మల్లెల దావీదు జీవిత చరిత్ర
పూర్తిపేరు:- మల్లెల దావీదు
తల్లిదండ్రులు:- రెవ. ఇస్సాకు, రిబ్కమ్మ దంపతులు
జన్మస్థలం:- నర్సారావు పేట తాలూకాలోని చిమ్మనబండ అనే గ్రామం
జననం:- 1890 ఆగస్టు 6
మరణం:- 1971 మే 17
వ్యక్తిగతసాక్ష్యం:-
మల్లెల దావీదు గారు 1890 ఆగస్టు 6 న నర్సారావు పేట తాలూకాలోని చిమ్మనబండ అనే గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు రెవ. ఇస్సాకు, రిబ్కమ్మ. వీధి పాఠశాలలో విద్యాభ్యాసాన్ని ఆరంభించారు. విద్య సరిగా అలవడకపోవడంతో ప్రాథమిక పాఠశాలలోనే చదువు చాలించారు. చిన్నతనం నుండే పాటలూ పద్యాలూ పాడుతూ కాలక్షేపం చేసేవారు. అలా చదువు సంధ్య లేకుండా ఉంటుండగా తన అన్నగారు రామపట్నం లోని వేదాంత పాఠశాలలో చేర్పించారు. అక్కడ క్రమశిక్షణ మల్లెల దావీదు గారి జీవితాన్ని మలచివేసింది. ఆయన జీవితాన్ని సరియైన మార్గంలో తీర్చిదిద్దింది. వేదాంత విద్య ముగించి, అక్కడే ఉపాధ్యాయుడుగా పనిచేశారు. రెండు సంవత్సరాల అనంతరం నెల్లూరు మిషన్ హైస్కూల్లో చేరి, ఉన్నత విద్యను ముగించి, మరల వేదాంత ఉపాధ్యాయుడిగా రామాపట్నం, డోర్నకల్‌లో పనిచేశారు. ఖమ్మం జిల్లాలో స్థిరపడి, 71 సంవత్సరాలు తన జీవితాన్నంతా సంఘ పరిచర్యకు, సాహిత్య కృషికే అంకితమిచ్చారు. కేవలం కీర్తనల్ని వ్రాయడమేకాకుండా ప్రతి వేసవిలో సంగీత శిక్షణా సమ్మేళనాల్ని నిర్వహించి, ప్రతి సంకీర్తనను రాగతాళభావయుక్తంగా ఎలా పాడాలో శిక్షణనిచ్చేవారట. ఈ మహానుభావుడు కీర్తనాకారుడు మాత్రమే కాదు, మంచి వక్త కూడ. ఆంధ్రప్రదేశమంతటా అనేక క్రైస్తవ మహాసభల్లో పాల్గొని వాక్యాన్ని బోధిస్తూ, కీర్తనల్ని వివరించేవారు. “మల్లెల దావీదుకు సాహిత్య సేవ, సువార్త సేవ రెండు కూడ రెండు నేత్రాలు” అని ఆర్ సుందరరావు గారు (తెలుగులో క్రైస్తవ సాహిత్యం-308) అంటారు.
ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గ్రంథ రూపకల్పనకు పునాది వేసిన వారిలో మల్లెల దావీదు ఒకరు.
మిగిలిన ఇద్దరు, రెవ.ఎమ్.ఎల్.డోల్బీర్ మరియు రెవ.బి. హెబ్బి డేవిస్ లు. 1937 లో వీరు ముగ్గురు సంపాదక త్రయంగా ఏర్పడి చేసిన కృషిఫలితమే మనమీనాడు ఆరాధనల్లో ఉపయోగిస్తున్న ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గ్రంథం. ఆతరువాత చాలా పాటలు చేర్చి దాన్ని పునర్మిద్రించారు. మల్లెల గారు లెక్కకు అనేక కీర్తనల్ని వ్రాసినప్పటికి, వాటిలో ముప్పై మాత్రమే లభ్యమైయ్యాయి. వాటిలో ఇరవై పాటలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గ్రంథంలో చోటుచేసుకొన్నాయి. వీరు వ్రాసిన పాటలు అన్ని సందర్భాలకు సంబంధించినవి. ఈయన పాటల్లోని ప్రత్యేకత ఏమిటంటే బైబిల్లోని వాక్యభాగాల్ని యథాతథంగా తీసికొని వాటికి స్వల్ప మార్పులతో సంగీతాన్ని సమకూర్చడం.
ఉదాహరణకు కీర్తనలు 51 వ అధ్యాయం ఆధారంగా వ్రాసిన పాటలో,
“ దహనబలి నీకు ననిష్టము-మరియు-దైవ బలులు విరిగిన ఆత్మయే-
యెహోవదేవ విరిగిన-హృదయంబలక్ష్యము సేయవు||
మరోపాట, “ ఘనయెహోవ నీ గుడారం-బుననతిథియౌవాడెవండు
తనర నీ పరిశుద్ధ పర్వత-మున వసించెడువాడెవండు||
అలాగే 139, 121 వ దావీదు కీర్తనలకు, లూకా సువార్త మొదటి అధ్యాయంలో జకర్యా పాడిన స్తుతి గీతానికి, ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనకు, విశ్వాసప్రమాణానికి రాగతాళాలను కూర్చి మల్లెల గారు వాటిని పాటలుగా మలిచారు.
