స్మిత్ విగ్గిల్స్ వర్త్ జీవితచరిత్ర

పూర్తి పేరు:- స్మిత్ విగ్గిల్స్ వర్త్
జన్మస్థలం:- ఇంగ్లాండ్ దేశం
భార్యపేరు:- పాలీ
జననం:- 1859 జులై 10
మరణం:- 1947 మార్చి 12
రక్షణానుభవము:- 8 సంవత్సరాల వయసులో

సేవాఫలితము:- ఫలభరితమైన పరిచర్యను చేసి, దేవుని ఆత్మకార్యములు, అద్భుతములు జరిగించెను.

వ్యక్తిగతసాక్ష్యం:- స్మిత్ విగ్గిల్స్ వర్త్ ఇంగ్లాండ్ దేశమందు 1859 జూలై 10వ తేదీన ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. చిన్న వయసులోనే పనికి వెళుతున్నందున స్కూల్ కి వెళ్లి చదువులేకపోయెను. పెద్దవాడైన తరువాత సంతకం చేయటం మాత్రం నేర్చుకొనెను. తన ఎనిమిది సంవత్సరాల వయసులో వాళ్ళ నాయనమ్మతో పాటు ఒక సువార్త మీటింగ్ కి వెళ్లి ఏసుక్రీస్తుకు తన హృదయమును అప్పగించుకొనెను. అప్పటినుండి ఇతరులను కూడా రక్షణలోనికి నడపాలనే ఆశతో ఉండెను. మొదటిగా తన తల్లిని రక్షణలోనికి నడిపించెను. 1882వ సంవత్సరంలో పాలీ అనే భక్తి కలిగిన స్త్రీని వివాహము చేసుకొనెను. చదువుకున్న తన భార్య ద్వారా స్మిత్ కూడా బైబిల్ చదువుట నేర్చుకొనెను. స్మిత్ ప్రసంగించుచున్నప్పుడు అతనికి నత్తి ఉండటం వలన, సరిగ్గా చదువుకోనందున, వాగ్దాటి లేని మూలాన అతని ప్రసంగం విన్నవారు విసుగుకొనేవారు. అయితే నిరుత్సాహపడని స్మిత్ ప్రార్థనాపరురాలైన తన భార్యతో పాటు పిల్లల మధ్య సేవ ప్రారంభించి వారికి బైబిల్ కథలు నేర్పించి రక్షణలోనికి నడిపించేవాడు. కొన్నిసార్లు స్మిత్ భార్య తన పక్షమున ప్రసంగించేది.

అయితే స్మిత్ – నత్తి పెదవులు గల మోషేను వాడుకున్న దేవా..! ఆది అపోస్తలులపై నీ ఆత్మను కుమ్మరించి వాక్ శక్తిని ఇచ్చిన దేవా..! నన్ను బలపరచవా.? నన్ను వాడుకొనవా..? ఆని చేసిన ప్రార్థనకు ఫలితంగా ఆత్మ నింపుదలను పొందెను. అద్భుతముగా దేవుడు ఆయనకు శక్తినిచ్చి ప్రసంగంచుటకు వాడుకొనెను. పాపులు రక్షించుబడుట, దయ్యములు పట్టినవారు విడిపించబడడం ఆయన సేవలో కనబడెను. ఒకరోజు బస్సులో వెళ్లుచున్నప్పుడు స్మిత్ నోరు తెరిచి బిగ్గరగా సువార్తను ప్రకటించెను. ఆ ప్రసంగం విన్న బస్సులోని వారందరూ కన్నీరు కార్చి పశ్చాత్తాపపడిరి. స్మిత్ వారందరి కొరకు చేతులుంచి ప్రార్ధించెను. ప్రభువు కొరకు సమస్తాన్ని అనగా ఆడంబర జీవితాన్ని విడిచి సాధారణమైన వ్యక్తిగా జీవిస్తూ దేవుని సేవలో కొనసాగెను. అతను దేవునిపై ప్రేమను, ప్రజలపై కనికరమును కలిగి ఉండేవాడు.

