చార్లెస్ ఫిన్ని జీవితచరిత్ర

పూర్తిపేరు:- చార్లెస్ గ్రాండిసన్ ఫిన్నీ
జన్మస్థలము:- అమెరికాలోని ‘వారెన్’ నగరము
తల్లిదండ్రులు:- సెల్వస్టర్ ఫిన్నీ దంపతులు
జననము:- 1792 ఆగస్టు 29
మరణము:- 1875 ఆగస్టు 16
రక్షణానుభవము:- 29 సంవత్సరాల వయస్సులో

సేవాఫలితము:- పరిశుద్ధాత్మ శక్తితో ఇంగ్లాండులో చేసిన సేవవలన 5 లక్షల మంది రక్షించబడిరి.

వ్యక్తిగతసాక్ష్యం:- చార్లెస్ ఫిన్నీ అమెరికాలో ‘కనెక్టికట్ రాష్ట్రంలోని వారెన్’ నగరములో 1792 ఆగష్టు 29 న జన్మించాడు. ఇతని తండ్రి పేరు సెల్వస్టర్ ఫిన్నీ. చార్లెస్ ఫిన్నీకి రెండు సంవత్సరముల వయస్సు ఉన్నప్పుడు న్యూయార్క్ లోని ‘బనీడ’ అనే స్థలానికి సైనిక ఉద్యోగి అయిన ఇతని తండ్రి అతన్ని తోడుకొనిపోయెను. ఎడారివంటి స్థలములో సరైన విద్యా, సంస్కృతి, దైవభక్తి లేకుండుట వల్ల ఫిన్నీ తన ఇష్టానుసారంగా పెరిగెను. 16 ఏళ్ల ప్రాయం వచ్చేసరికి సాధారణ విద్య ముగించి తన 20వ ఏట ఉపాధ్యాయ వృత్తిని చేపట్టెను. విద్యపై ఆసక్తి కలిగిన ఫిన్నీ లాటిన్, గ్రీకు, హిబ్రూ భాషలు నేర్చుకునెను.

తన 26 వ యేట ‘లా’ చదువుకొనుటకు కాలేజీలో చేరెను. ‘లా’ చదివే దినాలలో నేటి న్యాయశాస్త్రానికి ఆధారమైన బైబిల్ లోని పది ఆజ్ఞలు గురించి చదివెను. న్యాయశాస్త్ర గ్రంథాలలో బైబిల్ భాగాలను గూర్చిన ప్రసక్తి వచ్చినప్పుడు వాటిని పరిశీలనగా చూడాలని ఆశ కలిగి ఒక బైబిల్ ను కొనుక్కొనెను. బైబిల్ చదివే కొలదీ ఆధ్యాత్మిక ఆకలి ప్రారంభమై ఆశక్తితో బైబిల్ ను నేర్చుకొని అర్థము కాని విషయాలను సంఘకాపరితో చర్చించేవాడు. చనిపోయిన తరువాత జీవమున్నది అని తెలుసుకున్నప్పుడు అయ్యో నేను ఆ జీవితము కొరకు సిద్ధపడలేదే అని వాపోయాడు. చనిపోతే నేను నరకానికి పోతాను అని గుర్తించి పాపం అంటే ఏమిటి? పశ్చాత్తాపం అంటే ఏమిటి? విశ్వాసం అంటే ఏమిటి? అను ప్రశ్నలకు జవాబులు కనుగొనుటకు ప్రయత్నించెను. అలా ఎక్కువగా ప్రార్ధనలోనూ, వాక్యములోనూ సమయము గడపగా తన ప్రధాన పాపము గర్వము అని భయలుపడెను. అలా తన స్థితిని గుర్తించి ప్రార్థిస్తున్న ఫిన్నీ కళ్ళముందు సిలువ దర్శనమును పరిశుద్ధాత్ముడు ప్రత్యక్ష పరిచాడు. మారు మాట్లాడలేక మోకాళ్లపై పడి కేకలు వేసి ఏడుస్తూ తన గర్వాన్ని, పాపాన్ని ఒప్పుకొని ప్రార్ధించెను. లోకంలో మనుషులంతా నన్ను చూసిన, నరకంలోని పిశాచాలన్నీ నన్ను చుట్టుముట్టినా నేను ఈ స్థలంలో నుండి లేవను. మొకాళ్లపై నుండి ప్రార్ధించుట మానను అని కేకలు వేసెను. అలా తన పాపస్థితిని దేవుని ఎదుట ఒప్పుకున్నాడు.

