Numbers – సంఖ్యాకాండము

ఇశ్రాయేలీయులు అవిశ్వాసము, అవిధేయత వలన దాదాపుగా 40 సంవత్సరాలు అరణ్యములో సంచరించిన చరిత్రనే సంఖ్యాకాండము చెప్పుచున్నది. హెబ్రీమూల భాషలో దీనికి చెప్పబడిన మొదటి మాట వాక్వేతెబర్ (చెప్పబడినది) అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞ అని దాని అర్ధము. ఆజ్ఞ అరణ్య ప్రయాణం ప్రారంభంలోనే ఇశ్రాయేలీయులలో యుద్ధమునకు వెళ్ళుటకు అర్హులు ఎంత మంది అని లెక్కించి తీర్మానించాలి. దాదాపుగా 38 సంవత్సరముల తరువాత రెండవ సారి ఒక లెక్కింపు జరిగినది. అప్పుడు వారి అరణ్య ప్రయాణపు చివరి ఘట్టములో మోయాబు మైదానములోనికి వచ్చిరి. ఆ సమయములో మోషే ఎదుట ఉన్నవారిలో ఇద్దరు తప్ప తక్కిన వారంతా రెండవ తరమువారు. ఈ రెండు లెక్కింపులు ఈ పుస్తకము యొక్క పేరుకు బలమునిచ్చేవిగా నున్నవి. జన సంఖ్య లెక్కింపులో నేర్చుకొనవలసిన శ్రేష్ఠమైన పాఠం ఒకటున్నది. మొదటి లెక్కింపు జరిగినపుడు యుద్ధవీరులుగా లెక్కించబడినవారు ఆరు లక్షలుకు పైగానున్నారు. వారందరు అరణ్యములో రాలిపోయిరి. ఏదేమైనప్పటికి కనానులో కాలు మోపే సమయమునకు ఇంకొక ఆరు లక్షలకు పైగా యుద్ధవీరులు యుద్ధ భూమిలోనికి దుమికిరి. దేవుని యొక్క ఉద్దేశ్యములు ఎల్లప్పుడు సరిఅయిన సమయములో నెరవేరును. దానిని ఎవరు అడ్డుకొనలేరు.

అధిక సంచార పయనం : కాదేషు బర్నేయలో నుండి కనాకు వెళ్ళుటకు పదకొండు దినముల ప్రయాణము చాలును. దానికి బదులుగా 38 సంవత్సరాలు అరణ్యమార్గమున సంచరించి కష్టములు అనుభవించిరి. దేవుడు 95 కీర్తనలోని రెండు వచనములలో ఇశ్రాయేలీయుల క్లిష్ట పరిస్థితిని గూర్చి చెప్పెను నలువది యేండ్ల కాలము ఆ తరమువారి వలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలిసికొనలేదని అనుకొంటిని. కావున నేను కోపించి – వీరెన్నడును నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసితిని. (కీర్తనల గ్రంథము 95:10-11)

అన్ని పాపములకు నివాసం అవిశ్వాసమే. దాని ఫలితం సర్వనాశనమని హెబ్రీ గ్రంథకర్త ఈ చరిత్రను జ్ఞాపకము చేసికొని 3, 4 అధ్యాయములలో విశదీకరించెను. ఈ విధంగా దేవుని ప్రజల మధ్యకు వచ్చిన అవిశ్వాసము అనే పాపము విపత్తులకు విత్తనములు విత్తినది. వారు అరణ్యములో చనిపోయిరి. ప్రధానయాజకుడైన అహరోను ఆయన సహోదరి మిర్యాము వాగ్దాన దేశమును చూడకుండా పోయిరి. మోషే ప్రజలను బట్టి విసుగుచెంది కోపగించుకుని దేవుని ఎదుట పాపము చేయడం జరిగినది. సీను అరణ్యములో నీరులేకజనులు సణిగినపుడు నీరు ఇమ్మని బండతో మాట్లాడమని దేవుడు ఆజ్ఞాపించెను. మోషే రెండు మారులు బండను కొట్టెను. కాబట్టి వాగ్దాన దేశమును చూడటం మాత్రమే గాని, దానిలో నీవు కాలు పెట్టవు అని దేవుడు చెప్పెను. మోషే పిస్గా కొండ శిఖరమున మరణించెను. సంఖ్యాకాండము 26 నుండి 33 వరకు ఉన్న అధ్యాయములలో మోయాబు మైదానములోనికి వచ్చిన క్రొత్త తరము వారు కనానును స్వతంత్రించుకొనుటకు దేవుడు వారిని స్థిరపరచడాన్ని చూస్తున్నాము. దేవుని దీర్ఘశాంతము, నమ్మకత్వము ఇక్కడ ప్రత్యక్షమగుచున్నది. యెహోషువ మోషేకు బదులుగా దేవుని ప్రజల నూతన నాయకునిగా అభిషేకం చేయబడడం ఇక్కడ చూడవచ్చును.

ఉద్దేశ్యము : వాగ్దాన దేశములోనికి ప్రవేశించుటకు ఇశ్రాయేలీయులు ఏలాగు తెగించిరి? వారి యొక్క పాపము ఏలాగు శిక్షించబడినది? వారు ఇంకను ప్రవేశింప ఏలాగు ప్రయత్నించిరి?

గ్రంథకర్త : మోషే

కాలము : క్రీ.పూ 1450 నుండి 1410

గతచరిత్ర : సీనాయి ప్రాంతపు పెద్ద యిసుక ఎడారి కనానుకు ఈశాన్యములో ఉన్న ప్రాంతము.

ముఖ్య వచనములు : సంఖ్యాకాండము 14:22-23; సంఖ్యాకాండము 20:12.

ముఖ్యమైన వ్యక్తులు : మో షే, అహరోను, మిర్యాము, యెహోషువ, కాలేబు, ఎలియాజరు, కోరహు, బిలాము.

ముఖ్యమైన స్థలములు : సీనాయి పర్వతము, వాగ్దాన దేశమైన కనాను, కాదేషు బర్నేయ, హోరేబు కొండ, మోయాబు మైదానము.

గ్రంథ విభజన : సంఖ్యా కాండమును మూడు ముఖ్యమైన భాగములుగా విభజించవచ్చును. 1. ప్రయాణమునకైన సిద్ధపాటు ప్రయాణ ప్రారంభము 1 – 13 అధ్యాయములు, 2. అవిశ్వాసము వలన తిరుగులాడిన స్థితి 14 – 25 అధ్యాయములు, 3. కనానును ఆక్రమించుకున్న క్రొత్త తరమును సిద్ధపరచుట 26 – 36 అధ్యాయములు

కొన్ని క్లుప్తమైన వివరములు : పరిశుద్ధ గ్రంథములో నాలుగవ గ్రంథము; అధ్యాయములు 36; వచనములు 1288 ; ప్రశ్నలు 59 ; నెరవేరిన ప్రవచనములు 42; నెరవేరని ప్రవచనములు 15; దేవుని సందేశములు 72; ఆజ్ఞలు 554 ; వాగ్దానములు 5; హెచ్చరికలు 79.

1023 Views
Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account