అగస్టీన్ సాలిన్స్ జీవిత చరిత్ర
(భారతదేశపు విలపించు ప్రవక్త)
పూర్తిపేరు:- ఆగస్టీన్ సాలిన్స్
జన్మస్థలము:- కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి పట్టణము జననము:- 1914లో
రక్షణానుభవము:- 20 సంవత్సరాల వయసులో భార్యపేరు:- కుంజలియా అంథొని
మరణము:- 1985 ఆగస్టు 19
సేవాఫలితము:- భారత దేశంలోనే కాక ఇతర దేశాలలో కూడా సువార్త ప్రకటించి అనేకులను రక్షణలోనికి నడిపించాడు. అంతేకాకుండా భారతదేశపు విలపించు ప్రవక్తగా పేరు సంపాదించి ‘అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్’ అనే సంస్థకు డైరెక్టర్ గా తన సేవలందించాడు.
సేవలో ఎదుర్కొన్న కష్టాలు:-
అగస్టీన్ పుట్టుకతోనే దేవుడు అతనిని తన సేవకు ప్రత్యేకపరుచుకున్నాడు అని తల్లి విశ్వసించింది. ఇతనిపై తల్లి ప్రభావము చాలా ఉంది. ఇతను ఆనారోగ్యంగా ఉండటం వల్ల పనులకు దూరంగా ఉంచబడ్డాడు. ఇంటి వద్ద భక్తి జీవితానికి అలవాటు పడిన ఈయన తన స్నేహితులకు క్రీస్తును గురించి చెప్పేవాడు. అతనికి ఏడు సంవత్సరాల వయసులో అతని తల్లి అతనిని ప్రభువు పనికి ప్రతిష్టించింది. ఒక ఆ మిషనరీ భారతదేశానికి వచ్చి కర్ణాటకలోని ఉడిపిని కేంద్రంగా చేసుకుని సువార్త చేయడం మొదలుపెట్టాడు. అయితే అతనితో ఆగస్టీన్ కు పరిచయం ఏర్పడింది. తను చెప్పే వాక్యాలద్వారా తాను పాపినని గ్రహించి క్రీస్తును రక్షకునిగా అంగీకరించాడు. అంతేకాకుండా తన జీవితాన్ని సేవకు సమర్పించుకున్నాడు. 1945లో కూర్గ్ జిల్లాలోని ‘మెర్ కారా’ అనే ప్రాంతానికి సేవకు వెళ్ళాడు. అతని యొక్క ప్రసంగాల ద్వారా దేవుని ఆత్మ బలంగా పనిచేసి అనేకులు క్రీస్తును అంగీకరించేవారు. అతను ఎక్కడ ప్రసంగం చేసిన ఉజ్జీవము రగులుకొనేది. పైగా ఎక్కడ, ఏ స్థలంలో ప్రసంగించిన కన్నీటితోనే ప్రసంగించేవాడు. అందుకు ఆయనకు ‘భారతదేశపు విలపించుప్రవక్త’ అని పేరు వచ్చింది.
ఒకసారి అతడు కొల్హాపూర్ లో ప్రసంగిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి అందరినీ ఆవరించింది. ఆ సమావేశము చివరిలో ఒకరు ఇలా అన్నారు. ‘వాతావరణం అంతా చాలా స్వచ్ఛంగా, అప్పుడే కురిసిన వర్షంలా, ఉత్తేజపూరితంగా ఉంది’ అని అన్నారు. 1971లో ఆగస్టీన్ కు ”అంబాసిడర్ ఫర్ క్రైస్ట్” అనే సంస్థకు భారతదేశంలో డైరెక్టర్ గా ఉండమని ఆహ్వానించారు. కానీ అలాంటి పెద్ద బాధ్యతను నిర్వహించడానికి తన అనారోగ్యమే గొప్ప ఆటంకం అయ్యింది. అయితే దేవుని శక్తిపై ఆధారపడి ఆహ్వానాన్ని స్వీకరించాడు. ఆ సంస్థ యొక్క ఆర్ధికస్థితి, పరిచర్య ఎంతో పుంజుకున్నాయి. అయితే విశ్రాంతి లేకపోవడం, తరచుగా ప్రయాణాలు చేయడం వలన ఆరోగ్యం క్షీణించిపోయి తీవ్రమైన రక్తపోటుకు గురయ్యాడు. తరువాత 1977లో అతనికి గుండెపోటు వచ్చి బెంగళూరులోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కూడా మూడు సువార్త కూటాల్లో మాట్లాడటానికి సిద్ధపడ్డాడు. అయితే ఆ కూటాల్లో అతనిని అతని అనుచరులను దేవుడు బలంగా వాడుకుని ఎన్నడూ సువార్త వినని వారికి సువార్త అందించుటకు సహాయం చేశాడు. అయితే తన ఆనారోగ్యపరిస్థితిని బట్టి తను సేవలందిస్తున్న సంస్థలో తన పదవిని వేరొకరికి అప్పగించాడు. అయితే 50 సంవత్సరాలు దేవుని పనిలో విశ్వాసంగా జీవించాడు. తనకు వచ్చిన అనారోగ్యము దేవుని పని చేయడాన్ని ఎన్నడూ ఆపలేకపోయింది. చివరికి అతను అనారోగ్యానికి గురై ఊపిరి పీల్చుకోవటం కష్టమైనందున హాస్పిటల్ లో చేరాడు. తన భార్య కూడా పక్కనే ఉంది. పొత్తికడుపులో నొప్పితో ఎంతో బాధపడ్డాడు. చివరికి 1985 ఆగస్టు 19వ తేదీన తన చివరిశ్వాసను విడిచి ప్రభువు సన్నిధికి చేరుకున్నాడు…
కీర్తనలు 126:5:- కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు.
ఈ కన్నీళ్ళు, ఏడుపు, కలిగి వున్న అన్నరోగ్యము దేవుని సేవకుల్లో ఉండే గొప్ప పట్టుదల, సేవలో తీవ్రతలను సూచిస్తున్నాయి. మనుషుల హృదయ కాఠిన్యాన్నీ, పాపంలో నశించిపోతున్న వారికోసం పొంచివున్న ఆపదలనూ చూచి ఏడుస్తారు. అంతేగాక తాము బలహీనులము, సేవ సరిగా చేయలేనివారము, తప్పులు చేసేవారమని కూడా వారు ఏడవవచ్చు. క్రీస్తు ప్రేమను బట్టి, నశించిన మనుషులపై తమకున్న జాలిని బట్టి కూడా వారు ఏడుస్తారు. అలాంటి మనుషులు తప్పకుండా పంట కోస్తారు. చివర్లో ఆనందం వారిదౌతుంది. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక..