అమీకార్ మైఖెల్ జీవిత చరిత్ర
పూర్తి పేరు:- అమీకార్ మైఖెల్
జన్మస్థలం:- నార్తర్న్ ఐర్లాండ్లోని కౌంటీ డౌన్
జననము:- 1867 డిసెంబర్ 16
మరణం:- 1951 జనవరి 18
రక్షణానుభవం:- 19 సంవత్సరాల వయసులో
సేవాఫలితం:- జపాన్, చైనా, శ్రీలంక, ఇంగ్లాండ్ లలో సేవ చేసి, చివరికి ఇండియాలో కాలుమోపి దేవదాసీల రక్షణార్థం ప్రయాసపడెను. 35 పుస్తకములు రచించెను ఈమె స్థాపించిన ”డోనా ఊరు ఫెలోషిప్” పరిచర్యలు నేటికిని కొనసాగుచున్నవి.
వ్యక్తిగత సాక్ష్యము:- అమీకార్ మైఖెల్ 1867 డిసెంబర్ 16న నార్తర్న్ ఐర్లాండ్ లోని కౌంటీ డౌన్ లో జన్మించెను. ఈమె తల్లిదండ్రులు అనేక పిండి మిల్లులు కలిగియుండెను. చిన్న వయసులో సంతోషకరమైన, సమృద్ధిగల కుటుంబంలో పెరిగెను. 1883లో వెస్లీయన్ మెథడిస్ట్ స్కూల్లో విద్యార్థిగా ఉన్నప్పుడే యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించెను. ఈమె అనేక కూటములకు వెళ్లి రకరకాల ప్రసంగాలు వినడంలో సంతోషించక ఇతరులకు క్రీస్తునందించు విషయములలో భారము కలిగి వారి పిండి మిల్లులో పనిచేసే అమ్మాయిలకు దగ్గరలో ఉన్న చర్చిలో కూటం ప్రారంభించింది. ప్రభువు చిత్తము కొరకు ప్రార్ధించుచుండగా ప్రభువు ఆమెను ప్రత్యేకమైన సేవకు నడిపించి, ఒక కట్టడమును కూడా కట్టుటకు సహాయం చేసెను. ఆ కట్టడంలో జరిగిన కూటములలో అనేకమంది రక్షించబడిరి. అంతేకాదు బాధలో ఉన్నవారు, దిక్కులేనివారు, నలిగినవారు అనేకులు వచ్చి క్రీస్తు ప్రేమను రుచి చూసి ఆదరణ పొంది రక్షించబడుచుండిరి. ఒక దినము ఆమె ప్రార్ధించుచుండగా నీ జీవితమును మిషనరీ సేవకు సమర్పించి నా చిత్త ప్రకారము నడువుము అను దేవుని స్వరము వినెను. 1892 జనవరి 13వ తేదీన ప్రభువు మరల మాట్లాడెను. ఆమె ప్రార్థించగా దేవుడు మార్గము తెరిచి 1893 మార్చి 03 వ తేదీన కెస్విక్ కన్వెన్షన్ తరఫున మొదటిసారిగా జపాన్ దేశమునకు మిషనరీగా పంపబడెను.
