జార్జ్ విట్ ఫీల్డ్ జీవితచరిత్ర

పూర్తిపేరు:- జార్జ్ విట్ ఫీల్డ్
తల్లిదండ్రులు:- థామస్ విట్ ఫీల్డ్, ఎలిజిబెత్ ఎడ్వర్డ్
భార్యపేరు:- ఎలిజబెత్ జేమ్స్
జన్మస్థలము:- ఇంగ్లాండ్ లోని గ్లోస్టర్
జననము:- 1715 డిసెంబర్ 16
మరణము:- 1770 అక్టోబర్ 15
రక్షణానుభవము:- 20 సంవత్సరాల వయసులో
సేవాఫలితము:- ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్, అమెరికా దేశంలో భారమైన హృదయంతో కన్నీటితో చేసిన ప్రసంగాల వలన సాతాను కోరల్లో ఉన్న అనేకులను రక్షణలోనికి నడిపించేను.

వ్యక్తిగతసాక్ష్యం:- జార్జ్ విట్ ఫీల్డ్ 1715 సంవత్సరంలో డిసెంబర్ 16వ తేదీన ఇంగ్లాండ్ లోని గ్లోస్టర్ ప్రాంతంలో జన్మించెను. ఈయన తల్లి ఒక పేరు పొందిన హోటల్ కు యజమానురాలు. జార్జ్ యొక్క రెండేళ్ల వయస్సులోనే అతని తండ్రి చనిపోయెను. ఈయన తల్లి ఈయనను పాస్టర్ కావాలని కోరేది. కానీ జార్జ్ యొక్క మనస్సు నాటకాల మీద ఉండేది. ఇతనికి గంభీరమైన మధురస్వరము వుండేది. జార్జ్ కి ఆక్స్ ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొనుటకు సీటు దొరికింది. అక్కడకు వెళ్లిన తర్వాత ప్రార్ధన చేసుకోవడం, పాటలు పాడటం, ఆలయానికి వెళ్ళడం అనే భక్తి అలవాట్లకు అలవాటుపడ్డాడు. ఉజ్జీవకర్త అయిన జాన్ వెస్లీ సహవాసమునకు చెందినవారితో తిరుగుతుండేవాడు. ‘కొత్త జన్మ పొందాలి’ అనే సత్యం తెలుసుకున్నాడు కానీ క్రొత్త జన్మ ఎలా పొందాలో తెలియక తనంతటతానే ఏవేవో ప్రయత్నాలు చేసినా ఫలితం దొరకలేదు.

ఒక దినము క్రొత్త నిబంధనలోని సిలువ ధ్యానాలు చదువుతుండగా సిలువ వేయబడిన క్రీస్తు ఆయన కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆయన హృదయంలో ఒక అద్భుతం జరిగి పాపపు ఒప్పుకోలు కలిగినది. యేసును తన హృదయములోనికి ఆహ్వానించి నూతనజన్మ అనుభవము పొందెను. ఆ దినములలో చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ వారు అభిషేకించనిదే ఎవరు ప్రసంగించకూడదు. జార్జ్ 20 సంవత్సరాల వయస్సు గలవాడే అయినప్పటికీ దేవుని ఏర్పాటును బట్టి 1736 జూన్ 20వ తేదీన జార్జ్ విట్ ఫీల్డ్ ను డీకన్ గా అభిషేకించెను. జార్జీ ఆ మొట్టమొదటి ఆదివారమే బయటకు వెళ్లి అచ్చట ఖైదీలకు ప్రార్థన జరిపి దేవుని వాక్యమును అందించెను. ఇట్లు పేదల మధ్య అతని పరిచర్య ప్రారంభమాయెను. అతి చిన్న వయస్సులోనే జార్జ్ చేసిన ప్రసంగాలు లండన్, అమెరికాలను కదిలించెను. అనేకులు ఆయన ప్రసంగాలు విని క్రీస్తును అంగీకరించి రక్షించబడిరి. ఈయన ప్రసంగంలోని సారాంశము ”మరుజన్మ..!” మారుమనసు గురించి నొక్కి చెప్పే ఈయన ప్రసంగాలు విని అనేకమంది పాస్టర్లు ఛీధరించుకొని ఈయనపై దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టిరి. అయిననూ మారుమనస్సు పొందుతున్నవారు అనేకులు ఈయనను హత్తుకొనిరి. చర్చిలలో ప్రసంగించు ఆహ్వానము లేనప్పటికీ బహిరంగ స్థలాల్లోను, వీధుల్లోను సువార్త ప్రకటించుచుండెను. ఈయన మీటింగ్స్ లో 20 వేల మంది ఉండేవారు.

ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్, అమెరికా దేశాలలో 35 సంవత్సరాలు సేవ కొనసాగించెను. ప్రభువు కృపవలన ప్రసంగించు వరమును పొంది ఇంగ్లాండ్ దేశంలో గొప్ప ప్రసంగీకులులో ఒకరిగా పేరు పొందాడు. ఈయన ప్రసంగాలు లోతైన పశ్చాత్తాపములోనికి నడిపించేవిగాను, అగ్ని బాణముల వలె గద్దింపుతోనూ, ప్రేమ-ఆదరణలతో నిందియుండేవి. ఈయన ప్రసంగము ద్వారా సాతాను కోరల్లో చిక్కుకున్న వారికి విడుదల దొరికేది ఎందుకంటే అంత లోతైన ఆధ్యాత్మిక జీవితము, ప్రార్థన కలిగి జీవించేవాడు. ప్రసంగాలు చేస్తున్నప్పుడు కన్నీటితోనూ, వెక్కివెక్కి ఏడుస్తూ, ఎదుటి వారి రక్షణకోసం కన్నీటి ప్రసంగాలు చేయడం ద్వారా ప్రజలకు తమమీద ఉన్న ప్రేమ అర్థమయ్యేది. తరువాత తన ఆరోగ్యము దెబ్బతిని, గుండెపోటు వలన బలహీనుడైనా ప్రసంగాలు చేయుట మానలేదు. నేను ఏడుస్తున్నాను అని నన్ను విమర్శిస్తారెందుకు? నాశనానికి సిద్ధంగా ఉన్న మీ ఆత్మల విషయమై మీరు ఏడవకుండా ఉండినప్పుడు నేను మీ గురించి ఏడవకుండా ఎలా ఉండగలను.. ఏమో.! ఒకవేళ మీరు వింటున్నది మీ జీవితంలో చివరి ప్రసంగమేమో అయినను మీరు చలించకుండా ఉండటము చూచినప్పుడు నేను చలించకుండా ఉండలేను అనేవాడు.. రాత్రింబవళ్ళు యేసు నన్ను తన ప్రేమతో నింపుతున్నాడు. ఆయన ప్రేమను నేను తలంచునప్పుడు మూగవాడనైపోవుచున్నాను. నేను ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ ఆదరణలో నడుచుచున్నాను అని డైరీలో రాసుకున్నాడు. సేవలో విశ్రాంతి లేకా అనేక సంవత్సరములు కొనసాగినాడు. మనుషుల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చుటకు, వ్యాధిగ్రస్తులను ఆచరించుటకు అనేక ఉత్తరములు వ్రాయుచుండేవాడు. వారికొరకు ప్రార్థించేవాడు. ‘తుప్పు పట్టుట కంటే అరిగిపోవటం మేలు’ అంటూ ఎంతో అనారోగ్యంతో ఉన్నా తాను మరణించే రాత్రి వరకు బోధించటం మానలేదు. చివరి శ్వాసవరకు ప్రభువుకొరకు ప్రయాసపడి చివరికి 1770 అక్టోబర్ 15న తన 86వ ఏట తన ప్రాణాన్ని ప్రభువుకు అప్పగించుకున్నాడు.

గొప్పపలుకు:- నాకు వెయ్యి జన్మలు, వెయ్యి శరీరాలు ఉంటే ఎంత బాగుండును.! వేయి నోళ్ళతో క్రీస్తును ప్రకటించేవాడిని. ఈ యాత్ర ఎంతకాలం సాగితే అంతకాలము ప్రజలను మేల్కొల్పుతాను అని పలికాడు.

283 Views
Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account