అలెన్ గార్డెనర్ జీవిత చరిత్ర
పూర్తిపేరు:- అలెన్ ఫ్రాన్సిస్ గార్డెనర్
తల్లిదండ్రులు:- శామ్యూల్ గార్డెనర్ దంపతులు
జన్మస్థలము:- ఇంగ్లాండ్ దేశములోని బాసిల్ డన్ పట్టణములో
జననము:- 1794 జూన్ 28
భార్యపేరు:- జూలియా సుసన్న
రక్షణానుభవము:- 21 సంవత్సరాల వయసులో
మరణము:- 1851 సెప్టెంబర్ 6
సేవాఫలితము:- దక్షిణ అమెరికాలోని మిషనరీగా అడుగుపెట్టి అక్కడ ప్రజలకు క్రీస్తు సువార్త ప్రకటించి ‘పటగోనియన్ మిషనరీ సొసైటీ’ అనే సంస్థను స్థాపించి సువార్త అందని అనేక ప్రాంతాలకు సువార్త ప్రకటించి యువ మిషనరీలను తయారుచేసి దక్షిణ అమెరికాలో ఒక ఉజ్జీవము తీసుకొచ్చారు.
వ్యక్తిగతసాక్ష్యం:- అలెన్ ఇంగ్లాండ్ దేశంలో 1794 వ సంవత్సరంలో జన్మించాడు. బాల్యము నుండి సాహసంతో కూడిన ప్రయాణములు అంటే ఎంతో ఇష్టం. అదే ఆశతో నౌకాయాన కళాశాల అనే నేవల్ కాలేజీలో చేరి 16వ సంవత్సరము నాటికే పట్టభద్రుడయ్యాడు. కాలాన్ని వృధా చేయకుండా నేవీలో చేరాడు. 20 సంవత్సరాలకే లెఫ్టినెంట్ గానూ, ఆ తర్వాత ఓడ కెప్టెన్ గానూ నియమించారు. ఇతని తల్లి క్రైస్తవ విశ్వాసము కలిగిన స్త్రీ కాబట్టి తన స్వీయ చరిత్రను చదివి ఆశక్తి కలిగి క్రీస్తును గురించి ఇంకా తెలుసుకోవాలి అని బైబిల్ చదవటం ప్రారంభించాడు. యేసు అతనిని ప్రేమిస్తున్నాడు అని ఎరిగి నేవల్ ఆఫీసర్ గా ఉన్న దినాలలోనే క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. తన ఓడను ఎక్కడ నిలిపిన అక్కడ ప్రజల కట్టుబాట్లు గమనించేవాడు. ఒకసారి పసిఫిక్ లోని ‘తాహితీ’ అనే ఒక దీవిని దర్శించినప్పుడు కొంతమంది పిల్లలు క్రీస్తును గురించి నేర్చుకోవడం గమనించాడు. ఆ విధంగా తాను ఇతర ప్రాంతాలలో జీవించేవారికి క్రీస్తును గురించి తెలియజేసే మిషనరీగా దేవుడు అతనిని వాడుకోబోతున్న విషయము అతన్ని సంతోషపరిచింది.
ఆవిధంగా నేవీ ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. అయితే దేవుని పిలుపును బట్టి ఆఫ్రికా మిషనరీగా బయలుదేరాడు. ఆ దేశంలో ఉన్న ‘జులు’ అనే తెగను గురించి అలెన్ విన్నాడు. దేశమంతటా వారంటే ఎంతో భయము. ఎందుకంటే వారు బహు క్రూరులు. అయితే దేవుని సహాయంతో ఆ ప్రజలకు క్రీస్తును గురించి తెలియజేయడానికి ప్రయాసతో కూడిన ప్రయాణం చేసి వెళ్లాడు. వెళ్ళిన కొద్ది రోజులకే అక్కడ యుద్ధము జరిగింది దానివల్ల ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాడు. దేవుడు మిషనరీగానే పిలుచుకున్నాడన్న నమ్మకం కలిగిన అలెన్ కు ఏం చేయాలో తోచక ఆలోచనలో మునిగాడు. దక్షిణ అమెరికాకు వెళ్ళమని దేవుని పిలుపు అందుకుని 1883లో కుటుంబంతో కలిసి అమెరికాకు ప్రయాణమయ్యాడు. అక్కడ సేవలో అనేక అవాంతరాలు ఎదురైనప్పటికీ చాలా దినాలు ప్రార్థన చేయటం వల్ల అక్కడ కొంతమంది స్నేహితులయ్యారు. అక్కడ ప్రజలతో బాగుగా కలిసిపోయిన ఆలెన్ కు మిషనరీ సొసైటీని స్థాపించాలనే ఆశ కలిగింది. సహాయము కోసము ఇంగ్లాండ్ కు వెళ్ళాడు కానీ నిరుత్సాహం ఎదురయ్యింది.
