పురుషోత్తం చౌధరి జీవిత చరిత్ర
పూర్తిపేరు:- పురుషోత్తం చౌధరి
తల్లిదండ్రులు:- కూర్మనాథ చౌధరి, సుభద్రా దేవి చౌధరాణి దంపతులు
జన్మస్థలం:- ఒరిస్సా రాష్ట్రంలోని, గంజాం జిల్లా, మదనాపుర గ్రామం
జననం:- 1803 సెప్టెంబరు 5
రక్షణానుభవం:- 30 సంllల వయస్సులో
భార్యపేరు:- రాధామణి దేవి
మరణం:- 1890 ఆగస్టు 26,
వ్యక్తిగత సాక్ష్యం:-
పురుషొత్తం చౌధరి గారు 1803 సెప్టెంబరు 5 వ తేదీన ఒరిస్సా రాష్ట్రంలోని, గంజాం జిల్లా, మదనాపుర గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు కూర్మనాథ చౌధరి, సుభద్రా దేవి చౌధరాణి. వీరి పూర్వీకులు పశ్చిమ బెంగాలు నుండి ఒరిస్సా ప్రాంతానికి వచ్చి స్థిరపడిన బెంగాల్ బ్రాహ్మణులు. తమ మతాచారాల ప్రకారం పురుషోత్తమ చౌధరి గారికి ఏడు సంవత్సరాలప్పుడే ఉపనయనం జరిపి, గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించారు. పురుషోత్తం చౌధరి గారు బాల్యం నుండే మతనిష్ట కలిగి ఉండేవారు. నిరంతర విగ్రహారాధన, తీర్థయాత్రలతో పాటు భుజాలపై వైష్ణవ మతసూచకాలైన శంఖుచక్రాల్ని కూడ కాల్పించుకొన్నారు. 1823 లో తన మేనమామ కుమార్తె యైన రాధామణి దేవిని వివాహం చేసికొన్నారు. సంస్కృతం, ఒరియా, తెలుగు భాషల్లో ప్రావీణ్యతను సంపాదించి, 20 సంవత్సరాలకే కవిత్వం వ్రాయటం ప్రారంభించాడు. క్రైస్తవ్యాన్ని స్వీకరించక మునుపు చాలా హిందూ మత సంబంధిత భక్తి రచనల్ని చేశారు. ఆయన తన అన్న గారి పాఠశాలలో పనిచేస్తుండేవారు. అప్పుడే క్రైస్తవ్యం పట్ల ఆసక్తి కలిగి, దాని గురించి తెలిసికోవాలనే తపనతో క్రీస్తును అన్వేషించడం మొదలుపెట్టారు. అదే సమయంలో ఆధునిక మిషనరీ పితామహుడుగా పేరుగాంచిన విలియమ్ కేరీ తెలుగులో వ్రాసిన కరపత్రం ఒకటి పురుషోత్తం గారి చేతికి దొరికింది. అది చదివిన పురుషోత్తం గారికి క్రీస్తుని గురించి మరియెక్కువగా తెలుసుకోవాలనిపించింది. దైవ సంకల్పం ప్రకారం మిషనరీ హెలెన్ నాట్ గారు, విలియమ్ డాసన్ మొదలైన క్రైస్తవ ప్రముఖులతో పరిచయం కలగటం, అప్పటికే రెవ. ప్రిచెట్ (1818) తెలుగులో అనువదించిన నూతన నిబంధన తన చేతికందటంతో ఆయన ఆశ నెరవేరింది. పురుషోత్తం చౌధరి గారు దాన్ని బాగా చదివారు. వాక్య పఠనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన విషయాలు తనలో విశ్వాసాన్ని కలిగించాయి. తను అంతవరకు అవలంబిస్తున్న మతాచారాలు, విగ్రహారాధన, తీర్థయాత్రలు అన్నీ తప్పు అని గ్రహించి, 1833 అక్టోబరు 6 వ తేదీన క్రీస్తుని అనుసరించాలని నిర్ణయించుకొన్నాడు. అదే రోజు తన తోటి క్రైస్తవులతో కలిసి ఆరాధిస్తూ “మా యేసుక్రీస్తుని – మరుగు గల్గెనురా
నా యాత్మ ఘన రక్ష – నగము నెక్కెనురా” అనే కీర్తనను పాడారు. ఇది తెలుగులో వెలువడిన మొట్టమొదటి క్రైస్తవ గీతం.
