చార్లెస్ స్పర్జన్ జీవితచరిత్ర

పూర్తిపేరు:- చార్లెస్ హెడెన్ స్పర్జన్
తల్లిదండ్రులు:- జాన్ స్పర్జన్ దంపతులు
జన్మస్థలం:- ఇంగ్లాండ్ లోని కెల్వెడాన్ లోని ఎసెక్స్ అను గ్రామం
జననము:- 1834 జూన్ 19
మరణము:- 1892 జనవరి 31
భార్యపేరు:- సూసన్నా స్పర్జన్
రక్షణానుభవము:- 15 సంవత్సరాల వయసులో

సేవాఫలితము:- ఈయన ప్రభువు యొక్క సేవకొరకు తన జీవితాన్ని సమర్పించుకుని గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తూ ప్రసంగాలలో రారాజుగా పేరు పొంది వేల మందిని రక్షణ లోనికి నడిపించడమే కాకుండా బైబిల్ కాలేజీ మరియు అనాధ బాలబాలికల శరణాలయం స్థాపించాడు.

వ్యక్తిగతసాక్ష్యం:- చార్లెస్ స్పర్జన్ ఇంగ్లాండ్ లోని కెల్వెడాన్ లోని ఎసెక్స్ అను గ్రామంలో 1834 జనవరి 19న జాన్ స్పర్జన్ దంపతులకు జన్మించాడు. తన సహోదరులైన 16 మంది కన్నా పెద్దవాడు కానీ వారిలో 9 మంది బాల్యంలోనే చనిపోయారు. చార్లెస్ బాల్యమంతా తన తాత గారి వద్దనే గడిచింది. ఇతని తండ్రి, తాతగారు ఇద్దరూ బోధకులే. తల్లిదండ్రులకు దగ్గరలో ఉన్న పాఠశాలలోనే విద్యను అభ్యసించాడు. అంతేకాక లాటిన్, గ్రీకు, ఫ్రెంచి భాషలు నేర్చుకున్నాడు. సెలవుదినాల్లో తాతగారి ఇంటికి వెళ్లి వేదాంత గ్రంథాలు చదివేవాడు. ప్రతిరోజు కొన్ని వాక్యభాగాలు కంఠత చేసేవాడు. అలాగే గ్రీకు, హెబ్రీ బాషలు చదవడం, వ్రాయడం నేర్చుకున్నాడు. ఇతనిమీద ప్రత్యేకంగా దేవుని దీవెనలు కురవాలని తల్లి ఎంతో ప్రార్థించేది.

1849లో కొంతకాలము వ్యవసాయ కళాశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఒకరోజు సువార్తికుడు మెథడిస్ట్ సంఘంలో వాక్యాన్ని బోధిస్తూ ”సర్వలోక నివాసులారా నా వైపు చూచి రక్షణపొందుడి” అని బోధించాడు. ఆత్మీయ అనుభవం కోసం పోరాడుతున్న స్పర్జన్ ను ఆ వాక్యము కదిలించింది. యవ్వనుడా నీవు భయంకరంగా ఉన్నావు, భయపడుతున్నావు అనే సువార్తికుని మాటలు తన గుండెలకు తగిలి పశ్చాత్తాపముతో తన పాపములు ఒప్పుకొని ప్రభువును అంగీకరించి రక్షణ అనుభవాన్ని తన 15 సంవత్సరాల వయసులో అనగా 1850 జూన్ 6వ తేదీన పొందుకున్నాడు. వేకువనే లేచి ప్రార్థన, వాక్యధ్యానములో గడిపేవాడు. పగలు చదువుకోవడానికి ఉపయోగించేవాడు. సాయంత్రం సువార్త ప్రకటనకు, కరపత్రాలు పంచాడానికి వెళ్ళేవాడు. 16 సంవత్సరాల వయసులో స్పర్జన్ తన మొదటి ప్రసంగం ”యేసు ఔన్నత్యము” గూర్చి అద్భుతంగా ప్రకటించి బాలప్రబోధకుడుగా పేరు తెచ్చుకున్నాడు. చదువుకుంటూనే సాయంత్రం వేళ కేంబ్రిడ్జి చుట్టుపక్కల గ్రామాల్లోని, మందిరాల్లో బోధించేవాడు. 1852లో వాటర్ బీచ్ అనే ప్రాంతంలో పాస్టర్ గా సేవచేస్తూ పెద్దలైన వారిని మార్చి బలపరిచేవాడు. రెండున్నరసంవత్సరాలు చేసిన ఆ సేవ తన పరిచర్యకు పునాదిగా మారింది.

