Psalms – కీర్తనల గ్రంథము
పరిశుద్ధ గ్రంథము యొక్క హృదయాంతరంగములో నుండి లేచు సంగీతమువలె కీర్తనల గ్రంథము దాని మధ్య అమర్చబడియున్నది. పరిశుద్ధ గ్రంథములోనే ఎంతో పెద్దదిగాను, ఎక్కువగా ఉపయోగించబడేదిగాను – ఈ గ్రంథమున్నది. మానవ అనుభవముల యొక్క ప్రత్యేకమైనదియు, అనుదిన జీవితముతో సంబంధము గలిగినదియునైన ప్రతి భాగములను ఇవిముట్టుచున్నవి. వీటిలో ఇమిడియున్న 150 పాటల యొక్క ముఖ్యాంశములో సృష్టి ఆరంభము నుండి ఇశ్రాయేలు చెరకొనిపోబడిన కాలమువరకు విస్తరించబడియున్నది. గోత్ర కర్తల కాలము న్యాయాధిపతులు రాజ్యమేలినకాలము, రాజపరిపాలన కాలము, చెరపట్టబడిన కాలము అను పలు రకములైన కాలములతో నిండియున్న కీర్తనలు ఈ గ్రంథములో నున్నవి. వీటిలో ఇమిడియున్న కర్తవ్యము ఆశ్చర్యము కలిగించేవిగానున్నవి. వాటిలో దైవీక ఆనందము, యుద్ధము, సమాధానము, ఆరాధన, న్యాయ తీర్పు, ప్రవచనము, స్తుతి, విలాపము అను పలు విధములైనవియున్నవి. సంగీత వాయిద్యముల సహాయముతో దేవాలయ ఆరాధనలో ఆలపింపబడేవిగా ఈ గానములు వ్రాయించబడినవి. యూదా ప్రజల పాటల వరుసగాను భక్తి మార్గదర్శిగాను పరిగణించబడుచూయున్నది.
ఉద్దేశము : కవిత్వముతో కూడిన స్తుతిని, ఆరాధనను, ఒప్పుదలను ప్రత్యక్షపరచుట.
ముఖ్యమైన మనుష్యులు : దావీదు
ముఖ్యమైన స్థలము : దేవాలయము
ముఖ్యమైన మాట : ఆరాధన
ముఖ్యమైన వచనములు : కీర్తనల గ్రంథము 19:14; కీర్తనల గ్రంథము 145:21
ముఖ్యమైన అధ్యాయము : కీర్తన 100
కొన్ని కీర్తనలలో పరిశుద్ధ గ్రంథము యొక్క చాలచక్కటి సారాంశములు పాడబడినవి కనుక ఏదైన ఒక కీర్తనను ఇది ముఖ్యమైనది అనుచెప్పుట చాలా కఠినము. 1, 22, 23, 24, 27, 72, 100, 101, 119, 121, 150 కీర్తనలు ముఖ్య మైనవే. 100వ కీర్తనలో స్తుతి, ఆరాధన అను రెండు భాగములు సమతల స్థితిలో ఏకమైయున్నవి. కనుక ఈ కీర్తనను ప్రాముఖ్యమైన అధ్యాయము అను స్థలములో ఉంచవచ్చును.
గ్రంథ విభజన : కీర్తనలను 5 స్కంధములుగా విభజించబడియున్నవి. ఒక్కొక్క స్కంధము ఒక స్తుతితో ముగించబడుచున్నది. 150వ కీర్తన 5వ పుస్తకమునకు పూర్తి పుస్తకమునకు ముగింపు స్తుతి. 5 స్కంధములకు వరుసగా క్రింద ఇవ్వబడియున్నవి.
ప్రథమ స్కంధము : 1వ కీర్తన నుండి 41 వరకు వీటి సాధారణ విషయసూచిక మానవుడు అని చెప్పవచ్చును. మానవుని నిజమైన స్థితి ఆశీర్వాదకరమైన స్థితి. పతనము, విమోచన అనునవి ఈ పాటలు చిత్రించుచున్నవి.
ద్వితీయ స్కంధము : 42వ కీర్తన నుండి 72వ కీర్తన వరకు ఇశ్రాయేలీయులు ముఖ్య పాత్రగా యున్నారు. 42 నుండి 49 వరకు గల పాటలు వారి పతనమును 50 నుండి 60 వరకు గల పాటలు వారి విమోచనకుడను, 61 నుండి 72 వరకు వారికి లభించు విమోచనమును గూర్చి చెప్పబడియున్నది.
తృతీయ స్కంధము : కీర్తన 73 నుండి 89 వరకు దేవాలయము అనగా పరిశుద్ధ ఆలయము దీని ముఖ్యాంశము సైన్యముల కధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు అను ప్రారంభించు 84వ కీర్తన చూడండి.
చతుర్ధ స్కంధము : కీర్తన 90 నుండి 106 వరకు. ఇది భూమిని గూర్చియు దానికి దొరకనైయున్న,
దొరకుచున్న దీవెనలను గూర్చియు పాడుచున్న సొగసైన పాటలు.
పంచమ స్కంధము : కీర్తన 107 నుండి 150 వరకు. దేవుని వాక్యమే ఈ పాటల యొక్క ముఖ్యమైన సారాంశమ. దేవుడు తన వాక్కును పంపి స్వస్థపరచుటను గూర్చి 107వ కీర్తనలో చెప్పబడియున్నది. 176 వచనములు కలిగిన 119వ కీర్తన యొక్క ప్రతి వచనము కూడ భక్తి గల మానవులకు దేవుని వాక్యము అనుగ్రహించు దీవెనలను పాడి ప్రస్తావించుచున్నది.
ఇక ఒక పాటను పరిశీలించినట్లయితే మొదట దేవునితో మాట్లాడునట్లుగాను, తరువాత తన స్థితి వివరముగాను దానికి తరువాత మరల దేవుని గూర్చి మాట్లాడునట్లు గాను, అమర్చబడియుండుట చూడగలము హెబ్రీ కవిత్వములతో ఈ లాంటివి సాధారణమైనవే.
కొన్ని ముఖ్యమైన వివరములు : పరిశుద్ధ గ్రంథము యొక్క 19వ పుస్తకము ; అధ్యాయములు 150; వచనములు 2,461; చారిత్రాత్మిక వచనములు 2027; నెరవేరిన ప్రవచనములు 160; నెరవేరని ప్రవచనములు 274; ప్రశ్నలు 164; ఆజ్ఞలు 413; దేవుని క్రియలు 338; తీర్మానములు 124; దేవస్తుతులు 174; నిందలు చూపుట (విజ్ఞాపనలు) 118; యూదాను గూర్చినవి 72; దేవుని సత్యములు 865; దేవుని వచనములను గూర్చినవి 235; సాక్ష్యములు ప్రకటనలు 182; వాగ్దానములు 97; మెస్సీయాను గూర్చినవి 128; ఆశీర్వాదములు 281; పాటల గ్రంథకర్తలను గూర్చినవి 190; న్యాయక్రియలు 78; దుష్ట క్రియలు 101; పాపములు 233; విజ్ఞాపనలు 582; విజ్ఞాపనకు కారణములు 187.