సెయింట్ బోనిఫేస్ జీవితచరిత్ర
పూర్తిపేరు:- సెయింట్ బోనిఫేస్
జన్మస్థలం:- ఇంగ్లాండు దేశంలోని క్రేడిటన్ అను పట్టణంలో
జననం:- 675
మరణం:- 754 జూన్ 05
వ్యక్తిగతసాక్ష్యము:- ఒక గొప్ప కుటుంబములో జన్మించిన బోనిఫేస్ యొక్క అసలు పేరు విన్‌ఫ్రిత్. క్రైస్తవ మిషనరీ సన్యాసులు అనుసరించే ఆదర్శాల నుండి ప్రేరణ పొందిన అతను వేదాంతశాస్త్రములో శిక్షణ పొందవలెనని ఒక క్రైస్తవ ఆశ్రమంలో చేరారు. 30 సంవత్సరాల వయస్సులో పాదిరిగా నియామక అభిషేకం పొందిన అతను, ఆశ్రమంలో ఉన్న కాలంలో లేఖనములను బాగుగా అర్థముచేసుకున్నారు. ప్రారంభ సంవత్సరాలలో లేఖనములను పఠించి ధ్యానించుట, బోధించుట మరియు ప్రార్థనలతో గడిపారు బోనిఫేస్. అయితే మిషనరీ సేవ చేయవలెనన్న వాంఛ అతనిలో మరింతగా ఎదుగుతూ వచ్చింది. కాగా, ఆ ఆశ్రమానికి నాయకత్వం వహించమని అతనిని అడిగినప్పుడు అతను తిరస్కరించి, జర్మనీ తెగలకు సువార్తను తీసుకువెళ్ళవలెనని తన మనస్సును దృఢపరచుకున్నారు. శతాబ్దాలుగా క్రైస్తవులు తమ విశ్వాసమును కాపాడుకొనుటలో ఎంతో స్థిరులుగా ఉన్నారు.
చివరికి వారు హతసాక్షులుగా మరణించవలసి వచ్చినా వారి విశ్వాసం నుండి వారు తొలగిపోలేదు. వారు శ్రమ పొందుటను, హింసింపబడుటను ఒక నష్టముగా భావించక దేవునిలో జీవమును కనుగొనే అత్యున్నతమైన ఘనతగా భావించారు. లూకా 9:24 లో ఈ విధంగా చెప్పబడింది “తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పొగొట్టుకొనును, నా (యేసు) నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించు కొనును.” అటువంటి హతసాక్షులలో ఒకరైన బోనిఫేస్ (అనగా మేలు చేసేవాడు అని అర్ధం), విగ్రహారాధికులైన ఫ్రిసియన్లు (నెదర్లాండ్స్ మరియు జర్మనీకి చెందిన తెగలవారు) క్రీస్తును ఎరుగు నిమిత్తం తన ప్రాణమును కోల్పోవుటకు కూడా వెనుకాడలేదు.
ఫ్రిసియా మరియు జర్మేనియా ప్రాంతాలకు అనేక మిషనరీ ప్రయాణాలను చేపట్టిన బోనిఫేస్, అక్కడ సువార్తను ప్రకటించి, వేలాది మందిని క్రీస్తునొద్దకు నడిపించారు. అతను విగ్రహారాధనను నశింపజేసి విగ్రహారాధికులైన అన్యజనులు బాప్తిస్మం పొంది విశ్వాసులుగా మారులాగున పరిచర్య చేశారు. అతని లక్ష్యం క్రొత్తవారిని క్రీస్తు వద్దకు తీసుకురావడం మాత్రమే కాదు, విశ్వాస కుటుంబములోని సభ్యులను ఉజ్జీవింపజేయడం కూడా. మరికొందరు క్రైస్తవ సన్యాసుల సహాయంతో అతను అబద్ధ బోధనలలోనికి మరియు విగ్రహారాధనలోనికి జారిపోయిన క్రైస్తవ సంఘమును సరియైన రీతిలో పునర్వ్యవస్థీకరించుటకు ఎంతో శ్రమించారు. క్రైస్తవ సంఘములలో ఆలోచనా సభలను ఏర్పరిచారు, మతాధికారులకు మరియు పరిచర్య చేసేవారికి నిర్థిష్టమైన నిబంధనలు పెట్టారు మరియు తప్పుడు మత సిద్ధాంతములను బోధిస్తున్న స్థానికులను ఖండించారు. క్రీ.శ. 754వ సంll లో తన క్రైస్తవ సన్యాసుల బృందంతో ఫ్రిసియాకు వెళ్ళారు బోనిఫేస్. అది ఆ ప్రాంతానికి అతను చేసిన చివరి పర్యటన అయ్యింది. ఏలయనగా, అక్కడ ఒక రోజు అతను ఒక నది దగ్గరలో పరిచర్య కొరకు సిద్ధమవుతుండగా, కౄరత్వంతో నిండుకొనిన ఒక అన్యజనుల సమూహం అతనిపై దాడి చేసి, అతనిని మరియు అతనితో పాటు ఉన్న 53 మంది సహచరులను చంపింది. “జర్మనీవారికి అపొస్తలుడు” గా క్రైస్తవ సంఘ జ్ఞాపకాలలో నిలిచిపోయిన బోనిఫేస్, చివరి వరకు కూడా దేవుని పిలుపుకు నమ్మకముగా జీవించారు.