Daniel – దానియేలు
దానియేలు యొక్క జీవితము, సేవయు బబులోను చెరనివాసకాలమైన డెబ్బై సంవత్సరములు విస్తరించియున్నది. 16వ ఏటే చెరపట్టబడిన దానియేలు రాజకార్యము నిమిత్తము ఎన్నుకొనబడ్డాడు. దాని తరువాత దేవుని తాత్కాలిక నిత్య ఉద్దేశమును ఇశ్రాయేలీయులకు అన్యజనులకు బయలుపరచు దేవుని ప్రవక్తగా ఉన్నాడు. దానియేలు గ్రంథములోని 12 అధ్యాయములలో 9 అధ్యాయములు దేవుని దర్శనములు, కలలు, ఉదాహరణముతో నిండిన ప్రవచనములతో నిండి కనిపిస్తున్నవి. ప్రత్యేక జనులు మరియు దేశముల యొక్క జీవిత సంభవములలో దేవుని నడిపింపు, ప్రణాళిక ఏ విధముగా క్రియచేయుచున్నదని దానియేలు గ్రంథము మనకు తెలియజేయుచున్నది. దానియేలు అను పదమునకు దేవుడు నాకు న్యాయాధిపతి అని అర్థము.
గత చరిత్ర : దానియేలును అతని ముగ్గురు స్నేహితులు సమస్త జ్ఞానములోను శ్రేష్ఠులును రాజ కార్యమునకు యోగ్యులైనవారు (దానియేలు 1:4) వారికి బబులోను తర్పీదు శాలలో 3 సంవత్సరములు తర్పీదు లభించింది. (దానియేలు 1:5) వారి స్వదేశ పేరులను మార్చుటకు బెత్తెషాజరు అను క్రొత్త పేరు దానియేలుకు ఇవ్వబడినది. దానియేలు యొక్క జ్ఞానము మరియు కలల భావము చెప్పు సామర్థ్యము వలన ఆయనకు నెబుకద్నెజరు, దర్యావేషుల రాజ్యాంగములలో ప్రవేశము కలిగినది. ఎటువంటి అపవిత్రతకును లోనుకాని దానియేలును నీతితో నిండిన జీవితమునకు మాదిరిగా యెహెజ్కేలు చూపించుచున్నాడు. (యెహె 14 – 20, 28: 13) విశ్వాసము, ప్రార్థన జీవితము, ధైర్యము, నీతి భక్తి, క్రమము అనునవి నిండిన జీవితముగా ఆయన జీవితము ఉన్నది. నీవు బహుప్రియుడవు అని ప్రభువు ఆయనను పిలుచుచున్నాడు. బబులోను సామ్రాజ్యము పతనమయి మాదీయ పారశీక సామ్రాజ్యము వచ్చినప్పటికిని దానియేలు తన శేష్టమైన పదవిలో కొనసాగాడు. నెబుకద్నెజరు, బెల్లసరు, దర్యావేషు, కోరెసు, అను నలుగురు రాజుల కాలములోను ప్రధానమంత్రి అను శ్రేష్టమైన పదవిని వహించాడు.
గ్రంథకర్త : దానియేలు
దానియేలు కాలము : అష్హూరు సామ్రాజ్యమునకు విరోధముగా బబులోను కలవరము చేసి క్రీ.పూ. 612లో అష్హూరు రాజధాని అయిన నినెవేను పట్టుకున్నది. క్రీ.పూ. 605 ఐగుప్తు సైన్యమును జయించుట ద్వారా మధ్య తూర్పు దేశములపాలన ఆధిక్యము బబులోనుకు లభించింది. అదే సంవత్సరములో నెబుకద్నెజరు యెరూషలేమును జయించినపుడు చెరపట్టబడినవారిలో ఒకడుగా దానియేలు ఉన్నాడు. బబులోను చెరనివాసకాలమంతయు ఒక పాలకుడుగాను, ప్రవక్త గాను దానియేలు జీవించాడు. మాదీయులు పారశీకులు బబులోనును హస్తగతం చేసుకున్నాను. దానియేలు యొక్క పదవిలో మార్పు కలుగలేదు. పారశీక రాజైన కోరెషు యొద్ద పలుకుబడి పొందుటకు నూరు సంవత్సరములకు ముందే యెషయా కోరెషును గూర్చి ప్రవచించిన ప్రవచనమును ఆయన గ్రహింపునకు తెచ్చుటకు దానియేలు ప్రయత్నించియుండవచ్చును. దాని యొక్క ఫలితముగానే కోరెషు తన పాలన మొదటి సంవత్సరములోనే యెరూషలేము దేవాలయము మరల కట్టబడుటకు ఆజ్ఞను జారీ చేసియుండవచ్చును. దానియేలు
ప్రవచించిన విధముగా పారశీకరాజ్యము అలెగ్జాండరు దండెత్తువరకు నిలిచియుండినది. (దానియేలు 11:2-3), దాని తరువాత గ్రీకు సామ్రాజ్యము దాని పతనము తరువాత రోమా సామ్రాజ్యమును ఉద్భవించినవి.
ముఖ్య స్థలములు : నెబుకద్నెజరు యొక్క అంతఃపురము; అగ్నిగుండము, బెల్లసరు యొక్క విందుశాల, సింహముల గుహ.
గ్రంథ విశిష్టత : దానియేలు యొక్క దైవ దర్శనములు, మెస్సియాను గూర్చి సూటియైన ప్రవచనముల వంటివి నిండిన అనేక కాల మట్టములలో దేవుని ప్రణాళికలను గూర్చిన ఒక క్లుప్త వివరణ ఈ గ్రంథములో ఇవ్వబడియున్నది. ( 8 – 12 అధ్యాయములు)
ముఖ్య పదజాలము : మహోన్నతుడైన దేవుడు, మానవుల రాజ్యాంగములను, పదవులను నియంత్రించే ఉన్నతమైన దేవుని ఈ ప్రవచనము మనకు చూపించుచున్నది. దేవుని యొక్క మార్పులేని పాలన ఎల్లప్పుడును ఉండునను దానిని దానియేలు తెలియజేయుచున్నాడు.
ముఖ్య మైన వచనములు : దానియేలు 2:20-22; దానియేలు 2:44
ముఖ్యమైన ఆధ్యాయము : దానియేలు 9; డెబ్బై (70) వారములను గూర్చిన ప్రవచనము Dan,9,24,27 లో కనిపించుచున్నది. వీటిలో మొదటి 69 వారములు క్రీస్తు యొక్క రాకడతో నెరవేరినవననునది స్పష్టము. 69 – 70 వారముల మధ్యలో ఒక విరామము ఉన్నట్లుగా బైబులు పండితులు అభిప్రాయపడుచున్నారు. మనము ఈ వివిరామకాలములో జీవించుచున్నాము. 70వ వారము క్రీస్తు యొక్క రెండవ రాకడకు సంబంధించిన 7 సంవత్సరములను చూపించుచున్నది. ఎప్పుడు ఆ 70వ వారము వస్తుంది? దేవునికి మాత్రమే తెలుసు.
గ్రంథ విభజన : పాతనిబంధన ప్రకటన గ్రంథము అని పిలువతగిన దానియేలు ప్రవచన గ్రంథము దీర్ఘకాల ప్రపంచ చరిత్రను తెలిపే గ్రంథమగును మొదటి అధ్యాయము యొక్క ఉపోద్ఘాతము అర్ధమయిన తరువాత 2 నుంచి 7 వరకున్న అధ్యాయములలో లోకము యొక్క భవిష్యత్తు చెప్పబడియుంటున్నది. 8 నుండి 12 వరకైన అధ్యాయములలో అన్యజనుల పాలన క్రింద యూదా ప్రజల భ విష్యత్తు చెప్పబడియున్నది. ప్రపంచ చరిత్రపై దేవుని పరిపాలన (అధికారము) అను అభిప్రాయము ఈ ప్రవచనముల మూలముగా గ్రాహ్యమగుచున్నది. అది బబులోనీయుల వలన నాశనము చేయబడిన యూదా ప్రజలకును, క్రైస్తవ సంఘములకును ఓదార్పును, ఆధరణను ఇచ్చుచున్నది. బబులోను, పారశీకము, గ్రీకు, రోమా మహాసామ్రాజ్యములు ఉదయించి అస్తమించును. అయినను దేవుని విమోచన జనము ద్వారా ఆయన తన నిత్యరాజ్యమును స్థాపిస్తాడు. దానికి ఎప్పుడును అంతము లేదు. గ్రంథవిభజన క్రింద చూడండి.
దానియేలు యొక్క వ్యక్తిగత జీవితము అధ్యాయము 1.
అన్యజనుల దేశముల భవిష్యత్ కాల స్థితి అధ్యాయము 2 – 7.
(a) నెబుకద్నెజరు కలలు అధ్యా 2 – 4.
(b) బెల్లసరు దర్శనము అధ్యా 5.
(C) దర్యావేషు ఆజ్ఞ అధ్యా 6.
(d) నాలుగు (జంతువుల) దర్శనము అధ్యా 7 (మృగముల)
ఇశ్రాయేలీయుల భవిష్యత్ కాల స్థితి. అధ్యా 8 – 12.
( a) పొట్టేలు మరియు మేకపోతుల దర్శనము. అధ్యా 8.
(b) 70 వారముల గూర్చిన దర్శనము అధ్యా 9.
(C) ఇశ్రాయేలీయుల భవిష్యత్తును గూర్చిన దర్శనము. అద్యా 10 – 12.
కొన్ని క్లుప్త వివరములు : పరిశుద్ధ గ్రంథములో 27వ గ్రంథము, అధ్యాయములు 12, వచనములు 357; ప్రశ్నలు 16; చరిత్రకు సంబంధించిన వచనములు 218; నెరవేరిన ప్రవచనములు 79; నెరవేరని ప్రవచనములు 60; ఆజ్ఞలు 7; వాగ్దానములు 4; దేవుని యొద్ద నుండి ప్రత్యేక వర్తమానములు 16.