ఒకానొక సందర్భంలో తాను చేసిన తప్పిదానికి పశ్చాత్తాపపడి వ్రాసిన పాట “దేవా దీన పాపిని” అందరికీ సుపరిచితమే. దేశ ప్రజలందరి శ్రేయస్సును కోరి విజ్ఞాపన ప్రార్థనగా “ పరమ వైద్యుడా భారతీయుల-వ్యాధిబాధల బాపుమా…” అనే గీతాన్ని వ్రాశారు. ఈ పాటలో దేవుణ్ణి పరమవైద్యుడిగా సంబోధిస్తూ , సర్వ రోగాల్ని పేరుపేరునా ప్రస్తావించి, స్వస్థపరచమని వేడుకొంటాడు. అలాగే “దేశాభిమానులార లెండు-ధీరోధారులై – దేవునాత్మను ధరించి రండు” అనే పాటలో మన దేశానికి శాపమైన కులాన్ని నిర్మూలించమని, స్త్రీల దైన్యత్యాన్ని తొలగించమని, బాలికా విద్యను ప్రోత్సహించమని ప్రబోధించారు.
“ సఖులారా సబ్బాతుబడి” అనే కీర్తనలో భావి క్రైస్తవ సంఘానికి సండే స్కూలు మూలమని పేర్కొన్నారు.
“సారిగాపాదాసానీదా-పాదపమగరిసరిసనిదసా”
” ఓ ప్రభుండ నిన్ నుతించు-చున్నాము వినయముతోడ”- అనే పాటకు కర్నాటక సంగీత బాణీలో స్వరకల్పనననుసరించి సాహిత్యాన్ని సమకూర్చారు.
కీర్తనలతో పాటు వివిధ సాహిత్యప్రక్రియలలో (Literary genres)రచనల్ని గావించారు. జూబిలీ నవరత్నమాల, జగజ్జయము, అస్పృశ్యత, అమ్మా కొక్కొరొకో, అనే నాలుగు ఖండకావ్యాలని, ఆంధ్రమాత, దురాత్మ అనే రెండు శతకాల్ని, (100 poems), బాల ప్రార్థనా పద్యాలు అనే పద్యకావ్యాల్ని, సమూయేలు చరిత్ర,, యోనా కథావళి అనే కథల్ని, అర్థ భాను నాటకాన్ని, కావ్య చంద్రిక అనే లక్షణ గ్రంథాన్ని, జగద్రక్షణ అనే సత్కథా కాలక్షేపాన్ని, పంచతంత్రమనే నవలని, సాక్షి-భగవన్ముక్తి, సాక్షి-భగవదుక్తి, సాక్షి-భగవద్భక్తి అనే వేదాంత గ్రంథాలతోపాటు బాలవేదాంత కథలు, లాజరు కథలు, దేశభక్తి గీతాలు, అసంఖ్యాకమైన ఆధ్యాత్మిక భక్తి గీతాల్ని వ్రాసి అటు తెలుగు భాషాసాహిత్యాలకు, ఇటు తెలుగు క్రైస్తవ సంఘానికి అమూల్యమైన సేవ చేసిన మహారచయిత శ్రీ మల్లెల దావీదుగారు.
ఒకరోజు తన కుటుంబ ప్రార్థన సమయంలో సాయంకాల ఆరాధనకు సంబంధించిన పాటలు ఎక్కువగా లేకపోవడంతో అప్పటికప్పుడు “ఈ సాయంకాలమున-యేసుప్రభూ వేడెదము” అనే చక్కటి సంకీర్తనను సమకూర్చారు. నేడు అనేక క్రైస్తవ కుటుంబాలలో ఈ కీర్తని పాడుకొని గాని నిద్రకుపక్రమించరంటే అతిశయోక్తికాదేమో!
మల్లెల దావీదుగారు తన సుదీర్ఘ జీవితయాత్రలో ఊరూర సువార్తపరిచర్య గావిస్తూ తాను పొందిన రక్షణానందాన్ని అనేకులకు తెలియజెప్పాలనే దృఢ సంకల్పంతో “సాక్ష్యమిచ్చెద మన స్వామి యేసు దేవుడంచు” అని ఎలుగెత్తి చాటారు. స్వీయ సాక్ష్యాన్ని సాక్షాత్కరించిన ఈ పాట ప్రతి క్రైస్తవ విశ్వాసికి మార్గదర్శకం.
క్రైస్తవ సంఘ కాపరిగా, క్రైస్తవ వేదాంత గురువుగా, సంగీత శిక్షణా శిబిర నిర్వాహకుడిగా, కవిగా, రచయితగా జీవితంలో పలు పాత్రలను పోషించి తన రచనలలో మల్లెల జల్లులను గుబాళించిన మల్లెల దావీదు గారు 1971 మే 17న ప్రభువు సన్నిధికి చేరుకొన్నారు. కాని తమ స్వీయానుభవాలతో వ్రాసి పొందుపరిచిన ఆధ్యాత్మిక గీతాలు మాత్రం ఈనాటికీ సజీవంగానే ఉన్నాయి