సెయింట్ బెనడిక్ట్ జీవితచరిత్ర
పూర్తిపేరు:- సెయింట్ బెనడిక్ట్
జన్మస్థలం:- నర్సియా (ప్రస్తుత ఉంబ్రియాలో), ఇటలీ దేశంలో
జననం:- క్రీ. శ. 480 మార్చి 02
మరణం:- క్రీ. శ. 543 మార్చి 21
వ్యక్తిగతసాక్ష్యము:-
నర్సియాకు చెందిన సెయింట్ బెనడిక్ట్ పాశ్చాత్య క్రైస్తవ సన్యాసము యొక్క స్థాపకుడు. మధ్య ఇటలీలో పేరుప్రఖ్యాతులు కలిగిన ఒక కుటుంబములో జన్మించిన బెనడిక్ట్, తక్కువ వయస్సులోనే సన్యాసి జీవితం వైపుకు ఆకర్షితులయ్యారు. రోమ్‌లో నెలకొనియున్న అన్యదేవతారాధన మరియు అనైతికత్వమును చూసి ఎంతో నిరుత్సాహమొందిన అతను, సన్యాసిగా జీవించుటకై రోమ్‌కు తూర్పున 20 మైళ్ల దూరంలో ఉన్న ఒక గుహకు వెళ్ళారు. ఇతరులతో వీలైనంత తక్కువ సంబంధాలను కలిగియుండుటకు అతను కోరుకున్నారు. తన శరీరమును క్రమశిక్షణలోకి తీసుకువచ్చుటకును, శారీరక విషయములను ఆధీనంలోకి తెచ్చుటకును అతను సమయమును వినియోగించారు.
ఒక చిన్న సన్యాసుల సమూహం తమకు సన్యాసత్వమును బోధించమని అతని యొద్దకు వచ్చి, వారి ఆశ్రమమునకు నాయకత్వం వహించమని అతనిని కోరగా, బెనడిక్ట్ అందుకు అంగీకరించారు. కానీ, బెనడిక్ట్ యొక్క కఠినమైన నియమనిబంధనల వలన ఆ సన్యాసులు అతనిని ద్వేషించి, అతనిని చంపుటకు ప్రయత్నించారు. అయితే, దేవుని చేత రక్షించబడిన అతను మళ్ళీ ఏకాంత జీవితమునకు తిరిగి వచ్చారు. తరువాతి కాలంలో అనేకమంది సన్యాసులు అతని సహాయమును మరియు నడిపింపును కోరినందువలన అతను రోమ్‌లోను మరియు చుట్టుప్రక్కల ప్రాంతములలోను అనేక మఠాలను స్థాపించారు. అతను సన్యాసి జీవితము యొక్క నియమనిబంధనలను వివరిస్తూ ఒక పుస్తకమును వ్రాశారు. ఒక సన్యాసి జీవితము ప్రార్థనా జీవితమును, వాక్య ధ్యానమును, శారీరక కృషిని, ఒక సమాజముగా ఉన్నప్పుడు ప్రేమతో కలిసి జీవించుట మరియు సంపూర్ణ జీవితమును దేవుని చిత్తమునకు సమర్పించుట మొదలగు విషయములను కలిగియుండవలెనని ఆ పుస్తకం సూచిస్తుంది. పాశ్చాత్య దేశాలలో రోమా సామ్రాజ్యం పతనమవుతున్న సమయంలో మరియు అన్యదేవతారాధికులైన అనాగరిక తెగలు ఐరోపాను నియంత్రించుచున్న పరిస్థితులలో అనేకమంది సన్యాసి జీవితమును జీవించుటకు ఈ పుస్తకం సహాయపడింది. ఐరోపా ఖండములో క్రైస్తవ్యానికి ముగింపు వచ్చిందేమో అన్నట్లు ఉన్నాయి అక్కడ పరిస్థితులు.
కాగా క్రైస్తవ విశ్వాసమును సజీవముగా ఉంచుటలో బెనడిక్ట్ యొక్క క్రైస్తవ సన్యాసి మఠాలు పోషించిన పాత్రకు మరేదీ సరితూగదు అని చెప్పబడుతుంది. సన్యాసుల క్రమమును ఏర్పరచినవానిగానే కాక, తన జీవితకాలంలో అనేక అద్భుతకార్యములను చేసినవానిగా కూడా బెనడిక్ట్ పేరుగాంచారు. అతను చేసిన ఎన్నో అద్భుతకార్యాలు బైబిలు గ్రంథములోని ప్రవక్తలు మరియు యేసు క్రీస్తు ప్రభువే స్వయంగా చేసిన అద్భుతకార్యములను పోలి ఉన్నాయి. అన్యదేవతలను ఆరాధించే స్థానిక ప్రజలకు సువార్త ప్రకటించుటకు కూడా అతను సమర్పణ కలిగియున్నారు. ఎంతో వేగముగా సాగిపోతున్న ప్రస్తుత ప్రపంచంలో మన భూసంబంధమైన విధులకు మరియు ఆత్మ యొక్క పిలుపుకు సమానంగా స్పందించడం మిగుల కష్టతరమైనదిగా మనలో చాలా మంది భావించుచుండగా, దేవునికి అంగీకారయుతమైన జీవితమును జీవించుటకు సెయింట్ బెనడిక్ట్ యొక్క జీవితం మనలను ప్రోత్సహించేదిగా ఉంది. విరామం లేని మన దైనందిక కార్యక్రమాల మధ్యలో ప్రార్థనకు ఏవిధంగా కొంచెం చోటు కల్పించాలి అని సతమతమవ్వక రోజువారీ పనులనే ప్రార్థనలుగా మార్చుకొనవలెనని అతని జీవితం మనకు బోధిస్తుంది. చివరికి తన 63 వ యేట ప్రభువు సన్నిధికి చేరుకున్నాడు…