మాత్రము తన సొంత జనాంగముగా ఎన్నుకొనుట దేవుని సంకల్పమైయున్నది. 39వ అధ్యాయము మొదలుకొని చివరి అధ్యాయము వరకునున్న మూడవభాగములో యాకోబు సంతతివారు యోసేపు ద్వారా ఐగుప్తుకు వలస వెళ్ళడం అక్కడ వారు బహుజనాంగముగా ఏర్పడి విస్తరించడము ఇందులో వ్రాయబడియున్నది. ఈ మూడు భాగములు కలిపి సంగ్రహించి కాలపరిమితి గలవై ఈ విధముగా సంగ్రహీకరింపబడియున్నది.

మొదటి భాగము : (1 – 11 వరకైన అధ్యాయములు) సృష్టి క్రీ. పూ 4000 లేదా దానికన్నా ముందుగా ఆది 1:1 ప్రారంభము నుండి తెరహు మరణము వరకు గల సంవత్సరములు 2090 ఆది 11:32 వరకు దాదాపు రెండువేల సంవత్సరాలకాల చరిత్ర

రెండవ భాగము : (12 – 38 వరకు గల అధ్యాయములు) అబ్రాహాము తన యింటి నుండి బయలుదేరు కాలము మొదలు కొని యోసేపు ఐగుప్తు దేశము వచ్చి చేరువరకు గల చరిత్ర కాలఘట్టము క్రీ.పూ 2090 నుండి 1897 వరకు దాదాపు 193 సంవత్సరములు.

మూడవ భాగము : (39- 50 వరకు గల అధ్యాయములు) యో సేపు ఐగుప్తు దేశములో ఉన్నప్పటి జీవితకాల చరిత్ర క్రీ.పూ 1897 నుండి 1805 వరకు దాదాపు 93 సంవత్సరములు.

ప్రాముఖ్యులు : ఆదాము, హవ్వ, హేబేలు, హనోకు, నోవహు , అబ్రాహము, శారా, ఇస్సాకు, బ్యా, యాకోబు, యోసేపు.

గ్రంథ విభజన : 1. ప్రపంచము, భూమి, మానవుడు, వాటి నిర్మాణము. Gen,1,1-2,25, 2.మానవుని పతనము దాని ప్రతిఫలము. Gen,3,1- 5,32. 3.న్యాయతీర్పు నుండి నోవహు కుటుంబము రక్షింపబడుట, Gen,6,1-9,29. 4.మానవుల వంశావళులు వృద్దీ చెందుట మరియు విభజింపబడుట Gen,10,1-11,32. 5.అబ్రాహాము జీవితము. Gen,12,1-25,18. 6.ఇస్సాకు యొక్క కుటుంబము. Gen,25,1-27,45. 7.యాకోబు గోత్రకర్తలు. Gen,28,1-38,30. 8.యోసేపు జీవిత చరిత్ర. Gen,39,1-50,26

కొన్ని సంఖ్యా వివరములు: పరిశుద్ధ గ్రంథములో మొదటి గ్రంధము ; ఆధ్యాయములు 50 ; వచనములు – 1,533 – చరిత్రాత్మిక వచనములు 1,385; ప్రశ్నలు 148 ; ప్రవచనములు 146; నెరవేరిన ప్రవచనములు 123; నెరవేరని ప్రవచనములు 23 ; ఆజ్ఞలు -106 ; వాగ్దానములు 71 : దేవుని యొద్ద నుండి పాముఖ్యమైన అంశములు 95 ; హెచ్చరికలు 326.

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account