ఆ దినము నుంచి తన హృదయము సంతోషంతో నిండెను. ఆ తర్వాత ఆత్మల రక్షణకొరకు హృదయభారముతో ప్రార్ధించాడు. ఇతను నశించు ఆత్మలను రక్షించాలని, సువార్త ప్రకటించాలని ఎంత ఆశ కలిగి ఉండేవాడు అంటే ఆయన పెండ్లి అయిన అయిదవ రోజున బజారు చేసుకొని రమ్మని తన భార్య సంచి చేతికిస్తే సంచిలో బైబిల్ పెట్టుకొని పోయి మూడు నెలల వరకు సువార్త చెప్పుచు ఆ తరువాత తనకు పెండ్లి అయిన సంగతి గుర్తుకొచ్చి తిరిగి ఇంటికి వచ్చాడట..!

ఫిన్ని దేవుని ఉజ్జీవ పనిముట్టుగా వాడబడుచుండెను. ఫిన్నీ మాట్లాడిన ప్రతి వ్యక్తి పాపపు ఒప్పుకోలులోనికి వచ్చుచుండెను. దేవుని వాక్యము అందించినప్పుడు పరిశుద్ధాత్మ దిగి అనేక ఆత్మలను దర్శించుచుండెను. గొప్ప ఉజ్జీవ అగ్ని రగులుకొనెను. అన్యులు మారుమనస్సు పొందుచుండిరి. ఫిన్నీ బోధిస్తూ ఉంటే వినేవారి హృదయంలోనికి దేవుని వాక్యము వాడియైన బాణాలుగా దూసుకుపోయి, జొరబడేవి. అతడు ధైర్యముగా, సూటిగా మాట్లాడేవాడు. ఈయన ప్రసంగము వినేవారితో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నట్లు, సంతోషించేటట్లు ఉండేవి. చివరిగా ఒక తీర్మానానికి నడిపించేవిగా ఉండేది. ఫిన్నీ గొప్ప ప్రార్థనాపరుడు. పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. పరిశుద్ధాత్మ శక్తితో కూడిన అతని బోధ వినేవారి హృదయాలపై గాఢమైన ముద్ర వేసి పని చేసేది. అతడు ఒక మాట మాట్లాడినా, వాక్యము ఎత్తిచూపినా, సంజ్ఞ చేసినా, చూసినా పరిశుద్ధాత్మ శక్తి అధికముగా కుమ్మరించబడేది. ఆ స్థలంలో పశ్చాత్తాపముతో కూడిన మాటలు వచ్చేవి. కన్నీళ్లు కానవచ్చేవి. ఈయన సభలలో రక్షించబడిన వారిలో 145 మంది చివరివరకు దేవునికి నమ్మకంగా ఉండిరి. ఈయన ఉజ్జీవ కూటముల ద్వారా 5 లక్షల మంది రక్షించబడిరని అంచనా..! ఫిన్నీ ఇంగ్లాండ్ లో దేవుని పనిముట్టుగా బహుగా వాడబడ్డాడు. 1868లో తన జీవిత చరిత్ర రాసి ముగించాడు. తన వృద్ధాప్యంలో వేదాంత కళాశాలలో విద్యార్థులకు బైబిల్ ను బోధించుచు గొప్పసేవ చేసెను. తన 83వ ఏట అనగా 1875 ఆగస్టు 16 వ తారీఖున ఈ లోకయాత్రను ముగించి తాను ప్రేమించిన పరలోకం చేరుకున్నాడు.

గొప్పపలుకు:- లోకమంతా ఎదురుతిరిగినా, పిశాచాలన్ని చుట్టుముట్టినా నేను మోకాళ్ళపై నుండి లేవను అని పలికాడు.

563 Views
Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account