గ్రీన్ లారెన్స్ వార్టన్ జీవిత చరిత్ర
పూర్తిపేరు:- గ్రీన్ లారెన్స్ వార్టన్
జన్మస్థలం:- అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ఇండియానా
జననం:- 1847 జూన్ 17
మరణం:- 1906 నవంబర్ 04
వ్యక్తిగతసాక్ష్యము:- “డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్” (క్రీస్తుని శిష్యులు) అనే సంస్థ తరపున భారతదేశంలో సేవ చేసిన మొట్ట మొదటి మార్గదర్శక మిషనరీలలో గ్రీన్ లారెన్స్ వార్టన్ ఒకరు. ఒక వ్యవసాయ కుటుంబములో జన్మించిన వార్టన్, విద్యాభ్యాసం పొందుటకు చాలా తక్కువ అవకాశములను కలిగియున్నారు. యవ్వన దశలో ఉన్నప్పుడు దేవుని కొరకు ఎంతో రోషము కలిగిన క్రైస్తవునిగా ఉన్న అతను, కళాశాల చదువును పూర్తి చేసికొనక మునుపే ప్రసంగించడం ప్రారంభించారు. తదుపరి అతను పరిచర్య నిమిత్తం శిక్షణ పొందుటకుగాను బేతని కళాశాలలో చేరారు. అటు పిమ్మట బఫెలో అనే ప్రాంతములో సంఘ పాదిరిగా నియమితులయ్యారు.
ఆ సమయంలో “ఫారిన్ క్రిస్టియన్ మిషనరీ సొసైటీ” మరియు “క్రిస్టియన్ ఉమెన్స్ బోర్డ్ ఆఫ్ మిషన్స్” అనే సంస్థలు భారతదేశంలో సేవ చేయుట గురించి యోచన చేస్తున్నాయి. భారతదేశ ప్రజల పట్ల ఎంతో భారంతో వార్టన్ ఆ పరిచర్య చేయుటకు “డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్” సంస్థ తరపున తనను సమర్పించుకున్నారు. సతీసమేతంగా 1882వ సంll లో బొంబాయి నగరమునకు చేరుకున్న వార్టన్, తరువాత మధ్య భారతదేశంలోని హర్దా అనే ప్రాంతమునకు వెళ్ళి, అక్కడ వారి మొదటి మిషన్ స్థావరమును స్థాపించారు. నివసించుటకు ఒక చిన్న భవనాన్ని అద్దెకు తీసుకుని, ప్రారంభ దినములను స్థానిక భాషను అధ్యయనం చేయుటలో గడిపారు. హిందీ భాషను శీఘ్రముగా నేర్చుకొనగలిగిన వార్టన్, ఆ భాషలో సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. ప్రారంభంలో అక్కడి ప్రజలు అతని నుండి వైద్యపరమైన సహాయమును ఆశించగా, తద్వారా మిషన్ పనులకు ద్వారము తెరువబడింది. రద్దీగా ఉండే అంగడి వీధులకు వెళ్ళి సువార్తకు సంబంధించిన లేఖనములను అరచుచున్నట్లు గొప్ప శబ్దముతో చెబుతూ చుట్టూ నిలిచి వీక్షించుచున్న ప్రజలకు దేవుని ప్రేమను గురించి ప్రకటించేవారు.
దేవుని శక్తితో నింపబడిన వారిగా అతను ప్రసంగించేవారు. తత్ఫలితముగా అనేకులు నిజమైన సత్యదేవుని వైపుకు తిరిగారు. స్థానిక భాషలో అతను లేఖన ప్రతులను పంచిపెట్టేవారు. అంతేకాకుండా ఆ దంపతులిరువురూ గ్రామములలో సువార్తను ప్రకటించే సేవలో కూడా ఎంతో చురుకుగా ముందుకు సాగిపోయారు. చిన్న పిల్లలు కూడా ప్రయోజనం పొందులాగున పలు ఆదివారపు బైబిలు పాఠశాలలను (సండే స్కూళ్ళు) ప్రారంభించారు. వారి పరిచర్య బహుగా ఫలించి అభివృద్ధి చెందగా, ముంగేలి మరియు బిలాస్‌పూర్ ప్రాంతాలలో క్రొత్త మిషన్ స్థావరాలు స్థాపించబడ్డాయి. ప్రజల సామాజిక శ్రేయస్సు కొరకు కూడా వార్టన్ కృషి చేశారు. అతను పిల్లల కొరకు పాఠశాలలను స్థాపించారు మరియు కుష్ఠురోగుల కొరకు ఒక ఆసుపత్రి నిర్మించబడుటలో కీలకపాత్ర పోషించారు. సువార్త ప్రకటించుటకు స్థానికులలో ప్రేరణను కలిగించవలెనని 1893వ సంll లో హర్దాలో సేవకుల కొరకు ఒక బైబిలు శిక్షణా పాఠశాలను మరియు 1905వ సంll లో జబల్పూర్‌లో ఒక క్రైస్తవ బైబిలు కళాశాలను స్థాపించారు. క్రీస్తు యొక్క నిజమైన శిష్యునిగా జీవించిన గ్రీన్ లారెన్స్ వార్టన్, చివరి వరకు కూడా దేవుని కొరకు తన పూర్ణ శక్తితో శ్రమించారు.