పులిపాక జగన్నాధం జీవిత చరిత్ర

పూర్తిపేరు:- పులిపాక జగన్నాధం
జన్మస్థలం:- తూర్పు గోదావరి జిల్లా
జననం:- 1826 సెప్టెంబరు 14
రక్షణానుభవం:- 21 సంllల వయస్సులో
భార్యపేరు:- ఎలైజా ఆస్ బర్న్
మరణం:- 1896

వ్యక్తిగతసాక్ష్యం:- పులిపాక జగన్నాధం గారు 1826, సెప్టెంబరు 14 న తూర్పు గోదావరిలోని శ్యామలాదేవి అనే లంకలో నిష్ట గలిగిన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వారి సాంప్రదాయాలకు, మతాచారాలకు తగినట్టుగా పెరిగారు. 1840 లో విశాఖపట్నంలో రెవరెండు జాన్ హే గారు స్థాపించిన మిషనరీ స్కూలులో ఏడు సంవత్సరాలు విద్యాభ్యాసం చేశారు. చదువులో అందరికంటే ముందుండే వారు.
క్రైస్తవ పాఠశాలలో చదువుతున్నప్పటికీ, క్రైస్తవులంటే పడేది కాదు. క్రైస్తవ మిషననరీలను ఎంతగానో ద్వేషించేవారు. ఆ బడిలో చదివే విద్యార్థులందరికీ ఇచ్చినట్లే జగన్నాథంగారికి కూడా బైబిలు ఇచ్చారు. కాని ఆయన ఆ బైబిలును ఎన్నడూ చదువ లేదు. మిషనరీలపై, క్రైస్తవులపై తను ఎంతగా కోపం, ద్వేషం చూపించినా, వారు తన పట్ల క్రీస్తు ప్రేమను చూపించారే తప్ప, తనను ఏమీ అనలేదు. వారు తన పట్ల చూపించిన ప్రేమ, సహనం జగన్నాధం గారిని ఆలోచింప చేశాయి. వెంటనే ఎప్పుడో పాఠశాలలో ఇచ్చిన బైబిలును తీసి చదువనారంభించారు . బైబిలులోని సత్యాలు ఆయనకు కనువిప్పు కలిగించాయి. తనలో ఆధ్యాత్మిక పరివర్తనను కలిగించాయి. విగ్రహారాధన తప్పని తెలుసుకొన్నారు. క్రీస్తు ప్రభువుని అంగీకరించాలని నిర్ణయించుకొన్నారు . ఇదే విషయాన్ని మిషనరీ జాన్ గారికి చెప్పి, తన ప్రవర్తనకు క్షమాపణ కోరి, 1847 లో తన 21 వ యేట క్రీస్తుని రక్షకునిగా అంగీకరించారు. సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి, క్రైస్తవ్యాన్ని స్వీకరించడం తన తల్లిదండ్రులకు, బంధువులకు ఎంతో ఆగ్రహం కలిగించింది. తత్ఫలితంగా ఎన్నో రకాల శ్రమల్ని, బాధలని అనుభవించవలసి వచ్చింది. కాని జగన్నాధంగారు వీటన్నిటికి ఓర్చి, విశ్వాసంలో వెనుకడుగు వేయక అదే సంవత్సరం ఏప్రియల్ 19 న బాప్తీస్మం ద్వారా బహిరంగ సాక్ష్యమిచ్చి ప్రభువు కొరకు నిలబడ్డారు. 1851 మార్చి 6 వ తేదీన ఎలైజా ఆస్ బర్న్ ను వివాహమాడారు.

విశాఖపట్టణ ప్రాంతంలో లండన్ మిషన్ తరపున 1858 లో సంఘ కాపరిగా బాధ్యతలు చేపట్టి 30 సంవత్సరాలు పనిచేశారు. ఆయన భార్య కూడా జాన్ హే గారు స్థాపించిన బాలికల పాఠశాలలో బైబిలు తరగతులను నిర్వహించేవారు. సంఘంలోని స్త్రీలకు ప్రార్థనా కూటములను కూడా జరిగించేవారు. జగన్నాధం గారి కుటుంబ సేవ ఎంతో ఫలభరితంగా విస్తరించి, ఎంతో మందికి క్రీస్తు మార్గాన్ని చూపించింది. సంఘ నిర్మాణానికి, సామాజిక పరిరక్షణకు జగన్నాధం గారు ఎంతో పాటుపడ్డారు. ఇదంతా అంత సులభంగా జరుగలేదు. ఆయన ఎన్నో కష్టనష్టాల్ని, శ్రమల్ని భరించాల్సి వచ్చింది.
కుటుంబ సభ్యులు, బంధుమిత్రులచే విడువబడ్డ జగన్నాధం గారు క్రీస్తునే సర్వంగా భావించి, ప్రప్రధమంగా “నీవు తోడైయున్న జాలు యేసు” అనే పాటను వ్రాశారు. తనకు ముందే ఉన్న కర్నాటక సంగీత పరిచయాన్ని దేవుడు తనలో జరిగించిన కార్యాలకు జోడించి, ఎన్నో భావయుక్తమైన, చక్కని సంకీర్తనల్ని రచించి క్రైస్తవ సంఘానికి కానుకగా ఇచ్చారు. వీటిని ఈనాటికి, క్రైస్తవ సంఘాల్లో ఆలపిస్తూ ఆనందిస్తున్నాం. ఈ పాటలన్నీ జగన్నాధంగారి విశ్వాస జీవితానికి అద్దంపడుతున్నాయనడంలో అతిశయం లేదు. తెలుగు క్రైస్తవ లోకం అనునిత్యం పాడుకొనే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్ని అందించడానికి ఎంతోమంది కృషిచేసారు. వారిలో పులిపాక జగన్నాధం గారు ఒకరు.

ఆయనమరణానంతరం ఆయనను గురించి లండన్ మిషనరీ పత్రికలో జగన్నాధం గారు బలమైన, నిజమైన సేవకుడిగా దేవుని సువార్తను ప్రకటించిన వారిలో ఒకరు అని రాయబడింది.
సంఘ కాపరిగా ఉంటూ ఈయన సంఘ ఆరాధనా క్రమంలో వ్రాసిన పాటలు క్రైస్తవ సాహిత్యంలో ఎంతో విలువైనవి. వీరు వ్రాసిన అసంఖ్యాకమైన పాటలలో 29 మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

వాటిలో కొన్ని:

👉 నీవు తోడైయున్న జాలు యేసు – నిత్యము నాకదిమేలు

👉 నావన్నీ యంగీకరించుమిదేవ – నన్నెపుడు నీవు కరుణించుమీ

👉 నేను నీ వాడను దేవా – నిక్కంబుగా నేను నీ వాడను దేవా

👉 నిన్ను నేను విడువను దేవా – నీవు నను దీవించువరకు

👉 కూడికొని యున్నాము

👉 కలుగుగాక – దేవా కలుగుగాక

👉 పంపుము దేవా దీవెనలతో

👉 హృదయమనెడు తలుపునొద్ద యేసునాధుండు మొదలగునవి.

అనే అనేకమైన పాటల ద్వారా దేవుని మహిమపరిచి, 1896 లో దేవుని పిలుపు అందుకుని ఆయన సన్నిధికి చేరుకున్నారు….

933 Views
Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account