జపాన్ దేశమందు సేవలో అనేక అనుభవమును పొందెను కానీ ఆమె వ్యాధికి గురై విశ్రాంతి కొరకు స్వదేశమునకు తిరిగివచ్చి ఆ తరువాత చైనాకు, శ్రీలంకకు చివరికి 1894 లో తిరిగి ఇంగ్లాండ్ కు వెళ్ళెను. అయితే 1895 నవంబర్ 9 వ తారీకు ఆ దేవుడు ఆమెను ఇండియాకు నడిపించాడు. 1901 మార్చి 06వ తేదీన ఫ్రీనా అనే ఏడు సంవత్సరాల అమ్మాయి ఆమె వద్దకు పరిగెత్తుకొని వచ్చి ఏడ్చెను. ఆమె తల్లిదండ్రులు దేవదాసీలుగా ఉండుటకు ఒక గుడికి అమ్మివెసిన విషయం ఆమెకు చెప్పినప్పుడు మైకేల్ హృదయం ద్రవించిపోయింది. చాలామంది ఆడవారిని దేవదాసీలుగా (వేశ్యలుగా) ఆ గుడిలో వుంచుచున్నారో ఎరిగినప్పుడు ఆమె మోకాళ్లపై పడి కన్నీటితో వారి కొరకు ప్రార్థించేది. వారిని విడిపించుట కొరకు ఆమె ఎన్నో శ్రమలు ఎదుర్కొంది. అయితే కొంతకాలానికి 17 మంది పిల్లలు క్రీస్తు ప్రేమను చూపించే ఈ అమ్మను చేరుకొని రక్షింపబడ్డారు ఆమె ఒక ఆశ్రమాన్ని స్థాపించి ఎవరిని ఆర్థికంగా సహాయము అడిగేది కాదు. ఒక బిడ్డను మేము పోషిస్తామని ఎవరైనా ముందుకు వచ్చినా ఆమె ఒప్పుకొనక అన్ని కానుకలు ప్రభువు చేతిలో పెట్టి ఆయన నడిపింపు ప్రకారము చేసెను. ఆమెతో పని చేసేవారిని చాలా జాగ్రత్తగా ఎన్నుకునేది. వారికి జీతముల పద్ధతి లేదు కాబట్టి త్యాగంతో పరిచర్య చేసే వారు మాత్రమే ఆమెతో ఉండేవారు. 60 సంవత్సరాల సేవా జీవితంలో ఆమె ఎప్పుడూ తన దేశానికి వెళ్ళి ఎవరిని ఆర్ధిక సహాయం అడగలేదు. అయినప్పటికీ సేవలో లోటు లేదు, అప్పులపాలు అవ్వలేదు. భారతీయ వస్త్రధారణతో అనేక ప్రాంతీయ భాషలు నేర్చుకొని తమిళనాడు లోని తంజావూరులో సేవ చేసేది.
వ్యక్తిగత ప్రార్థనా విషయంలో, భక్తి విషయంలో జాగ్రత్తగా ఉండమని ఆమె తన సహాయకులను హెచ్చరించేది. ఆమె ద్వారా విడిపించబడి రక్షించబడినవారు అనేకులు దేవుని సేవలో నమ్మకస్తులుగా ఆమెతో కొనసాగిరి. ఆమె ఎక్కువగా మిషనరీల పుస్తకాలను చదువుతుండేది. ఇంచుమించు 35 పుస్తకాలను వ్రాసింది. మనుషులను సంతోషపెట్టి వారి ఆదరాభిమానాలను, ధనమును సంపాదించుకోవాలని ఈమె ఎప్పుడూ ఆశించక దినదినము, క్షణక్షణం ప్రభువుపై ఆధారపడి ప్రార్థించినందువల్ల ఆమె స్థాపించిన ”డోనా ఊర్ ఫెలోషిప్” పరిచర్యలు ఇంకనూ దక్షిణ భారతదేశంలో కొనసాగించబడుచున్నవి. ఈమె మంచి ప్రార్థనాపరురాలు. ప్రభువా నీ ఇష్టం వచ్చినట్టు నన్ను చేసుకో, నీ పరిచర్య చేయుటకు తగిన వ్యక్తిగా నన్ను మార్చుకో..! అని ఒక దినము ప్రార్ధించింది. అదే రోజు మధ్యాహ్నం ఆమె కాలు బెనకడం వలన కాలు విరిగింది. అప్పటికీ ఆమె 36 సంవత్సరాలు పరిగెత్తుతూ చేసిన పరిచర్య ఆగినది. అయితే 20 సంవత్సరాలు మంచం మీద నుండి అనేక ఉత్తరాల ద్వారా, పుస్తకములు వ్రాయుట ద్వారా గొప్ప పరిచర్య చేసింది. 1948 లో బహు వ్యాధిగ్రస్తురాలై తన 84 వ యేట అనగా 1951 జనవరి 18 న ప్రభువు సన్నిధికి చేరిపోయింది..