ఫ్రాన్సిస్ జీవితచరిత్ర
పూర్తిపేరు:- ఫ్రాన్సిస్
జన్మస్థలము:- ఇటలీలోని అసిసీ పట్టణము
తల్లిదండ్రులు:- పీటర్ బర్నాడ్ దంపతులు
జననము:- క్రీ.శ 1181 సంవత్సరము
మరణము:- క్రీ.శ 1226 అక్టోబర్ 13
రక్షణానుభవము:- 20 సంవత్సరాల వయసులో
సేవాఫలితము:- పేదలకు, వ్యాధిగ్రస్తులకు, కుష్టు రోగులకు సేవచేసి క్రీస్తుప్రేమను వారు గ్రహించునట్లు చేసి అనేకులను క్రీస్తు కొరకు సంపాదించెను.
వ్యక్తిగతసాక్ష్యము:- ఫ్రాన్సిస్ 1181 వ సంవత్సరంలో పీటర్ బర్నాడ్ అనే ఒక ధనవంతుడైన వ్యాపారస్తునికి ఇటలీలోని ఉంబ్రియా ప్రాంతమునకు చెందిన అసిసీ పట్టణంలో జన్మించెను. అతని తండ్రి చాలా మూర్ఖత కలిగిన కఠినుడైన వ్యక్తి. ఫ్రాన్సిస్ పెద్దవాడగుతుండగా తన తండ్రిని ద్వేషించుట మొదలుపెట్టెను. కానీ అతని వ్యాపారమును, ధనమును ప్రేమించెను.
14 సంవత్సరాల వయసులోనే తన తండ్రి ద్వారా వ్యాపార పద్ధతులను నేర్చుకుని డబ్బు సంపాదించటం మొదలుపెట్టెను. తన కుమారుడు గొప్ప ధనికుడు కావాలని అతని తండ్రి అతని ఇష్టానికి వదిలిపెట్టగా ఫ్రాన్సిస్ చేతినిండా డబ్బుతో విపరీతమైన విలాసాలతో, ఆడంబరములతో, అహంభావములతో, ఆటలతో తన యౌవన జీవితమును గడుపుచుండెను. ధనవంతులతో సహవాసము చేయుచు తన జీవితమును వ్యర్థపరుచుకునుచుండెను.
ఒకసారి రోమా పట్టణమునకు యాత్రకు వెళ్లెను. అక్కడ కుష్టురోగులను, పేదలను చూచినప్పుడు అతని హృదయం ద్రవించెను. ఫ్రాన్సిస్ తన 20 సంవత్సరంలో ఒక భయంకరమైన వ్యాధికి గురై బలహీనుడాయెను. ఆ వ్యాధిలో దేవుని స్వరమును వినెను. ‘నీవు యజమానుని సేవించుట మేలా.! దాసుని సేవించుట మేలా.!’ యజమానుడనైన నన్ను విడిచి లోకభోగాలనే దాసుని నీవు వెంబడించుచున్నావా అను పలుకులు తన పాపజీవితం కొరకై లోతుగా పశ్చాత్తాపపడినట్లు చేసెను. ఆ రాత్రి నుండి ఫ్రాన్సిస్ లో ఒక మార్పు కలిగెను. ఏకాంతముగా వెళ్లి ప్రార్థన చేసుకొనుటకు క్రీస్తు వలే జీవించుటకు ఆశించెను. ఒకరోజు శాండీమెన్ అను ఆలయమునకు వెళ్ళి అక్కడ మోకాళ్ళూని ప్రార్ధించుట మొదలుపెట్టెను. అలా ప్రార్ధించుచుండగా ”ఫ్రాన్సిస్ నా ఇల్లు పాడైపోయి ఉండుట చూచితివా వెళ్లి బాగుచెయ్యి” అను ఒక మెల్లని స్వరమును విని ఆశ్చర్యపడ్డాడు. ఫ్రాన్సిస్ సంతోషముతో తప్పకుండా చేయుదును ప్రభువా అనెను. తన తండ్రి డబ్బుతో దేవుని ఆలయ కట్టడములు బాగు చేయడం మొదలుపెట్టాడు. అతని తండ్రి అతని డబ్బు వాడుతున్నందుకు ఫ్రాన్సిస్ ను కోర్టుకు లాగెను. కోర్టులో బిషప్ గా వున్న న్యాయాధిపతి నీవు సేవ చేయవలెనన్నా నీ తండ్రి డబ్బు ఇచ్చి వేయాలి అని చెప్పినప్పుడు బహు చల్లని వాతావరణంలో కూడా అతను వేసుకున్న వస్త్రాలు, ఆభరణాలు తన దగ్గర ఉన్న డబ్బులు తీసివేసి తండ్రికి ఇచ్చెను. అప్పటి నుంచి స్వేచ్ఛగా సేవ చేస్తూ తన అవసరాల కొరకు ప్రభువుమీద ఆధారపడెను. అయితే 1208 వ సంవత్సరము ఫిబ్రవరి నెలలో ఒక దినమున ప్రభువు సువార్తను చదువుచుండగా పరిశుద్ధాత్మ వలన ముట్టబడెను. యేసుక్రీస్తు తన శిష్యులను పంపినప్పుడు వారితో డబ్బునైనను, సంచినైనను తీసుకుని వెళ్లవద్దని సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పిన మాటలు అతనికి కనువిప్పు కలుగజేసెను. అతడు తన దట్టిని, కర్రను, చెప్పులను తీసివేసి సామాన్యమైన ఒక అంగీని ధరించి నడుము చుట్టూ ఒక తాడు కట్టుకునెను.
