జాన్ హైడ్ జీవిత చరిత్ర

పూర్తి పేరు:- జాన్ హైడ్
జన్మస్థలము:- అమెరికాలోని కారల్ టన్ పట్టణము తల్లిదండ్రులు:- స్మిత్ హారిస్ హెడ్ దంపతులు
జననం:- 1865 నవంబర్ 9
మరణం:- 1912 ఫిబ్రవరి 17
సేవాఫలితము:- శారీరకంగా బలహీనుడైనప్పటికీ తన శక్తివంతమైన ప్రార్థన, గంటల తరబడి చేసిన ప్రార్థన అనేకులను లోతైన పశ్చాత్తాపములోనికి నడిపించెను.

వ్యక్తిగతసాక్ష్యము:- జాన్ హైడ్ అమెరికా దేశంలోని “ఇల్లినాస్” రాష్ట్రంలోని కారల్ టన్ అనే పట్టణంలో 1865 నవంబర్ 9న స్మిత్ హారీస్ హైడ్ అను దంపతులకు జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు గొప్ప ప్రార్థనాపరులు.. వారి గృహమును ఎల్లప్పుడూ ప్రార్ధనద్వారా ప్రభు సన్నిధితో నింపుకునేవారు. చిన్ననాటి నుండి బిడ్డలను భక్తిలోనూ, దేవుని యందలి క్రమశిక్షణలోనూ పెంచుతుండేవారు.. తల్లి ప్రార్థన జీవితం, తండ్రి ప్రసంగాల వలన జాన్ హైడ్ ప్రభావితుడై ఏదో ఒక దేశానికి మిషనరీగా సేవ చేయాలని ఆశపడేవాడు. తన ప్రాథమిక విద్యను అంతటిని పూర్తిచేసుకుని ఉపాధ్యాయుడిగా కొంతకాలం పనిచేశాడు. ఒకరోజు రాత్రి ‘విదేశీ సేవకుల సిద్ధపాటు’ అనే కూడికకు హాజరైనప్పుడు ‘హెన్రిక్ జాన్సన్’ గారి ప్రసంగము హెడ్ ను ప్రభావితం చేసింది. అప్పుడు సేవకు సమర్పించుకుని దేవునికి ప్రార్ధించి నన్ను ఏ దేశానికి పంపినా నేను వెళ్లడానికి సిద్ధమే అని తీర్మానించుకున్నాడు..అలా సేవకు తననుతాను సిద్ధపరుచుకోవడం ప్రారంభించాడు.

 

తరువాత కొంత కాలానికి 1892 లో మిషనరీగా భారతదేశం వచ్చాడు. ఈయన బలహీనుడిగా ఉండటం వల్ల, మెల్లిగా మాట్లాడటం వల్ల ఈయనను ఎవరూ కూడా మిషనరీగా భావించలేదు. ఎందుకంటే మాటలు తడుముకునేవాడు, గట్టిగా కేకలు వేస్తూ మాట్లాడలేకపోవడం, ఉత్సాహంగా ఉండకుండా ప్రశాంతంగా సాధుగుణం కలిగి ఉండటం వల్ల ఈయనను మిషనరీగా పనికిరాడు అని అంటుండేవారు. కాని జాన్ హైడ్ లో చురుకుదనం, మాట నేర్పరితనము, శరీర దృఢత్వం, జ్ఞానము లేకపోయినప్పటికీ ఆయనలో ఒక గొప్ప గుణం దాగి ఉంది. ఆ గుణము, ప్రత్యేకత ఏమిటంటే *మోకాళ్ళప్రార్థన”. మోకాళ్ళమీద బడి గంటల తరబడి ప్రార్థన చేయుట ద్వారా పరలోకపు శక్తిని, ప్రభావమును, భూలోకమునకు దింపేవాడు. ఈయన యొక్క ప్రార్థనా గది చెంత మనము నిలిచి చూస్తే ఎడతెగని ప్రార్ధన, విజ్ఞాపనలను, నిట్టూర్పులను గంటల తరబడి మనము వినగలం.. ధారలుగా కారు కన్నీటిని చూడగలము. ఇలా అన్నపానములు మానివేసి ఆత్మలరక్షణ కొరకు దేవుని సేవకొరకు పరిచర్యకొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ, విలపిస్తూ తన హృదయమును కుమ్మరించి దేవునితో గోజాడేవాడు.. ప్రార్థననే తన జీవితముగా, ఊపిరిగా మార్చుకున్నాడు. ఎడతెగక ఒంటి మోకాళ్లమీద పడి ప్రార్థన చేసేవాడు. ఈయన మోకాళ్ల దగ్గర ప్యాంటు చినిగిపోయి ఉండేది. అలా ప్రార్థనా వీరుడిగా నిలిచిపోయాడు..