ఏమైతేనేమి మూడు సంవత్సరాల వ్యవధిలో ‘పటగోనియన్ మిషనరీ సొసైటీని’ స్థాపించాడు. అయితే మిషన్ స్థావరం ఏర్పరచడానికి దక్షిణ అమెరికాలోని బొలీవియాలో 11 గ్రామాల్లో అనుమతి కోరగా తిరస్కారము ఎదురయ్యింది. చివరికి అనుమతి దొరికేసరికి యుద్ధం ఆరంభమైంది. చివరి ప్రయత్నం చేసే క్రమంలో అతని సామాగ్రి దొంగలు ఎత్తుకుపోయారు. జీవితంలో నిరాశ, నిస్పృహ, వృధాప్రయాస ఎదురయింది. అయితే అతనికి ‘అంతా విడిచి ఇంటికి తిరిగి వెళ్ళిపోనా’ అని అనిపించినా ‘నేను మాత్రము విడిచిపెట్టను’ దక్షిణ అమెరికాలో వేర్వేరు జాతులకు సువార్తను అందించేందుకు అన్ని విధాలా కృషి చేస్తాను అని నిర్ణయించుకున్నాడు. అయితే ఎక్కువ ఓడ ప్రయాణాల వల్ల నీళ్ల దెబ్బకు తట్టుకోలేక భయంకరమైన వ్యాధి సోకింది. స్నేహితులు మరణిస్తున్నారు. చివరికి ఆలెన్ మాత్రమే మిగిలి ఉన్నాడు. అలాంటి సమయములో మిషన్ వారు చేయవలసిన ప్రణాళికల గురించి తన డైరీలో రాసుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఆకలి బాధతో 1851 సెప్టెంబర్ 6వ తేదీన ప్రభు సన్నిధికి చేరాడు.
ఆలెను తన జీవితములో సంఘాన్ని స్థాపించలేదు..?
మిషన్ సంస్థ విజయవంతము కాలేదు..?
ఎంతోమంది మిషనరీల వలే బైబిల్ తర్జుమాలు చేయలేదు..? జీవితంలో అన్ని విధాలా ఓటమే..?
కాని ఓటమి కాదు ఎందుకంటే గార్డెనర్ యొక్క జీవితము గోధుమగింజలాంటిది. దుఃఖకరమైన స్థితిలో మరణించిన అలెన్ సమాచారము స్వదేశానికి చేరింది. వెంటనే సంఘము మేల్కొని అనేక పనులను చేపట్టింది. ఫలితంగా పటగోనియన్ మిషనరీ సొసైటీ స్థిరపడింది. స్నేహితులు ఎక్కడ మరణించారో అక్కడే మిషన్ ప్రారంభమైంది. ఆ సొసైటీ నుంచి పంపబడిన మిషనరీలలో అలెన్ గార్డెనర్ కుమారుడు ఒకరు. సువార్త చేరని అనేక స్థలాల్లో అనేకమంది యువజనులు మిషనరీలుగా ఉండటానికి ముందుకు వచ్చారు. గొప్ప ఉజ్జీవము దక్షిణఅమెరికాలో సంభవించింది. దీనికంతటికీ మూలకారణం సేవ చేయాలన్న అతని ఆశ మాత్రమే…