విల్ ఫ్రెడ్ గ్రెన్ ఫెల్ జీవితచరిత్ర

పూర్తిపేరు:- విల్ ఫ్రెడ్ గ్రెన్ ఫెల్
తల్లిదండ్రులు:- రెవ.ఆల్ గార్నన్ సిడ్నీ గ్రెన్ ఫెల్ దంపతులు
జన్మస్థలం:- ఇంగ్లాండ్ లోని, ఛీషైర్ నందు
జననము:- 1865 ఫిబ్రవరి 28
భార్యపేరు:- ఆన్ఎలిజిబెత్ మేక్లహాన్
రక్షణానుభవము:- 20 సంవత్సరాల వయసులో మరణము:- 1940 అక్టోబర్ 16

సేవాఫలితము:- లాబ్రాడార్ మంచు పర్వతాల్లో ఎస్కిమోల మధ్య సువార్త ప్రకటన చేసి వారిని క్రీస్తు కొరకు సంపాదించడమే గాక ఎంతో శ్రమతో ఆ ప్రజలకు వైద్య సేవలు మరియు సామాజిక సేవలు ఎన్నో అందించాడు.

వ్యక్తిగతసాక్ష్యము:- విల్ ఫ్రెడ్ గ్రెన్ ఫెల్ 1865 ఫిబ్రవరి 28న ఇంగ్లాండ్ దేశంలో జన్మించాడు. ఇతని తండ్రికి సముద్రం అంటే చాలా ఇష్టం. విల్ ఫ్రెడ్ తండ్రి మరియు అతని సోదరుడు సముద్రంలో చేపల వేటకు వెళ్లి రోజులు తరబడి గడిపేవారు. సముద్రయానం కూడా చాలా ఇష్టపడేవారు. అందువలన విల్ ఫ్రెడ్ కు కూడా సముద్రంలో ఆటలు, ప్రయాణాలు బాగా అలవాటయ్యాయి. ఆ తర్వాత 14 సంవత్సరాలకు స్కూల్లో చేరిన విల్ ఫ్రెడ్ అనారోగ్య కారణంగా రెండేళ్ళకే ఇంటికి తిరిగివచ్చి చదువు కొనసాగించాడు. ఇతని 18వ యేట అతని తండ్రి ప్రభువును నమ్మి ఒక ఆసుపత్రికి చాప్లిన్ అయ్యాడు. అయితే తన బిడ్డలు ఇద్దరూ దేవుని సేవకులు కావాలని అతను కోరేవాడు. విల్ ఫ్రెడ్ డాక్టర్ కావాలని వైద్య కళాశాలలో చేరాడు. ఆ సమయములో డి.ఎల్. మూడీ గారి ఉజ్జీవ కూటములకు విల్ ఫ్రెడ్ హాజరై ఆయన ప్రసంగానికి ముగ్ధుడై క్రీస్తును రక్షకునిగా అంగీకరించాడు. అప్పటినుండి క్రీస్తు కొరకు బ్రతకాలనే ఆశ కలిగింది. ప్రభువు కోసం ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తుండగా ప్రముఖ క్రికెటర్ సి.టి. స్టడ్ యొక్క సాక్ష్యం వినే అవకాశం కలిగింది. అతను క్రికెట్ నుండి ప్రభువు కోసం చైనా, ఆఫ్రికాలలో భారంగా పనిచేసిన విధానము విల్ ఫ్రెడ్ కి ఆదర్శం అయినది.

తన వైద్య వృత్తిని ప్రభుత్వ సేవకోసము సమర్పణ చేయాలని తీర్మానం చేసుకున్నాడు. అయితే అప్పటి నుంచి సండే స్కూల్ పిల్లలకు ప్రభువును గురించి బోధించేవాడు. లండన్లోని బహు నికృష్టమైన మురికివాడలను దర్శించి సేవ చేసేవాడు. వారి యొక్క పేదరికము, బాధలు ఇతనిని ఎంతో బాధించేవి. మానవాతీతుడై రోగుల బాధలను గ్రహించాలి, వారికి సహాయం చేయాలి, ప్రజలంతా కూడా దేవుని యొక్క సంతానమే. దేవుడు మనకు ఇచ్చిన వరాలను, తలాంతులను, విద్యను అనేకులకు ఉపయోగపడేలా చేయాలని ఆరాటపడేవాడు. అయితే చిన్నతనంలో ఓడ బొమ్మలు గీస్తూ…. ఓడల్లో అనేక నెలలపాటు ప్రాణాలపై ఆశ విడిచి ప్రయాణం చేస్తున్న ప్రజలు దేవుని వాక్యము లేక ఎంత అలమటించిపోతారో, మధ్యలో చనిపోయిన వారి సమాధి కార్యక్రమం నిర్వహించడానికి దైవసేవకులు లేకపోవడం ఎంతో బాధాకరం కదా అని ఆలోచిస్తూ ఉండేవాడు.ఆ మాటలు మరలా గుర్తు చేసుకునేవాడు. పడవలో వేటకై సముద్రంలోనికి వెళ్లి వారాల తరబడి, నెలల తరబడి ప్రయాణాలు చేస్తూ భూమిపైన కొద్దికాలమే గడిపే ఇలాంటి వారికి సువార్త వద్దా? ప్రమాదంలో చిక్కుకున్న వారికి వైద్య సదుపాయాలు ఎవరు కలుగజేస్తారు? అని ఆలోచిస్తూ దేవునికి ప్రార్థన చేసేవాడు.

