Zephaniah – జెఫన్యా
ఇశ్రాయేలు దేశము రెండు ముక్కలుగా చీలగా, యెరూషలేము రాజధానిగానున్న దక్షిణ రాజ్యమే, యూదా దేశము. దీని ఆత్మీయ, రాజకీయ చరిత్రలలో పునరుద్ధీకరణలు, పరిశుద్ధ పరచబడుట పలుమారు జరిగియున్నవి. ఆమోను కుమారుడైన యోషీయా పరిపాలనా కాలములో ఇట్టి సంఘటన యొకటి సంభవించెను. అనగా దేవుని వైపు మళ్లుకొనుట జరిగెను. శుద్ధీకరణ పొందుటకై జెఫన్యా ప్రజలకిచ్చిన
ఆహ్వానము యోషీయా కాలములో జరిగిన ఉజ్జీవమునకు ప్రోత్సాహములను ఇచ్చియుండును. ఈ కాలములో యూదా ప్రజల జీవితములో బాహ్యముగా పలుమార్పులు కలిగినవి. అయినను ప్రజల అంతరంగములలో తగినంత మార్పు రాలేదు. శుద్ధీకరణ కొంతవరకే ప్రయోజన కరముగా నుండెను. కావున అప్పటి పరిస్థితులకు అనుగుణంగా జెఫన్యా – మహాభయంకరమైన యెహోవా దినము రాబోవుచున్నది. అప్పుడు ప్రతిపాపము ప్రతి దుష్టత్వము మిక్కిలి కఠినముగా దండింపబడును అని ఉచ్చై స్వరముతో ప్రవచించెను. దేవుని కోపాగ్నికి యూదాదేశముతో బాటు దాని చుట్టునున్న దేశములు కూడ కాలిపోవునని జెఫన్యా ప్రవచించెను. ప్రవచనము ప్రకారము వినాశము సంభవించిన తరువాత మిగిలిన ప్రజలు మెస్సీయ పరిపాలనా కాలముతో మహిమకరమైన ఆశీర్వాదములను స్వతంత్రించుకొందురు. అప్పుడు స్తోత్రమును సంతోషమును కలుగును అని జెఫన్యా ప్రవచించాడు. జెఫన్యా అనగా యెహోవాదాచును అని అర్థము. మిక్కిలి దుష్టుడైన రాజైన మనష్హే పరిపాలన ఉత్తరార్థములో జెఫన్యా జన్మించాడు. మనష్హె క్రూరత్వము నుండి యెహోవా అతనని మరుగుచేశాడు అను విషయమును ఈ నామము సూచిస్తుంది.
గ్రంథకర్త : గ్రంథములో వ్రాయబడిన ప్రథమ వచనము, దానిని వ్రాసిన జెఫన్యాను కొంచెము భిన్నమైన రీతిలో పరిచయము చేస్తున్నది. జెఫన్యా తన వంశమునకు చెందిన నలుగురు రాజుల నామములను ఈవచనములో వ్రాస్తున్నాడు. దీనిని బట్టి జెఫన్యా యూదా రాజుల వంశస్థుడనియు, అతడు ప్రవక్త ఆయెననియు తెలియుచున్నది. ఈ బంధుత్వము బట్టి రాజు సన్నిధిలో మంచి పదవిని, దేవుని వర్తమానమును ప్రకటించు స్వాతంత్ర్యమును కలిగియుండును. జెఫన్యా 1:6 లో యెరూషలేమును గూర్చి ఈ స్థలములో అని చెప్పుచున్నాడు. అంతమాత్రమే కాకుండా యెరూషలేమునకు గల ప్రత్యేకత అనేక వచనములలో చెప్పబడినది జెఫన్యా 1:9-10; జెఫన్యా 3:1-7. దీనిని బట్టియు జెఫన్యా యెరూషలేము నివాసీ అని తెలియుచున్నది.
కాలము : ఆమోను కుమారుడైన యోషీయా దినములలో అని గ్రంథము ప్రారంభమగుచున్నది. కావున యోషీయా కాలమును బట్టి జెఫన్యా కాలమును నిర్ణయింపగలుగుచున్నాము. యోషీయా క్రీ.పూ 640 నుండి 609 వరకు పాలించెను. జెఫన్యా 2:13 లో నీనెవె పతనము క్రీ.పూ . 612లో జరిగినది. కావున జెఫన్యా క్రీ.పూ 612 కంటె ముందే ప్రవచించెనని తెలియుచున్నది. కావున జెఫన్యా ప్రవచించిన కొలతలు క్రీ. పూ 640 – 621 మధ్య కాలమని భావింపవచ్చును. ఈ కాలమును నిర్ణయించుటకు గల ఆధారములను ఇంకను స్పష్టముగా పరిశీలింతుము. జెఫన్యా 1:3-13; జెఫన్యా 3:1-7 మున్నగు వాక్య భాగములలో వివరింపబడియున్న పాపముల పట్టికను పరిశీలించినచో ఈ వాక్యములు యోషీయా చేపట్టిన పునరుద్ధరణకు ముందుగా వ్రాయబడెననుట సుష్పష్టము. ఆయన ప్రవచించిన కాలములో మనషె కాలములో ఆమోను కాలములో బలపడిన పాపస్థితి కొనసాగుచునేయున్నది.