దేవుని సంఘమును కట్టుట అంటే కట్టడములు కట్టుట కాదు, ఆత్మలను సంపాదించుట అని గ్రహించుకునెను. అప్పటి నుండి పడిపోయిన చర్చి గోడలు కట్టుట మాని సువార్తను ప్రకటించుట ద్వారా ఆత్మలను రక్షణలోనికి నడిపించుట మొదలుపెట్టెను. ”ప్రభువు నీకు సమాధానము ఇచ్చును గాక” అని ఇతరులను పలకరిస్తూ క్రీస్తు ప్రేమను ప్రకటించుచుండెను. అప్పటివరకు పిచ్చివాడు అనుకున్న మనుషులు అతనిని ఘనునిగా ఎంచి అతని మాటలు వినుచుండిరి. అలా కొంతమంది స్నేహితులతో కలిసి దేవుని సువార్తను ప్రకటించుచుండెను. వారితో కలిసి ప్రార్థనలో ఎక్కువగా గడుపుతూ ఉండేవాడు. ఫ్రాన్సిస్ ఒంటరి ప్రార్థనల ద్వారా శరీరేచ్చలను జయించేవాడు. తన శరీరమును గాడిద అని పిలుచుకుంటూ క్రీస్తు కొరకు దానిని లొంగదీసుకునేవాడు. ఒకప్పుడు సుఖభోగములుయందు జీవించుచు, బీదలను తృణీకరించే ఫ్రాన్సిస్ ఇప్పుడు దారిద్ర్యమును ప్రేమించుచు పేదలకు, వ్యాధిగ్రస్తులకు, కుష్టురోగులకు సేవచేయుటయే తన జీవిత ధ్యేయంగా భావించెను. సేవయొక్క అక్కరలకు దేవునివైపు చూచుచుండెను. ఈయన బోధ మిక్కిలి సూక్ష్మమైనదిగాను, మనస్సాక్షిని కదిలించి మారుమనస్సులోనికి నడిపించునదిగానూ ఉండెను. ఈయన సమీపించుటతోడనే దొంగలు మార్చబడుచుండిరి, కుష్టురోగులయొక్క పుండ్లు కడుగుచున్నప్పుడే వారు స్వస్థత పొందుకొనుచుండెను. చాలాసార్లు ఇటలీ సరిహద్దులను దాటి సువార్తను ప్రకటించెను. 1214లో మొరాకో ప్రాంతమునకు వెళ్లి సువార్త ప్రకటించి అక్కడే హతసాక్షి అవ్వాలని అనుకొనెను. కానీ అనారోగ్యం వలన తిరిగి రావలసి వచ్చెను. 1219 లో పాలస్తీనాకు వెళ్లి అక్కడ ముస్లింలకు సువార్త ప్రకటించెను. అతని ఆరోగ్యము క్షీణించిపోయింది, కనుదృష్టి కూడా బాగా తగ్గిపోయింది. 1224 లో అతని కాళ్ళలో, చేతులలో గాయములు ఏర్పడి లేవలేని స్థితిలో గాడిదపై మాత్రమే ప్రయాణం చేసెను. తన చివరి దినములన్నీ ఒక చిన్న గుడిసెలో గడిపెను. ఈయన మరణ సమయంలో ”ప్రేమ అను ఆయుధం కలవాడే ఈ సేవను కొనసాగించుటకు తగినవాడు” అని చెప్పి 1226 అక్టోబర్ 13వ తేదీ రాత్రి తన 45వ ఏట ప్రభువునొద్ధకు చేరాడు.