తన 19వ ఏట కేంబ్రిడ్జి సండేస్కూల్ యూనియన్ లో ప్రసంగించే అవకాశం దొరికింది. ఆ ప్రసంగం మూలంగా 300 మంది ఉన్న బాప్టిస్ట్ చర్చికి పాస్టర్ గా రమ్మని ఉత్తరం వస్తే తనకు కాదని అనుకుని మరలా వారికి ఉత్తరం రాశాడు మీరు పంపిన ఉత్తరము నాకేనా అని. ఉత్తరం రాసి ఆ ఆహ్వానాన్ని స్వీకరించి లండన్ చేరి తన ప్రసంగాల ద్వారా దేశమంతా పరిచయం అయ్యాడు. అక్కడ ఆరాధనలో పాల్గొనే వారి సభ్యత్వము పెరిగింది. ఇతని వయసును బట్టి కొంతమంది సేవకులు హేళన చేసినా దేవుడు అతనిని ఘనంగా వాడుకున్నారు. తొమ్మిది సంవత్సరాలు నిండకముందే ఆ సంఘానికి పాస్టర్ గా నియమించబడ్డాడు. ఆ సంఘము మరింత అభివృద్ధి చెందింది. దానిని ఇంకనూ పెద్దది చేయాల్సి వచ్చింది. ఇతను అంటే గిట్టనివారు దూషణలు, నిందలు, చెడ్డమాటలు కల్పించారు. తోటి సేవకులు అయితే ఈ కుర్రాడు త్వరలో పడిపోతాడు అని అనేవారు. ఒకసారి కలరా వల్ల సంఘంలో అనేకులు చనిపోవడం, ప్రతిరోజు సమాధి కార్యక్రమాలు చేయటము బాధను కలిగించింది. స్పర్జన్ మానసికంగా కృంగిపోయి ఇరవై రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అయితే మూడు వందల మంది ఉన్న సంఘము క్రమంగా 14,460 మందికి చేరింది. ఉపదేశకులకు యువరాజుగా పిలవబడ్డాడు. బోధకులైనవారు ఆయనను అనుకరించటం చాలా కష్టతరం. అనేక పుస్తకాలను ప్రచురించాడు.
‘బాప్తిస్మపునరుద్దీకరణ’ అను ప్రసంగం 20 లక్షల ప్రతులు అమ్ముడయ్యాయి. ఆదివారపు ప్రసంగంగా తీసుకొని ప్రచురించిన పుస్తకం 30 సంపుటలు ముద్రించబడ్డాయి. ‘దావీదు ధననిధి’ అను పుస్తకము 13000 సంపుటలు అమ్ముడయ్యాయి.
‘నా విద్యార్థులకు సందేశాలు’ అను పుస్తకము 70వేల సంపుటలు అమ్ముడయ్యాయి. ఒక దినాన ఆయన ప్రసంగిస్తుండగా 22 వేల మంది యేసయ్యను రక్షకుడుగా అంగీకరించారు. ఆ తర్వాత బైబిల్ కాలేజీ స్థాపించాడు, ఒకవ్యక్తి సహాయంతో అనాధ శరణాలయాన్ని కూడా స్థాపించాడు. అంతేకాకుండా ఈయన ‘గ్రంథముల విక్రయసభ’, ”, ‘జిల్లామిషన్’,
‘సౌవార్తిక సంఘము’, ‘ధర్మగృహములు’, ‘కరపత్రములసంఘము’ ఇలా ఎన్నో సంస్థలు స్థాపించాడు. సామాన్యులు మొదలుకొని మేధావులైనవారు ఈయన ప్రసంగాలు వినడానికి వచ్చేవారు. అలాగే తన కుటుంబాన్ని కూడా మాదిరిగల కుటుంబంగా నిర్మించాడు. ధనాన్ని సంపాదించటానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు కానీ పేదవాడిగానే ఉంటు తృప్తిగా జీవించాడు. *ఈయన విజయ రహస్యాలు ఏమిటంటే
”బైబిల్ దేవుని గ్రంథమని అది మాత్రమే దేవునిచిత్తాన్ని బయలుపరుస్తుందని, పరిశుద్ధాత్మ శక్తి ప్రతి వ్యక్తిలో నివసిస్తుందని ఆ శక్తి ద్వారానే కార్యాలు చేయగలడని, దేవుడు తనలో నివసిస్తూ తనను వాడుకుంటున్నాడు” అని నమ్మాడు.* 56 సంవత్సరాలకే సేవలో పూర్తిగా అలసిపోయాడు. 1891 జూన్ 7న మెట్రోపాలిటన్ టబర్నికల్ చర్చిలో చివరి ప్రసంగము చేసాడు. 40 సంవత్సరాలు సేవచేసి అనారోగ్యం వలన వైద్య చికిత్స కోసం వెళ్లి ఫ్రాన్స్ లో 1892 జనవరి 31న ప్రభువు సన్నిధికి చేరాడు.

గొప్పపలుకు:- ”సిలువ లేకపోతే కిరీటము లేదు, దినదినము మరణించడమే ప్రతిదినము జీవించడము, పరలోకం కోసం వాదించేవాడే అతి శ్రేష్టమైన వాదము చేయగలడు.” అని పలికాడు.

657 Views
Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account