ఎలెన్ ఆర్నాల్డ్ జీవిత చరిత్ర
పూర్తిపేరు:- ఎలెన్ ఆర్నాల్డ్
తల్లిదండ్రులు:- ఆల్ఫ్రెడ్ ఆర్నాల్డ్ దంపతులు
జన్మస్థలం:- ఇంగ్లాండు దేశంలోని, వార్విక్‌షైర్
జననము:- 1858 జూలై 5
రక్షణానుభవము:- సంవత్సరాల వయసులో
మరణము:- 1931 జూలై 9
దర్శన స్థలము: భారతదేశం
ఆంగ్లేయులు పరిపాలిస్తున్న కాలంలో భారతదేశంలో భాగముగా ఉన్న తూర్పు బెంగాల్ ప్రాంతంలో (ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో ఉన్నది) పరిచర్య చేసిన ఐదుగురు ఆస్ట్రేలియాకు చెందిన బాప్తిస్టు మహిళా మిషనరీలలో ఎలెన్ ఆర్నాల్డ్ ఒకరు. రెండు పదులు పైబడిన ప్రాయంలో వివాహం కూడా కాని ఈ ఐదుగురు స్త్రీలు భారతదేశంలోని విగ్రహారాధికులకు, మరిముఖ్యముగా స్త్రీలకు నిజమైన సత్యదేవునిని తెలియపరచవలెనని మిషనరీలుగా భారతదేశంలో అడుగుపెట్టారు.
ఎలెన్ ఇంగ్లాండులో జన్మించినప్పటికీ, 1879వ సంll లో వారి కుటుంబం దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌కు వలస వెళ్ళింది. ఆ సమయంలో తూర్పు బెంగాల్‌లోని ఫరీద్‌పూర్ మిషన్‌కు చెందిన పుంచనన్ బిశ్వాస్ దక్షిణ ఆస్ట్రేలియాకు వెళ్ళి మహిళా మిషనరీలను భారతదేశానికి పంపవలెనని క్రైస్తవ సంఘములను ప్రోత్సహించారు. ఏలయనగా తన దేశంలోని స్త్రీలకు స్త్రీలే పరిచర్య చేయవలసిన అవసరం ఉందని ఆమె దృఢముగా విశ్వసించారు. కాగా వృత్తిరీత్యా ఒక ఉపాధ్యాయురాలైన ఎలెన్ తాను చేయవలసిన వృత్తి మిషనరీ సేవ అని గుర్తించడంలో బిశ్వాస్ యొక్క ఆస్ట్రేలియా పర్యటన కీలక పాత్ర పోషించింది. కొంతకాలం పాటు వైద్య శిక్షణ పొందిన తరువాత 1882వ సంll లో భారతదేశంలోని ఫరీద్‌పూర్‌కు చేరుకున్న ఎలెన్, స్థానిక భాషా అధ్యయనాన్ని ప్రారంభించారు. అయితే త్వరలోనే ఆమె తీవ్రముగా బలహీనపడుటతో కోలుకొనుటకుగాను 1884వ సంll లో ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్ళవలసి వచ్చింది. అయితే యేసు క్రీస్తును సేవించవలెనన్న ఆమె దృఢసంకల్పం వలన ఆమెకు సేవలో సహాయకులుగా ఉండునట్లు మరో నలుగురు మహిళా మిషనరీలతో కలిసి 1885వ సంll లో తిరిగి బెంగాల్‌కు వచ్చారు ఎలెన్.
యేసు క్రీస్తు ప్రభువు రెండు చేపలు మరియు ఐదు యవల రొట్టెలతో గొప్ప జనసమూహానికి ఆహారం పంచిపెట్టిన అద్భుతకార్యమును సూచిస్తూ ఈ ఐదుగురు స్త్రీలు ‘ది ఫైవ్ బార్లీ లోవ్స్’ (ఐదు యవల రొట్టెలు) అని ఆప్యాయంగా పిలువబడ్డారు. ఈ స్త్రీలు భారతదేశంలోని బహు జనసమూహములకు ఆత్మీయ ఆహారమును అందించుటకు బయలుదేరారు. ఫరీద్‌పూర్‌లో వైద్య, విద్యా మరియు భవన నిర్మాణ ప్రాజెక్టులను పర్యవేక్షించారు ఎలెన్. తదుపరి 1886వ సంll లో కుమిల్లా ప్రాంతమునకు వెళ్ళి, అక్కడ ఒక మిషన్ స్థావరమును ప్రారంభించారు. అటు పిమ్మట పాబ్నా మరియు అటైకోలా ప్రాంతములలో సువార్తను ప్రకటించుచూ పరిచర్యలో ముందుకు సాగిపోయారు. అంతేకాకుండా ప్రజల సంక్షేమం కొరకు అక్కడ పాఠశాలలను మరియు చిన్న వైద్య కేంద్రములను కూడా స్థాపించారు. ఆమె అందించిన సేవలను బట్టి స్థానికులు ఆమెను ఎంతగానో ప్రేమించారు. 1930వ సంll లో కొంతకాలం పాటు ఆస్ట్రేలియాలో గడిపి, తిరిగి అటైకోలాకు వచ్చిన ఎలెన్ ఆర్నాల్డ్, 1930వ సంll లో తన మరణము వరకు కూడా ఆ ప్రాంతంలో తాను స్వచ్ఛందముగా చేసిన పరిచర్యను కొనసాగించారు.