పురుషోత్తం చౌధరి గారు క్రైస్తవుడవ్వడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుండి ఎంతో వ్యతిరేకతను, మరెన్నో అవరోధాలను ఎదుర్కోవలసి వచ్చింది. కాని ఈ శోధనలన్నీ తనలో నిరాశను కలిగించడానికి బదులుగా తాను పొందిన రక్షణానుభవాన్ని ఇతరులకు ప్రకటించాలనే తృష్ణను పెంచాయి.
1836 ఏప్రిల్ 3 వ తేదీన ఆయన భార్య రాధామణి దేవి చౌధరాణి కూడా క్రైస్తవ్యాన్ని స్వీకరించారు. ఆ సంవత్సరమే చౌధరి గారిని మిషనరీగా అభిషేకించారు. అనేక శ్రమలకు, తిరస్కారాలకు గురైనప్పటికీ, విశ్వాసంలో వెనుకడుగు వేయక, వేలకొలది మైళ్ళు కాలినడకను ప్రయాణించి, ఆంధ్రదేశంలో అధికభాగం పర్యటిస్తూ విస్తృత సేవ చేసి, తెలుగు క్రైస్తవ సంఘ పితామహుడయ్యాడు.
చౌధరి గారు మొత్తం 130 ఆణిముత్యాల్లాంటి భక్తి గీతాల్ని వ్రాసి క్రైస్తవలోకానికి కానుకగా ఇచ్చారు. ఈ పాటలన్నీ కేవలం భక్తిపూరితమైనవే కాదుగాని, సాహితీ సంపదతో తొణికిసలాడుతుంటాయి.
కేవలం కీర్తనల్ని మాత్రమే గాక “క్రైస్తవ నీతి ప్రకాశం, సత్య వేద సార సంగ్రహం, కులాచార పరీక్ష” ఇలాంటి ఎన్నో గ్రంథాల్ని కూడా రచించారు. ఆయన రచనల్లో ఎక్కువగా విగ్రహారాధనని ఖండించారు. ఆయన వ్రాసిన ప్రతి పాట స్వీయ జీవితానుభవ లోతుల్లో నుండి పెల్లుబికినదే. అందుకే అవి ఈ నాటికీ తెలుగు క్రైస్తవ సాహిత్యంలో సజీవ సంకీర్తనలుగా నిలిచిపోయాయి. 1882 లో కనుచూపు పూర్తిగా మందగించిన సమయంలో తన కుమార్తెను పిలిపించుకొని, “సకలేంద్రియములారా – చాలు మీ పనిదీరె” అనే పాటను పాడి, ఆమెచే వ్రాయించారు. చివరకు 1890, ఆగస్టు 26 న తన 87 వ యేట ప్రభువుని చేరుకొన్నారు.
పురుషోత్తమ చౌధరి గారి జీవితంపై, ఆయన వ్రాసిన పాటలపై, ఆ పాటలలోని సంగీత సాహిత్యాలపై పరిశోధనలు కూడా వెలువడ్డాయి. ఈ కవి వ్రాసి గానం చేసిన కీర్తనలన్నీ వేటికవే సాటి. అన్నీ పరిశోధనార్హములే. వాటిలో కొన్ని,
మంగళమే యేసునకు – మనుజావతారునకు
దాసుల ప్రార్థన దప్పక యొసగెడు
నన్ను గన్నయ్య రావె నా యేసు – నన్ను గన్నయ్య రావె నా ప్రభువా
త్రాహిమాం క్రీస్తునాథ – దయ జూడ రావే
యెహోవ నా మొర లాలించెను
ఉన్నపాటున వచ్చు – చున్నాను నీ పాద – సన్నిధికోరక్షకా
రారె మనయేసు స్వామిని – జూతము కోర్కెలూర
యేసు నామమే పావనము, మాకు – యేసే గదా నిత్య జీవనం
పైనమై యున్నానయ్యా అనే పాట చౌధరి గారి చివరి కీర్తన.
ఈ పాటలన్నీ మనకు దైవారాధనలో ఉపకరించడమే కాదుగాని, పురుషోత్తమ చౌధరిగారిని చిరస్మరణీయుణ్ణి చేశాయి. ఈ మహనీయుడి జీవితం, పాటలు, తెలుగు క్రైస్తవలోకానికి దేవుడనుగ్రహించిన బహుమానంగా భావించవచ్చు.
ఆంధ్రక్రైస్తవ సంకీర్తనా పితామహుడు, తెలుగు క్రైస్తవ సంఘ పితామహుడు అని పిలువబడే కవిశేఖరుడు చౌధరి పురుషోత్తం గారి పేరు వినని, ఆయన పాట గానం చేయని తెలుగు క్రైస్తవుడు ఉండడనడంలో అతిశయోక్తి లేదు.