సహోదరుడు యున్ జీవిత చరిత్ర
పూర్తిపేరు:- యున్ (లియు జెన్‌యింగ్)
జననం:- 1958 జనవరి 01
మరణం:-
జన్మస్థలం:- చైనా దేశంలోని నాన్యాంగ్
వ్యక్తిగతసాక్ష్యం:- ‘సహోదరుడు యున్’ అని పిలువబడే లియు జెన్‌యింగ్ ఎన్నో శ్రమలను హింసలను ఎదుర్కొన్నప్పటికీ, చైనా దేశంలో క్రీస్తు యొక్క సాక్షిగా నిలిచిన నమ్మకమైన దైవసేవకులు. అతని తండ్రి అద్భుతమైన రీతిలో స్వస్థత నొందిన పిమ్మట, తన పదహారవ ఏట క్రీస్తును అంగీకరించారు యున్. ఆపై దేవుని వాక్యమును తెలుసుకొనవలెననే అమితమైన వాంఛ, తీరని దాహం అతనిలో ఆరంభమయ్యాయి! చదువుటకు ఒక బైబిలును కలిగియుండవలెనని అతను వాంఛించారు గానీ, బైబిలును కలిగి ఉండటం చైనా దేశంలో చట్టవిరుద్ధం కావడంతో బైబిలును సంపాదించుటకు అతను చేసిన ప్రయత్నాలు విఫలయత్నాలగానే మిగిలిపోయాయి. అందువలన అతను అనేక దినములు ఉపవాసముండి ప్రార్థించారు. చివరికి నూరవ రోజున అతని ప్రార్థనలకు సమాధానం లభించింది! ఆ రోజున ఎలాగో ఇద్దరు సువార్తికులు అతని ఇంటికి వచ్చి ఒక బైబిలును అతనికి అందించారు. బైబిలును పొందుటతో మిగుల సంతోషించిన అతను ప్రతిరోజూ ఒక అధ్యాయమును చదివి కంఠస్థం చేయడం ప్రారంభించారు.
తరువాత అతను దేవుని ఆత్మచేత నడిపింపబడినవారై తన ఇంటిని విడిచిపెట్టి, పశ్చిమ చైనా వైపుగా పయనమయ్యారు. యున్ తన సాక్ష్యమును మరియు సువార్తను తెలియజేస్తూ గ్రామం నుండి గ్రామానికి వెళ్ళారు. అతను వాక్చాతుర్యం కలిగిన గొప్ప వక్త కాకపోయినప్పటికీ, అతని ప్రతి కూడిక యొక్క ముగింపులో అనేక మంది తమ పాపముల కొరకు పశ్చాత్తాపపడి విలపించుచుండెడివారు. అయితే యున్ “శక్తి ప్రభావములు దేవుని వాక్యములో ఉన్నవి కానీ, నాలో కాదు!” అని చెప్పేవారు. రోజులు గడిచేకొద్దీ అతని రహస్య పరిచర్య కూడా కాలంతో పాటు అభివృద్ధి చెందింది. దేవుని యందలి భయభక్తులు కలిగిన డెలింగ్ అనే స్త్రీని అతను వివాహం చేసుకున్నప్పుడు, “నీవు నన్ను వివాహం చేసుకుంటే, మన దగ్గర అంత ఎక్కువ డబ్బు ఉండదు. పైగా ఆరాధన కూడికలను నిర్వహిస్తున్నందుకు నేను అరెస్టు కూడా చేయబడవచ్చు” అని ఆమెతో చెప్పారు. అందుకు డెలింగ్ “అందుకై చింతించనవసరం లేదు, నేను మిమ్ములను ఎన్నడూ నిరాశపరచను” అని బదులిచ్చారు. చివరికి అది నిజమైంది. యున్ అనేకసార్లు అరెస్టు చేయబడినప్పుడు డెలింగ్ అతనికి ఆదరణ ఆధారములనిస్తూ ఒక స్థంభముగా అతనితో పాటు నిలబడ్డారు. చెరసాలలో ఎదుర్కొన్న భయానకమైన మరియు మిగుల బాధాకరమైన అనుభవములన్నింటిలో దేవుని వాగ్దానములను జ్ఞప్తికి తెచ్చుకుంటూ వారిరువురు ఆయనయందు ఎల్లప్పుడూ సంతోషముగా ఉన్నారు.
యున్ చివరికి చైనా నుండి తప్పించుకొని 2001వ సంll లో జర్మనీకి వెళ్ళారు. అప్పటి నుండి అతను విస్తృతంగా ప్రయాణించి, ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతములలో సువార్తను ప్రకటించారు. వారు అనుభవిస్తున్న హింస మరియు శ్రమల కారణంగా ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న బలమైన మరియు ధైర్యవంతులైన క్రైస్తవులలో చైనా క్రైస్తవులు ఉన్నారని, ఇంకా సువార్త ప్రకటింపబడని ప్రాంతములకు మిషనరీలుగా వెళ్ళుటకు వారు సిద్ధముగా ఉన్నారని యున్ అభిప్రాయపడతారు. కాగా “బ్యాక్ టు జెరూసలేం” అనే ఉద్యమరూపకమైన పరిచర్య ద్వారా సహోదరుడు యున్ ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో సేవ చేయుటకు ప్రస్తుతం చైనా నుండి మిషనరీలను పంపుతున్నారు.