మన దేశానికి మిషనరీగా వచ్చిన జాన్ హైడ్ అనేక సమస్యలు, కష్టములను ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా దేశభాషలు నేర్చుకోవడం ఆయనికి చాలా కష్టతరమైనది. ఎందుకంటే వినికిడి లోపం వల్ల ఎదుటి వారి మాటలు సరిగ్గా వినలేకపోయాడు. అయినా సరే భాషలు నేర్చుకొని ఒంటరిగా బైబిలు చదువుతూ వాక్య మర్మాలను గ్రహిస్తూ ఉండేవాడు. సువార్తసేవ చేయడానికి ముందుగా ప్రార్థనలో, వాక్యము నేర్చుకొనుటలో ఎక్కువ సమయం గడిపేవాడు.. అనేక మర్మాలను వాక్యములో నుండి గ్రహిస్తూ ఉండేవాడు. ఒకరోజు పంజాబ్ రాష్ట్రంలోని ‘సియోల్ కోట‌్’ అను స్థలంలో ఉజ్జీవ కూటములకు ప్రసంగికుడిగా ఆహ్వానించబడ్డారు. అయితే ఆ మీటింగ్ కోసం జాన్ హైడ్ ప్రసంగిచుట కొరకు, తోటి దైవసేవకులతో కలిసి ప్రార్ధించుట కొరకు, ప్రజలు దేవునివాక్యము ద్వారా మార్పు చెందుట కొరకు 21 దినములు కేవలము దేవుని సన్నిధిలో పడి అనేక ఆత్మలను రక్షించబడాలని భారముతో ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన ద్వారా సిద్ధపడి వెళ్లిన జాన్ హైడ్ ముఖంలో ప్రజలు గొప్ప వెలుగుతో కూడిన ముఖమును చూడగలిగారు.. ఆ మీటింగ్ లో తన ప్రార్థన అనుభవమును, పాపాన్ని జయించి జయజీవితము జీవించుటకు ఏసుప్రభు ఎలా సహాయం చేస్తాడు అని కేవలం 15 నిమిషాలు మాత్రమే వివరించాడు.. తరువాత పరిశుద్ధాత్మ అభిషేకం ప్రజలందరి మీద కుమ్మరించబడి వారి పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపమునకై ప్రభువు పాదాల చెంత కన్నీరు కార్చిరీ. ప్రసంగం 15 నిమిషాలలో ముగించినప్పటికీ ప్రార్థన మాత్రం కొన్ని గంటలు చేయగలిగారు. అంతటి లోతైన అనుభవంలోనికి, పశ్చాత్తాపంలోనికి ప్రజలను నడిపించగలిగాడు. అంతటి ఉజ్జీవము అంతకు ముందెన్నడూ చూడలేదని ప్రజలు సాక్ష్యమిచ్చారు. పెద్ద పెద్ద ప్రసంగాలు చేయలేకపోయినా తన ప్రార్థనా శక్తి ద్వారా కొద్ది నిమిషాలు ప్రసంగించినా ప్రజలను పశ్చాత్తాపంలోనికి నడిపించి అనేక ఆత్మలను రక్షించగలిగాడు. దేవుని సన్నిధిని ప్రజలమధ్యకు తెచ్చు మార్గము ప్రార్థనయే అని గుర్తించాడు.. అయితే జాన్ హైడ్ తో ఉన్నవారు “అయ్యా భోజనం చేయడానికి రండి అనినప్పుడు- ఆకలి లేదు నన్ను ఇంకా కొంచెం సేపు ఆత్మల కొరకు అలమటించనివ్వండి.” అని అనేవాడట. ఆలా ప్రార్థనలో పడి బలహీనుడైపోయినా మోకరించిటానికి బలము చాలకపోయినా గదిలో కిందపడి, మీదపడి, దొర్లుతూ ప్రార్థనచేసి ప్రభువా రోజుకు ఒక ఆత్మనైనా నాకు అనుగ్రహించు అని అడుగుతుండేవాడు. ఆ ప్రార్థన వినిన ప్రభువు రోజుకు ఒకరిని రక్షించే భాగ్యం ఇచ్చాడు. ఆ తరువాత రోజుకు నాలుగైదు ఆత్మలనైనా ఇవ్వు అని ప్రార్ధించినప్పుడు ఆ ప్రార్థన విని అనేక ఆత్మలను రక్షించు భాగ్యాన్ని దేవుడు అతనికి అనుగ్రహించాడు. అలా భారతదేశంలో 19 సంవత్సరాలు సేవ చేసి ప్రార్థనాపరుడైన మిషనరీగా అనేక ఆత్మలను ప్రభువు కొరకు సంపాదించాడు.. చివరికి పడకమీద ఉన్నప్పటికీ, లేవలేని స్థితిలో ఉండి విశ్రాంతికి బదులు విజ్ఞాపన చేయుచున్నాను అని ప్రార్థనలోనే తన జీవితమును గడిపేవాడు. అలా తన 47వ సంవత్సరంలో పరిచర్య ముగించి తనను ప్రేమించిన ప్రభువును చేరుటకు ఆశ కలిగి తన ప్రాణాన్ని విడిచి ప్రభువు వద్దకు 1912 ఫిబ్రవరి 17న చేరుకున్నాడు..

గొప్పపలుకు:- సరిహద్దుల్ని విశాలపరచమన్న నా ప్రార్థనకు ఏడు నెలల వ్యాధి బహుమానంగా దొరికింది. స్వపరీక్ష, సమర్పణ, కనిపెట్టుట అనే అనుభవాలను ఆ సమయంలో పొంది, పరిచర్యకు ప్రార్థనే ప్రాణమని గుర్తించాను అని పలికాడు..

1234 Views
Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account