బిల్లీ బ్రే జీవితచరిత్ర
పూర్తిపేరు:- బిల్లీ బ్రే (విలియం ట్రెవర్తా బ్రే)
జన్మస్థలం:- ఇంగ్లాండు దేశంలోని కార్న్‌వాల్ అనే పట్టణం
జననం:- 1794 జూన్ 01
మరణం:- 1868 మే 25
వ్యక్తిగత జీవితం:-
బిల్లీ బ్రే అని కూడా పిలువబడే విలియం ట్రెవర్తా బ్రే, సాధారణముగా బోధించే విధానానికి వ్యత్యాసముగా బోధించే మెథడిస్టు బోధకునిగా ప్రసిద్ధి. తన తాతయ్యతో కలిసి నివసించే బిల్లీ, అతను తన చిన్ననాటి నుండి కూడా తనకు తాను ఆధారం కల్పించుకొనుటకు స్థానికముగా ఉన్న గనులలో పనిచేసేవారు. అక్కడ అతను మద్యపానం, కలహాలు కొట్లాటలు, దొంగతనం, దేవదూషణ వంటి కార్యములతో నిండుకొనియున్న జీవితమును కలిగియున్నారు. జైలు శిక్ష నుండియు మరియు మరణము నుండియు తృటిలో తప్పించుకొనిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే తన మనస్సాక్షిని బట్టి తన హృదయాంతరంగ లోతులలో అతనికి శాంతిసమాధానాలు లేవు. మరణం మరియు నరకమును గురించిన భయంకరమైన కలలు వచ్చేవి.
ఒకసారి ఎవరో అతనికి చదువుటకు జాన్ బన్యన్ వ్రాసిన “విజన్స్ ఆఫ్ హెవెన్ అండ్ హెల్” (పరలోకము మరియు నరకము యొక్క దర్శనములు) అనే పుస్తకమును ఇవ్వగా, దానితో అతని జీవితం మారిపోయింది. తనలో ‘నూతన పురుషుని’ యొక్క ఆనందమును కనుగొనేంత వరకు కూడా అతను దివారాత్రుళ్ళు తన పాపములను ఒప్పుకొనుచూ, దేవునితో తనను సమాధానపరచుకుంటూ ప్రార్థనలో గడిపారు. వెంటనే బిల్లీ తాను కలిగియున్న గొప్ప ఆసక్తి మరియు లోతైన వాంఛలను బట్టి తన కుటుంబం మొదలుకొని తాను కలిసిన వారందరికీ సాక్ష్యమివ్వడం ప్రారంభించారు. అతను ‘బైబిల్ క్రిస్టియన్స్’ అనే ఒక క్రైస్తవ సమూహములో చేరి కార్న్‌వాల్ పరిసర ప్రాంతాలలో పరిచర్య చేయడం ప్రారంభించారు. సాధారణమైన బోధనా విధానముకు వ్యత్యాసముగాను, క్రొత్తదిగాను ఉండే అతని బోధనా విధానం అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించింది. తద్వారా అనేకమంది మారుమనస్సు పొందారు. అంతగా చదువుకోకపోయినప్పటికీ ఎంతో యుక్తిగాను, మిగుల సంతోషముతోను ప్రసంగించెడివారు బిల్లీ. కొన్నిసార్లు పాడుచూ, అరచుచూ మరియు నృత్యం చేయుచూ ప్రసంగించేవారు. సంఘములో చేర్చబడుచున్న నూతన విశ్వాసుల సంఖ్య గణనీయమైనదిగా యుండుటను బట్టి అతని పరిచర్య యొక్క ఫలాలు స్పష్టముగా కనిపించాయి.
అతి త్వరలోనే అతను కార్న్‌వాల్, కెర్లీ డౌన్స్ మరియు కార్హారక్ ప్రాంతములలో ప్రార్థనా మందిరాలను నిర్మించారు. ఇతరులకు ప్రేమను చూపి వారికి పరిచర్య చేయుట ద్వారా తాను కలిగియున్న హృదయానందమును మరియు దేవుని పట్ల ఉన్న దైవభక్తిని వ్యక్తపరిచారు బిల్లీ. ఒక ప్రక్క తాను కూడా పేదరికంలోనే ఉన్నప్పటికీ, తాను కలిగియున్న దానినే ఇతర పేదప్రజలకు పంచిపెట్టుటలో అతను ఎంతో ఆనందించెడివారు. ఎవరైనా ఏదైనా అవసరతలో ఉన్నారని తెలిస్తే వారి కొరకు ఏమీ చేయకుండా ఉండలేని వ్యక్తి బిల్లీ. ఒకసారి అతను వీధిలో వదిలివేయబడిన ఇద్దరు పిల్లలను చూడడం జరిగింది. తన సంపాదన కొద్దిపాటిదే అయినప్పటికీ అతను వారిని తన ఇంటికి తీసుకొనివెళ్ళి తన స్వంత పిల్లలతో పాటు పెంచారు. పవిత్రపరచబడిన తన యుక్తి, సరళత, ఉత్సాహభరితమైన విశ్వాసం మరియు స్వీయమును తిరస్కరించే కృషితో బిల్లీ చివరి వరకు కూడా సేవలో సాగిపోతూ క్రీస్తు కొరకు అనేక ఆత్మలను సంపాదించారు. డెబ్బై మూడు సంవత్సరాల మంచి వృద్ధాప్యమునందు తన తుది శ్వాసను విడిచిన బిల్లీ బ్రే యొక్క పెదవుల నుండి వచ్చిన చివరి మాట “మహిమ”.