Jonah – యోనా
యోనా అను హెబ్రీపదమునకు పావురము అని అర్ధము. లాటిన్, గ్రీక్ భాషలలో క్రమముగా జోన్స్ జోనా అను పదములు వినియోగింపబడినవి. తెలుగు అనువాదకులు వాటిని అంగీకరింపక యోనా అను హెబ్రీ పదమునే నేరుగా తెలుగు పరిశుద్ధ గ్రంథములో ఉపయోగించి యున్నారు.
ఉద్దేశము : దేవుని దయ మిక్కిలి శ్రేష్ఠమైనదని చూపుట. ఇందలి రక్షణ సందేశము అందరికి వర్తించును. అన్ని కాలముల వారికి వర్తించును.
గ్రంథకర్త : అమిత్తయి కుమారుడైన యోనా.
కాలము : క్రీపూ 793 – 753
ఎవరికి వ్రాయబడెను? ఇశ్రాయేలీయులకు లోకమంతటనున్న దేవుని ప్రజలకు.
గత చరిత్ర : నీనెవె పట్టణము అష్హూరు మహా సామ్రాజ్యమునకు రాజధాని. అష్హూరు ఇశ్రాయేలీయులకు గొప్ప శత్రువు. క్రీ.పూ. 722లో అష్హూరు ఇశ్రాయేలు దేశము మీద దండెత్తి జయము గాంచినది. యోనా ఆమోసు కంటే ముందు ప్రవచించినవాడు. ఇశ్రాయేలు రాజులలో మిక్కిలి బలవంతుడైన రెండవ యరొబాము పాలనా కాలములో యోనా ప్రవచించెను. (క్రీ.పూ 793 – 753; 2 రాజులు 14:23-25)
ముఖ్య వచనము : యోనా 4:11
ముఖ్య వ్యక్తులు : యోనా, ఓడ నావికుడు, ఓడలోని పనివారు, ప్రయాణికులు.
ముఖ్య స్థలములు : యెప్పే, నీనెవె
గ్రంథ విశిష్టత : నీనెవె ప్రజలకు యోనా చెప్పవలసిన ప్రవచనము ఇక నలువది దినములకు నీనెవె పట్టణము నాశనమగును అనునదే (యోనా 3:4) ఈ పుస్తకములో మరియొక ప్రవచనము ఏదియు లేదు. యోనా జీవితమే ఇందలి ముఖ్య విషయము. యోనా జీవిత సంఘటనను తన మరణ పునరుత్థానములు సాదృశ్యమైన దానినిగా యేసు చూపుచున్నాడు. (మత్తయి 12:38-42)
సారాంశము : నీనెవె ప్రజలు మారు మనస్సు పొందుట
ముఖ్య వచనములు: యోనా 2:8-9; యోనా 4:27
ముఖ్య ఆధ్యాయము : 3 , ప్రపంచ చరిత్రలో ఇంత గొప్ప ఉజ్జీవము మరి ఎన్నడును, ఎక్కడను జరుగలేదు. నీనెవె ప్రజలందరు మారు మనస్సు పొందుట ఇందు వర్ణింపబడెను.
గ్రంథ విభజన : నాలుగు అధ్యాయములు గల ఈ గ్రంథమును రెండేసి అధ్యాయములు గల రెండు ముఖ్య విభాగములుగా విభజింపవచ్చును. ఒక్కొక్క విభాగమును మరల స్పష్టమైన భాగములుగా విభజింపవచ్చును.
(1). యోనాకు దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ 1, 2 అధ్యాయములు.
దేవుని ఆజ్ఞను యోనా పాటించలేదు యోనా 1:1-3
దేవుని దండన యోనా మీదికి వచ్చెను యోనా 1:4-17
మహా మత్స్యము కడుపులో నుండి యోనా ప్రార్ధించగా విడుదల అనుగ్రహింపబడుట యోనా 2:1-10 (2). యోనాకు దేవుడిచ్చిన రెండవ ఆజ్ఞ 3, 4 అధ్యాయములు.
దేవుని ఆజ్ఞ, యోనా విధేయుడగుట యోనా 3:1-4
నీనెవె మారు మనస్సు పొందుట. శిక్ష తప్పింపబడుట యోనా 3:5-10
యోనా ప్రార్థన యోనా 4:1-3
యోనాను దేవుడు సరిదిద్దుట యోనా 4:4-10
దేవుడు యోనాకు నేర్పిన మిక్కిలి గొప్ప పాఠము యోనా 4:11
సంఖ్యా వివరములు : యోనా గ్రంథము పరిశుద్ధ గ్రంథములో 32వ పుస్తకము.
దీనిలోని – అధ్యాయము 4; వచనములు 48; ఆజ్ఞలు 8; ప్రశ్నలు 12; వాగ్దానములు లేవు; మొత్తము ప్రవచనములు 1; నెరవేరిన ప్రవచనములు: ప్రజలు మారు మనస్సు పొందగా అప్పటికి శిక్ష తప్పించబడినది. తరువాత చాలా కాలమునకు ఈ ప్రవచనము నెరవేరినది. దేవుని నుండి వచ్చిన పత్యేక వర్తమానములు : 6. (యోనా 1:2; యోనా 2:10; యోనా 3:2; యోనా 4:4; యోనా 4:9; యోనా 4:10)