ప్రతి 15 నిమిషాలకు ఒకసారి బైబిల్ చదవకపోయినచో నేనుండలేను, ప్రతి అరగంటకు ఒకసారైనా మోకరించకుండా నేనుండలేను. ప్రార్థనే నా జీవితము, ప్రార్థనే నా ఊపిరి అంటుండేవాడు.. ఒకసారి రైలులో ప్రయాణిస్తున్నప్పుడు వ్యాధిగ్రస్తులైన ఒక తల్లిని, బిడ్డను చూచెను. మీ వ్యాధికి నా దగ్గర మంచి మందు ఉన్నది అని స్మిత్ చెప్పినప్పుడు అయ్యా ఆ మందు మాకు ఇవ్వండి అని వారు అడిగిరి. అప్పుడు స్మిత్ తన సంచిలో నుంచి బైబిల్ తీసి (నిర్గమ 15:26) చదివి వారి కొరకు ప్రార్ధించెను. వెంటనే వారు స్వస్థత పొందిరి. ఈ విధంగా అనేకులను రక్షణలోనికి నడిపించేవాడు. కొన్ని దినముల తరువాత 1913 జనవరి 01వ తేదీన తన సతీమణి నూతన సంవత్సరపు ఆరాధనలో ప్రసంగించుచున్నప్పుడు హఠాత్తుగా మరణించెను. అయితే స్మిత్ యేసు నామములో తన భార్యను బ్రతికించుకొనెను. బ్రతికి కూర్చున్న తన భార్య నన్ను ఎందుకు పిలిచారు ఈ లోకంలో నా పరిచర్యను ముగించుకున్నాను. నా ప్రభువు నన్ను పిలుచుచున్నాడు నన్ను పోనివ్వండి అనెను. అయితే స్మిత్ ఇంకనూ ఆమె జీవం కొరకు దేవునితో పోరాడుచుండగా కుమారుడా నీ భార్య ఈ లోకంలో తన పరుగును కడముట్టించెను. నేను ఆమెను చేర్చుకున్నాను అన్న దేవుని మెల్లని స్వరము విని తన భార్యను దేవునికి అప్పగించుకొనెను. ఆ తర్వాత తన 72వ సంవత్సరములో తన ఆయుష్షు పూర్తయినట్లు దేవుడు తనకు బయలుపరిచెను. కానీ స్మిత్ ఇంకా ఎంతోమంది నశించుచున్నారు, ఇంకా నీ కొరకు చేయవలసిన పని ఎంతో ఉన్నది. హిజ్కియాను కనికరించినట్లుగా నాకును ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్షు ఇచ్చునట్లు కనికరించుమని ప్రార్ధించెను.. ఆయన ప్రార్థన వినిన ప్రభువు మరొక 15 సంవత్సరాలు కంటిచూపు తగ్గకుండా, ఒక్క పన్ను కూడా ఊడకుండా స్మిత్ ను కాపాడి అతనిని వాడుకొనెను. ఆయన ఫలభరితమైన పరిచర్యకు, ఆత్మ కార్యములకు ముఖ్య కారణాలు ఆయన దేవుని వాక్యమును అధికముగా ప్రేమించి, పఠించి, ధ్యానించువాడు. తన సొంత శక్తి మీద ఆధారపడక దేవునిపై అంచలంచల విశ్వాసము కలిగి ఉండేవాడు. ఆయన సువార్త సేవ తో పాటు సువార్తికులను సమకూర్చి వారందరూ ఎల్లప్పుడూ ఐక్యత కలిగి ఏక మనసుతో పరిచర్య చేయాలని, అప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలను చూడగలమని చెబుతుండేవాడు. అలాగు ఆయన వృద్ధాప్యంలో అనగా దేవుడు ఇచ్చిన కృపాకాల ఆయుష్షుతో కలిపి 88 సంవత్సరములు యుద్ధవీరుని వలే జీవించి, 1947వ సంవత్సరం మార్చి 12వ తేదీన ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు..

311 Views
Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account