అయితే ఇంగ్లాండ్ లో ‘రాయల్ నేషనల్ సొసైటీ’ వారు ఇతని ఆశయాలను గ్రహించి సముద్రంలో ప్రయాణం చేసే వారితో ఉండి వారి కోసం ఆసుపత్రి ఏర్పాటు చేసి తనను సహాయము చేయమని అడిగారు. దానికి విల్ ఫ్రెడ్ అంగీకరించాడు. అలా ఓడలో పరిచర్య ప్రారంభిస్తూ చివరికి మంచు భాగముతో నిండి ఉండే లాబ్రాడార్ అనే ఎస్కిమో జాతి వారు నివసించే స్థలానికి చేరుకున్నాడు. అక్కడి ప్రజలు జీవన విధానము, వైద్యం గురించి తెలియని అజ్ఞానము, ప్రభువును ఎరుగని అవివేకతను బట్టి విల్ ఫ్రెడ్ కు వారి పట్ల బాధ్యతను పెంచాయి. వైద్య పరిచర్య ప్రారంభించిన విల్ ఫ్రెడ్ కావలసిన వసతులు, సహాయం గురించి ఆలోచించాడు. లండన్లో తెలిసినవారిని సహాయం కోసం అర్ధించాడు. అలా ‘సెయింట్ జాన్ వ్యాపార సంఘం’ ఆసుపత్రుల నిర్మాణానికి ముందుకు వచ్చి ఆ ప్రాంతంలో మంచి ఆస్పత్రులను నిర్వహించి ఉత్తమ వైద్యులను రప్పించాడు. ఆ తర్వాత క్రమంగా తీర ప్రాంతాల్లోని గ్రామాలు, పల్లె పల్లెల్లో తిరుగుతూ వైద్య సేవలు అందిస్తూ, సువార్త ప్రకటన చేశాడు. అలాగే ఆ ప్రజల కోసం ఒక స్కూలు కూడా ప్రారంభించాడు. అంతేకాకుండా వారికి ఉపాధి కల్పించాలని ఆ విధంగా కృషి చేశాడు. అందుకోసం ఒక సహకార సంఘాన్ని స్థాపించాడు. అలా వారి దగ్గర ఉండే చర్మాలు, బొచ్చు, చేపలు ఇచ్చి ఇతర బట్టలు, వస్తువులు కొనుక్కునే ఏర్పాటు చేశాడు. విపరీతమైన చలి కారణంగా పిల్లలు అనేక మంది చనిపోయారు. చాలామంది అనాధలుగా మిగిలిపోయారు. ఇలాంటి వారికోసం అనాధ శరణాలయాలు స్థాపించి, పేద పిల్లలను చేరదీసి, పాఠశాలలో చేర్చి ప్రభువును గురించి బోధించేవాడు. ఒకసారి ఓడ ప్రమాదము ద్వారా లాబ్రడార్ తీర ప్రాంతంలో ఎంతో నష్టం వాటిల్లింది. అయినప్పటికీ నిరుత్సాహపడకుండా ఓడ ప్రమాదాలను నివారించుట కొరకు ఒక మంచి ఓడరేవును కట్టాడు. అలాగే వేసవి కాలంలో పరిమితమైన కూరగాయల పెంపకాన్ని వారికి నేర్పించాడు. అలా దేశమంతా నర్సింగ్ హోమ్ లను స్థాపించాడు. అయితే ఈ విధమైన సామాజిక సేవను బట్టి ప్రభువు పరిచర్యను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. దారిద్ర్యములో నలిగిపోయిన లాబ్రడార్ ప్రజలు విల్ ఫ్రెడ్ ప్రేమకు లొంగీపోయి ఆయనకు స్ఫూర్తిదాత అయిన ప్రభువును గురించి తెలుసుకొని ఎంతో మంది రక్షణ పొందారు. అయితే మంచు పర్వతాల్లో అనేకమైనటువంటి ప్రమాదాలను ఎదుర్కొన్నాడు. ఒకసారి ఓ బాలుడికి వైద్య సహాయం చేయడానికి కుక్కల బండిపై వెళ్తుండగా మంచు కరిగి పైకి వెళ్ళడానికి మార్గం లేకుండా పోయింది. బాధతో చనిపోతాను అనుకున్న తనకు దేవుడు చక్కని ఆలోచన ఇచ్చి బండికున్న మూడు కుక్కలను చంపి వాటి చర్మాలను కప్పుకుని బ్రతికాడు. అయితే వాటి కాళ్ళను కర్రగా కట్టి ఎర్రగుడ్డ కట్టి పైకి ఎత్తి ఊపినప్పుడు ఒక వ్యక్తి అతని రక్షించాడు. కొన్నాళ్ళు ఆసుపత్రిలో ఉన్నాడు. ఆ విధంగా ఎంతో శ్రమతో లాబ్రాడార్ ప్రజలకు వైద్య మరియు ఇతర సామాజిక సేవలు అందించడంతో పాటు ప్రభువును కూడా వారికి పరిచయం చేసి, క్రీస్తు కొరకు సంపాదించి అనేక మంది మిషనరీలు ఆ స్థలానికి వెళ్లి సువార్త ప్రకటించే విధంగా ఎంతో కృషి చేసి చివరికి 1940 అక్టోబర్ 16 వ తేదీన ప్రభు సన్నిధికి చేరాడు.

గొప్పపలుకు:- మానవులు ఏ రంగువారైనా, ఏ రూపం కలిగినవారైనా, ఏ జాతివారైనా, ఏ ఖండంవారైనా అందరూ దేవుని సంతానమే. అయితే దేవుడు మనిషికి ఇచ్చిన వరాలు పరులకు ప్రయోజనకరం గావించకుంటే అతడొక నిర్భాగ్యుడు, అయోగ్యుడు.

287 Views
Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account