యోషీయా 8 సంవత్సరములవయస్సులో రాజాయెను. 16 సంవత్సరముల వయస్సులో ఆయన హృదయము దేవుని వైపు తిరుగసాగెను. అతడు తన పునరుద్ధీకరణ కార్యక్రమమును తన 12వ సంవత్సరమున ప్రారంభించెను. (క్రీ.పూ 628 లో 2 దినవృత్తాంతములు 24:3-7) బయలు దేవతాబలిపీఠమును పడగొట్టెను; ఉన్నత స్థలములను కూల్చివేసెను. విగ్రహములను ధ్వంసముచేసెను. అతడు యూదాదేశమును యెరూషలేమును శుద్ధీకరించెను. మరల 6 సంవత్సరములకు పిమ్మట క్రీ.పూ. 622 లో యాజకుడైన హిల్కియా, దేవాలయములో కనుగొనిన ధర్మశాస్త్ర గ్రంథమును చదివిన తరువాత మరియొక మారు, శుద్ధీకరణను చేపట్టుటకు పూనుకొనియుండెను. (2 దినవృత్తాంతములు 34:8; 2 దినవృత్తాంతములు 34:35-19) ఈ ఆధారముల ద్వారా జెఫన్యా కాలము క్రీ.పూ 640 – 621 అని స్థిరపరచబడినది. మనషే ఆమోనుల దుష్టపరిపాలన 57 సంవత్సరములు కొనసాగెను. అది యూదా ప్రజలపై బలమైన యొక దుష్టముద్రను వేసెను. యూదా అట్టి దుష్ట ప్రభావముల నుండి బయటపడుట ఎన్నటికిని సాధ్యపడలేదు. యోషీయా చేపట్టిన పునరుద్ధరణ కార్యములు చాలా ఆలస్యమగుట వలన పునరుద్దరణ తగినంత ప్రభావముతో వ్యాప్తిజెందలేదు. ఆయన మృతిజెందిన తరువాత ప్రజలు ఎప్పటివలే తమ పాత దుర్మార్గములకు, విగ్రహారాధనలకు మరలుకొన్నారు. యిర్మీయా, హబక్కూకు అనువారికి సమకాలికుడైన జెఫన్యా యూదా నాశనమునకు కొంచెము చివరి కాలములో జీవించెనని మనము ఒప్పుకొనవచ్చును.
ముఖ్య పదజాలము : ప్రభువుదినము.
ముఖ్య వచనములు : జెఫన్యా 1:14-15; జెఫన్యా 2:3
ముఖ్య అధ్యాయము : జెఫన్యా 3. జెఫన్యా యొక్క ఈ చివరి అధ్యాయములో ప్రభువు దినమును గూర్చి రెండు గుణ లక్షణములను గురించి న్యాయ తీర్పును, విమోచన గూర్చి వ్రాయబడినది మిక్కిలి గమనించవలసినది.
గ్రంథ విభజన : ఈ గ్రంథమును రెండు ముఖ్య కార్యములు మనము చూడగలము. తీర్పు, రక్షణ.
(1) ప్రభువుదినము న్యాయ తీర్పు, శిక్ష Zep,1,1 -3,8.
(a). లోకమంతటి మీదికి వచ్చు శిక్ష జెఫన్యా 1:1-3. (b). యూదా మీదికి వచ్చు శిక్ష Zep,1,4-2,3. (C). యూదా చుట్టునున్న దేశముల మీదికి వచ్చు న్యాయ తీర్పు జెఫన్యా 2:4-15. (d). యెరూషలేమునకు విరోధమైన న్యాయతీర్పు జెఫన్యా 3:1-7. (e). లోకమంతటి మీదికి వచ్చు న్యాయతీర్పు జెఫన్యా 3:8.
(2). ప్రభువు దినమున కలుగు రక్షణ జెఫన్యా 3:9-20.
(a). మారుమనస్సును గూర్చిన వాగ్దానము జెఫన్యా 3:9-13. (b). విమోచనను గూర్చిన వాగ్దానము జెఫన్యా 3:14-20.
సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో ఇది 36వ పుస్తకము. దీనిలోని అధ్యాయములు 3; వచనములు 53; ప్రశ్నలు లేవు; ఆజ్ఞలు 14; వాగ్దానములు 4; హెచ్చరికలు 86; ప్రవచనవాక్యములు 45; నెరవేరిన ప్రవచనములు 5; నెరవేరనున్న ప్రవచనములు 40; దేవుని నుండి వచ్చిన ప్రత్యేక వర్తమానములు 4. (జెఫన్యా 1:2; జెఫన్యా 2:1; జెఫన్యా 3:1-8).